Accidental firing of Brahmos missile: పాకిస్తాన్‌పై పొరపాటున మిస్సైల్ పేల్చారు
23 August 2022, 19:17 IST
పొరపాటున బ్రహ్మోస్ క్షిపణిని పాకిస్తాన్‌పైకి పేల్చారు. ఈ ఘటన ఈ సంవత్సరం మార్చ్‌లో జరిగింది. అంతర్గత విచారణ అనంతరం ఈ పొరపాటుకు బాధ్యులుగా పేర్కొంటూ ముగ్గురు ఎయిర్‌ఫోర్స్ అధికారులను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది.
బ్రహ్మోస్ క్షిపణి
Accidental firing of Brahmos missile: అనుకోకుండా వారి గగన తలంలోకి..
ఈ సంవత్సరం మార్చి నెలలో అనుకోకుండా బ్రహ్మోస్ క్షిపణిని వాయు సేన అధికారులు పేల్చారు. ఆ క్షిపణి క్షణాల్లో పాక్ గగనతలంలోకి వెళ్లి అక్కడి భూభాగం పై పడిపోయింది. అయితే, ఆ క్షిపణికి ఎలాంటి వార్‌హెడ్‌ను అమర్చలేదు. దాంతో, అది ఆ భూభాగంపై పడిపోయింది. కానీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టానికి కారణం కాలేదు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. ఈ ప్రమాదానికి సాంకేతిక లోపం కారణమై ఉండొచ్చని పేర్కొంది. వెంటనే అంతర్గత విచారణకు ఆదేశించింది. విచారణ అనంతరం ఈ పొరపాటుకు కారణమైన ముగ్గురు ఎయిర్‌ఫోర్స్ అధికారులను విధుల నుంచి తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ 23న ఆదేశాలు జారీ చేసింది.
Accidental firing of Brahmos missile: పాక్ సీరియస్
తమ గగన తలంపైకి క్షిపణిని పేల్చడంపై పాకిస్తాన్ సీరియస్ అయింది. పాక్‌లోని భారత రాయబారిని పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్రహ్మోస్ క్షిపణి 40 వేల అడుగుల ఎత్తున, శబ్ధ వేగం కన్నా మూడు రెట్లు అధిక వేగంతో పాక్ గగనతలంపై దాదాపు 100 కిమీల లోపలికి వచ్చిందని పాకిస్తాన్ వెల్లడించింది. ఒకవేళ ఆ క్షిపణి ఏదైనా పౌర విమానాన్ని ఢీ కొట్టి ఉంటే భారీ ప్రమాదం చోటు చేసుకునేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించింది.