తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  భోజనం ఆలస్యమైందని.. పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయిన వరుడు!

భోజనం ఆలస్యమైందని.. పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయిన వరుడు!

Sharath Chitturi HT Telugu

21 February 2022, 22:34 IST

google News
    • బిహార్​ పుర్ణియాలో.. ఓ వరుడు పెళ్లికి కొద్దిసేపటి ముందు.. మండపాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. బారాత్​ తర్వాత తమ బంధువులకు సమయానికి భోజనం పెట్టలేదన్న కారణంతో అతడు వెళ్లిపోవడం ఆశ్చర్యకర విషయం. దీనిపై వధువు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయిన వరుడు!
పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయిన వరుడు! (Hindustan times)

పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయిన వరుడు!

వివాహ వేడుకలు అర్థాంతరంగా ఆగిపోయిన ఎన్నో ఘటనలను ఈ మధ్యకాలంలో మనం వింటూనే ఉన్నాము. వైరల్​గా మారిన ఆ దృశ్యాలను చూస్తూనే ఉన్నాము. తాజాగా.. బిహార్​ పూర్ణియాలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. వరుడు.. ఒక్కసారిగా పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయాడు. తమ బంధువులకు.. సమయానికి భోజనం పెట్టలేదనే కోపంతో అతడు ఈ పనిచేసినట్టు తెలుస్తోంది.

కోపం వచ్చేసింది..

బటౌనా గ్రామంలోని ఈశ్వరీ టౌలాలో కొన్ని రోజుల క్రితం ఓ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వరుడు.. బారాత్​లో పెళ్లి మండపానికి చేరుకున్నాడు. కోలాహలంతో ఆ ప్రాంగణం నిండిపోయింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ.. కొద్ది సేపటికే.. జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది.

బారాత్​ ముగించుకుని అనుకున్న సమయానికి పెళ్లి మండపానికి వెళ్లింది వరుడు రాజ్​కుమార్​ బృందం. కానీ వారికి భోజనం ఆలస్యమైంది. బహుశా మంచి ఆకలి మీద ఉన్నారు అనుకుంటా.. వరుడి తరఫున బంధువులకు చిర్రెత్తుకొచ్చింది. ఇక రాజ్​కుమార్​ తండ్రి అయితే ఏకంగా అక్కడి వారిని తిట్టడం మొదలుపెట్టారు. పెళ్లి ఆపేసి, వెనక్కి వెళ్లిపోదామని ఆయన నిర్ణయించుకున్నారు.

కానీ అక్కడి స్థానికులు, పంచాయతీ పెద్దలు వరుడి తండ్రిని శాంతింపజేసే పనిలో పడ్డారు. కొద్దిసేపు.. ఆ తండ్రిని బుజ్జగించారు. శాంతించిన తండ్రి.. పెళ్లికి ఒప్పుకున్నాడు. ఇక సమస్య పరిష్కారమైనట్టే! అన్న దశలో మరో ట్విస్ట్​ ఎదురైంది. 

వరుడు రాజ్​కుమార్​.. అప్పటికే పెళ్లి మండపాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఇక చివరికి పెళ్లిని నిలిపివేశారు. అయితే వరుడు తండ్రి.. పెళ్లి ఖర్చులు వధువు తండ్రికి ఇచ్చినట్టు తెలుస్తోంది. బైక్​, ఇతర కానుకలకు సంబంధించిన నగదును వధువు కుటుంబానికి తిరిగిచ్చేసినట్టు సమాచారం.

ఈ కథ ఇంతటితో ముగియలేదు. ఆ తర్వాత.. వధువు తల్లి నేరుగా కస్బా పోలీస్​ స్టేషన్​కు వెళ్లింది. జరిగింది అంతా చెప్పి, వరుడు, అతడి తండ్రిపై ఫిర్యాదు చేసేసింది. అప్పుడే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ప్రస్తుతం ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు.

తదుపరి వ్యాసం