VICE-PRESIDENT candidate | ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి అమరీందర్ సింగ్!?
02 July 2022, 18:20 IST
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీయే అభ్యర్థిగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. త్వరలో ఆయన తన `పంజాబ్ లోక్ కాంగ్రెస్` పార్టీని బీజేపీలో విలీనం చేసి, ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతిగా పోటీ చేస్తారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
కెప్టెన్ అమరీందర్ సింగ్
ప్రస్తుతం అమరీందర్ సింగ్ అమెరికాలో ఉన్నారు. వెన్నుముక సర్జరీ కోసం ఆయన యూఎస్ వెళ్లారు. ఆయన యూఎస్ నుంచి వచ్చిన తరువాత తన `పంజాబ్ లోక్ కాంగ్రెస్` పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభం అవుతుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
VICE-PRESIDENT candidate : కాంగ్రెస్ సీనియర్ లీడర్
అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌లో సీనియర్ నేత. పంజాబ్ ముఖ్యమంత్రిగా సమర్ధవంతంగా విధులు నిర్వర్తించారు. పార్టీ చీఫ్ సోనియా గాంధీకి సన్నిహితుడైన నాయకుడిగా పేరుంది. అయినా, పంజాబ్‌లో మరో లీడర్, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో విబేధాల సమయంలో అధిష్టానం సిద్ధూకే సపోర్ట్ చేయడంతో, అమరీందర్ పార్టీకి రాజీనామా చేశారు.
VICE-PRESIDENT candidate : బీజేపీలో చేరుతారా?
అయితే, కెప్టెన్ అమరీందర్ సింగ్ లాంఛనంగా బీజేపీలో చేరుతారా? అన్న విషయంలో స్పష్టత లేదు. తన `పంజాబ్ లోక్ కాంగ్రెస్` పార్టీని బీజేపీలో విలీనం చేసే సమయంలో, అమరీందర్ కూడా బీజేపీలో చేరుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఆ కార్యక్రమం ఈ నెలలోనే ఉంటుందని, ఆ తరువాత ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఆయనను ప్రకటిస్తారని వెల్లడించాయి. లేదా, అందుకు సమయం అనుకూలించనట్లయితే, ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అమరీందర్ సింగ్‌ను ప్రకటించిన తరువాత పార్టీ విలీన ప్రక్రియను ఆయన భార్య ప్రణీత కౌర్ నిర్వహించే అవకాశముంది. అయితే, ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు.
ఆగస్ట్ 6 న ఎన్నిక
ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్ట్ 6న జరగనుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జులై 5న వెలువడుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జులై 19. అధికార, విపక్షాల అభ్యర్థుల ప్రకటన జులై రెండో వారంలో వెలువడే అవకాశముంది. పార్లమెంటు ఉభయ సభల సభ్యలు మాత్రమే ఓటేసే ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికే విజయావకాశాలున్నాయి. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం ఆగస్ట్ 10న ముగుస్తుంది.