భారత్‌కు చేరిన అరుణాచల్‌ప్రదేశ్ యువకుడు
27 January 2022, 15:03 IST
- Arunachal teen missing case | ఈ నెల 18న అదృశ్యమైన అరుణాచల్‌ప్రదేశ్ యువకుడిని.. చైనా సైన్యం భారత్‌కు అప్పగించింది. భారత సైన్యం విజ్ఞప్తి మేరకు యువకుడి కోసం గాలించిన చైనా పీఎల్ఏ, చివరికి అతడి వివరాలు సేకరించి విడుదల చేసింది.
భారత్‌కు చేరిన అరుణాచల్‌ప్రదేశ్ యువకుడు
China PLA India | ఈ నెల 18న అదృశ్యమైన అరుణాచల్‌ప్రదేశ్ యువకుడిని చైనా సైన్యం గురువారం భారత్‌కు అప్పగించింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిరెన్ రిజిజు వెల్లడించారు.
"చైనా పీఎల్ఏ.. మిరామ్ తారోన్ను భారత సైన్యానికి అప్పగించింది. ప్రస్తుతం సైన్యం అతడికి వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది," అని రిజిజు ట్వీట్ చేశారు.
అపహరించారా.. అదృశ్యమయ్యాడా?
అరుణాచల్‌ప్రదేశ్ షియాంగ్లోని సియుంగ్లాలో మిరామ్ తారోన్ అనే 19ఏళ్ల యువకుడు అదృశ్యమయ్యాడు. అతడు అదృశ్యమైన ప్రాంతం.. వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉంటుంది. అయితే తారోన్ అదృశ్యమవ్వలేదని, పీఎల్ఏ(పిపుల్స్ లిబరేషన్ ఆర్మీ) అతడిని అపహరించిందని అరుణాచల్‌ప్రదేశ్‌లోని బీజేపీ ఎంపీ తాపిర్ గావో ఆరోపించారు.
ఈ వ్యవహారంపై వెంటనే స్పందించిన భారత సైన్యం.. పీఎల్ఏను సంప్రదించింది. యువకుడి ఆచూకి కనుగొనేందుకు సహకరించాలని కోరింది. కొన్ని రోజుల తర్వాత.. ఓ వ్యక్తిని తమ భూభాగంలో గుర్తించినట్టు చైనా సమాచారం అందించింది. తదుపరి చర్యలు చేపట్టే ముందు.. తగిన వివరాలు అందించాలని స్పష్టం చేసింది. ఫలితంగా తారోన్ వ్యక్తిగత వివరాలు, అతడి ఫొటోను పీఎల్ఏకు అధికారులు ఇచ్చారు.
ఈ విషయంపై భారత సైన్యం- పీఎల్ఏ మధ్య బుధవారం సంభాషణ జరిగింది. యువకుడిని త్వరలోనే అప్పగిస్తామని పీఎల్ఏ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని రిజిజు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.