Road connectivity to Amarnath cave: పవిత్ర అమర్ నాథ్ క్షేత్రానికి రోడ్డు మార్గం సిద్ధం; అతిపెద్ద నేరమన్న పీడీపీ
08 November 2023, 10:52 IST
Road connectivity to Amarnath cave: ప్రసిద్ధ, పవిత్ర పుణ్య క్షేత్రం అమర్ నాథ్ కు రోడ్డు మార్గం సిద్ధమైంది. దుమాయిల్ (Dumail) నుంచి బాల్తాల్ బేస్ క్యాంప్ (Baltal base camp) ద్వారా అమర్ నాథ్ గుహ (Amarnath cave) వరకు ఈ రోడ్డును సిద్ధం చేశారు.
అమర్ నాథ్ కు రోడ్డు మార్గం
Road connectivity to Amarnath cave: బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) జమ్మూ మరియు కాశ్మీర్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన అమర్‌నాథ్‌కు రోడ్డు మార్గాన్ని నిర్మించింది. ఇప్పుడు పవిత్ర పుణ్య క్షేత్రం అమర్ నాథ్ ను వివిధ వాహనాల ద్వారా చేరుకోవచ్చు. రోడ్డు మార్గం సిద్ధం కావడంతో భక్తులు అమరనాథుడిని మరింత సులభంగా దర్శించుకోవచ్చు. ప్రస్తుతం ఈ మార్గం ద్వారా వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. దుమాయిల్ (Dumail) నుంచి బాల్తాల్ బేస్ క్యాంప్ (Baltal base camp) ద్వారా అమర్ నాథ్ గుహ (Amarnath cave) వరకు ఈ రోడ్డు మార్గాన్ని నిర్మించారు.
బీఆర్ఓ ఆధ్వర్యంలో..
గతంలో.. గందర్‌బల్ జిల్లాలోని బల్తాల్ ట్రాక్‌ను జమ్మూకశ్మీర్ ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) నిర్వహించేది. అలాగే, అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ మార్గాన్నిపహల్గామ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PDA) నిర్వహించేది. గత ఏడాది సెప్టెంబర్‌లో, అమర్‌నాథ్ యాత్ర ట్రాక్‌ల నిర్వహణ మరియు అప్‌గ్రేడేషన్ బాధ్యతలను బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) కు అప్పగించారు.
అతి పెద్ద నేరం
కాగా, ఈ రోడ్డు నిర్మాణాన్ని జమ్మూకశ్మీర్ లోని ప్రధాన పార్టీ పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (PDP) తీవ్రంగా విమర్శించింది. హిందువుల విశ్వాసాల పట్ల కేంద్రం అతి పెద్ద నేరం చేసిందని ఆరోపించింది. అమర్ నాథ్ గుహ వరకు రోడ్డు వేయడాన్ని చరిత్ర సృష్టించడం అని కేంద్రం చెప్పుకుంటోందని, అయితే, నిజానికి అది హిందువుల విశ్వాసాల పట్ల అతి పెద్ద నేరం చేయడమని విమర్శించింది. అమర్ నాథ్ గుహ వద్దకు రోడ్డు వేసి, హిందూ విశ్వాసాలను దెబ్బ తీశారని విమర్శించింది. పవిత్ర పుణ్య క్షేత్రాలను పిక్నిక్ స్పాట్స్ గా మారుస్తున్నారని మండిపడింది. ప్రకృతి ఆగ్రహిస్తే ఎలా ఉంటుందో కేదార్ నాథ్, జోషి మఠ్ లలో చూశామని, అదే పరిస్థితి కశ్మీర్ కు తీసుకువస్తున్నారని మండిపడింది.
అన్ని అనుమతులతోనే..
అయితే, అమర్ నాథ్ క్షేత్రానికి రోడ్డు మార్గం వేసే ముందు అన్ని పర్యావరణ జాగ్రత్తలు తీసుకున్నారని బీజేపీ సమాధానమిచ్చింది. పర్యావరణ ప్రభావ అంచనా (Environmental Impact Assessment) తరువాతే ఈ నిర్మాణం ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ నిర్మాణం కోసం కనీసం ఒక్క చెట్టును కూడా కొట్టివేయలేదని తెలిపింది.
12 వేల అడుగుల ఎత్తున..
అమర్ నాథ్ క్షేత్రం శ్రీనగర్ కు 141 కిమీల దూరంలో ఉంటుంది. ఈ పవిత్ర పుణ్య క్షేత్రం హిమాలయాల్లో లాదర్ లోయ ప్రాంతంలో 12, 756 అడుగుల ఎత్తున ఉంటుంది. దాదాపు సంవత్సరమంతా ఇది మంచుతో కప్పబడి ఉంటుంది. ఏటా లక్షలాది భక్తులు ఈ పుణ్య క్షేత్రాన్ని దర్శించుకుంటారు. ఈ సంవత్సరం 4.5 లక్షల మంది అమర్ నాథ్ యాత్రకు వచ్చారు.