తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  National Herald Case: ఈడీ ముందుకు సోనియా.. మీడియాను అనుమతించట్లేదన్న కాంగ్రెస్

National Herald case: ఈడీ ముందుకు సోనియా.. మీడియాను అనుమతించట్లేదన్న కాంగ్రెస్

HT Telugu Desk HT Telugu

21 July 2022, 10:25 IST

google News
    • National Herald case: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు హాజరుకానున్నారు.
ఈడీ ముందు హాజరుకానున్న సోనియా గాంధీ
ఈడీ ముందు హాజరుకానున్న సోనియా గాంధీ (HT_PRINT)

ఈడీ ముందు హాజరుకానున్న సోనియా గాంధీ

National Herald case:: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించనున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు మీడియాను ఇక్కడి ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలోకి రాకుండా అడ్డుకుంటున్నారని ఆ పార్టీ గురువారం ఆరోపించింది. ఈ చర్య నరేంద్ర మోదీ ప్రభుత్వ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందని విమర్శించింది.

ప్రతిపక్ష పార్టీ తమ అధ్యక్షురాలిని ఈడీ ప్రశ్నించడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టడానికి సిద్ధమవుతోంది. పార్టీ అగ్ర నాయకత్వానికి వ్యతిరేకంగా ఈడీ చర్యను ‘రాజకీయ ప్రతీకారం’గా నిందించింది.

‘ఈరోజు తెల్లవారుజాము నుండి ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంమంత్రి నుండి స్పష్టంగా ఆదేశాలు తీసుకున్నారు. మీడియాను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ చర్య ఊహించినదేనని, మోదీ సర్కార్ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తున్నదని ఆయన అన్నారు.

నేషనల్ హెరాల్డ్-అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ విచారణలో ప్రశ్నించడానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు గురువారం ఈడీ ముందు హాజరుకానున్నారు. దీనిపై నిరసన వ్యక్తం చేసేందుకు పార్టీ అగ్రనేతలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యాలయంలో సమావేశమవుతారు.

గత నెలలో సోనియా గాంధీ కుమారుడు, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఈడీ ఈ కేసుకు సంబంధించి ప్రశ్నించినప్పుడు కూడా ఇలాంటి నిరసనలు జరిగాయి.

రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించిన సందర్భంలో పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులను నిర్బంధించి సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి అర్ధరాత్రి విడుదల చేశారు.

కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పోలీసుల వైఖరిపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్‌లకు ఫిర్యాదు చేశారు.

తదుపరి వ్యాసం