Saamana on Ajit Pawar : ‘శిందేను తప్పించి అజిత్ పవార్ సీఎం అవుతారు- బీజేపీ ప్లాన్ ఇదే!’
03 July 2023, 10:48 IST
Saamana on Ajit Pawar : అజిత్ పవార్, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడుతూ సామ్నా దినపత్రికలో వ్యాసం రాసుకొచ్చింది ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం. శిందేను తప్పించి, పవార్ సీఎం అవుతారని ఆరోపించింది.
దేవేంద్ర ఫడణవీస్‌తో అజిత్ పవార్..
Saamana on Ajit Pawar : మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపణలు సృష్టించిన డిప్యూటీ సీఎం, ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడింది ఉద్దవ్ ఠాక్రేకు చెందిన శివసేన. ఏక్నాథ్ శిందేను తప్పించి మహారాష్ట్ర సీఎం అవ్వాలన్న ఉద్దేశంతోనే బీజేపీతో అజిత్ పవార్ చేతులు కలిపినట్టు ఆరోపించింది. ఈ మేరకు తమ పత్రిక సామ్నాలో ఓ వ్యాసం రాసుకొచ్చింది.
‘పవార్‌తో శిందేకే ముప్పు..!’
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపునకు దారి తీస్తూ.. ఆదివారం మధ్యాహ్నం ప్రభుత్వంతో కలిశారు అజిత్ పవార్. ఆ వెంటనే డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఆయనతో పాటు వెళ్లిన పలువురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ పరిణామాలు ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్‌ను షాక్‌కు గురిచేశాయి. తాజాగా ఈ వ్యవహారంపై సామ్నా పత్రికలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం.
"డిప్యూటీ సీఎంగా ప్రమాణాలు చేస్తూ అజిత్ పవార్ రికార్డు సృష్టించారు. కానీ ఈసారి బలమైన ఒప్పందమే జరిగింది. డిప్యూటీ సీఎం పదవి కోసం పవార్ అక్కడికి వెళ్లలేదు. ఏక్నాథ్ శిందేతో పాటు ఆయన వెంట వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుంది. ఆ తర్వాత సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం చేస్తారు. కానీ ప్రజలు దీనిని సహించరు. ఇలాంటి వాటికి ప్రజలు మద్దతివ్వరు," అని మరాఠా దినపత్రిక సామ్నా రాసుకొచ్చింది.
ఇదీ చూడండి:- Ajit Pawar : ‘బీజేపీతో కలిస్తే తప్పేంటి? ఎన్సీపీ మొత్తం నావెంటే ఉంది!’- అజిత్ పవార్
వాస్తవానికి అజిత్ పవార్‌తో శిందేకే ముప్పు ఎక్కువగా ఉందని, ఈ విషయం ఆయనకు కూడా తెలుసని ఆరోపించింది సామ్నా.
"అజిత్ పవార్ వల్లే తాము ఉద్ధవ్ ఠాక్రేను వదిలేస్తున్నామని గతేడాది రెబల్ ఎమ్మెల్యేలు చేప్పారు. పవార్‌ను ఉద్ధవ్ కంట్రోల్ చేయలేకపోయారని ఆరోపించారు. మరి వారందరు ఇప్పుడేం చేస్తారు? ఎన్సీపీ వల్లే శివసేనను వదిలేస్తున్నామని చెప్పిన వారి పరిస్థితేంటి? వారి ముఖల్లోనే ఆందోళన కనిపిస్తోంది. అజిత్ పవార్ వల్ల తమ రాజకీయ భవిష్యత్తు అంధకారమైందని వారికి కూడా తెలుసు," అని సామ్నా పేర్కొంది.
బీజేపీపైనా ఆరోపణలు..
సామ్నా ఎడిటోరియల్‌లో బీజేపీ, దేవేంద్ర ఫడణవీస్పైనా ఆరోపణలు వెల్లువెత్తాయి.
"ఎన్సీపీ ఓ అవినీతి పార్టీ అని, వారితో ఎప్పటికి కలవము అని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ గతంలో చాలాసార్లు అన్నారు. మరి ఇప్పుడేం చేశారు? బీజేపీ నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది," అని సామ్నా పేర్కొంది.
ఇదేమీ భూప్రకంపనలు సృష్టించే విషయం కాదని, అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలపుతారని చాలా మందికి ముందే తెలుసని సామ్నా వివరించింది.