7th pay commission DA hike News: ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంచిన కేంద్రం
06 April 2023, 11:11 IST
- 7th pay commission DA hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ 34 శాతం నుంచి 38 శాతానికి పెరిగింది.
ప్రభుత్వం 4 శాతం డీఏ పెంచిన కేంద్ర ప్రభుత్వం
Dearness allowance: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద ఊరటనిస్తూ బుధవారం (సెప్టెంబర్ 28) ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను 4 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో దాదాపు 1.16 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందే అవకాశం ఉంది.
తాజా పెంపుతో డీఏ 34 శాతం నుంచి 38 శాతానికి చేరుకుంది. 4 శాతం డీఏ పెంపుతో కనీస వేతనం అందుకునే వారికి రూ. 720 పెరుగుతుంది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మూల వేతనం రూ. 18,000 అయితే, 34 శాతం ప్రకారం రూ. 6,120 డీఏ పొందేందుకు అర్హులు. డీఏ 38 శాతం కాగానే 4 శాతం పెంపుతో ఉద్యోగికి రూ. 6,840 లభిస్తుంది. అంటే రూ. 720 అదనంగా అందుతుంది.
ఈ అదనపు మొత్తం పండుగ సీజన్‌లో డిమాండ్‌ను పెంచడానికి ఉద్దీపనగా పని చేస్తుంది. ముఖ్యంగా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ డిమాండ్ పెరుగుతుందని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఏడాది ద్వితీయార్థంలో కరువు భత్యాన్ని కేంద్ర మంత్రివర్గం సవరించాల్సి ఉంది. దీని కోసం ఉద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి నుండి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, అధిక ద్రవ్యోల్భణం కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లందరికీ కేంద్ర మంత్రివర్గం డీఏ(dearness allowance) పెంచింది.
7వ వేతన సంఘం సిఫారసుల ప్రకారం..
7వ వేతన సంఘం సిఫారసుల ప్రకారం 2021 జూలైలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ డీఏను పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆ సమయంలో డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచారు.
దీనికి అదనంగా అక్టోబరులో మరోసారి కేంద్రం డీఏ పెంచింది. 2021 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా 3 శాతం డీఏ పెంపునకు గత ఏడాది అక్టోబర్లో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ జూలై 1, 2021 నుండి 31 శాతం డీఏ లభించింది
2022 జనవరిలో కేంద్ర ప్రభుత్వం డీఏను మరో 3 శాతం పెంచాలని నిర్ణయించడంతో ప్రభుత్వ ఉద్యోగులందరికీ 34 శాతం డీఏ లభిస్తోంది.
7వ కేంద్ర వేతన సంఘం సిఫారసుల ఆధారంగా ఆమోదించిన ఫార్ములా ప్రకారం డీఏ పెంపు వర్తిస్తుంది. పెన్షనర్లకు కూడా డియర్నెస్ రిలీఫ్ (డిఆర్) ను అదే మొత్తంలో పెంచారు.
సాధారణంగా ఏడాదికి రెండుసార్లు అంటే జనవరి, జూలై నెలల్లో కేంద్ర ప్రభుత్వం డీఏను ప్రకటిస్తుంది. ఈ రెండు సవరణలకు సంబంధించిన ప్రకటన సాధారణంగా ప్రతి సంవత్సరం మార్చి, సెప్టెంబరులో వెలువడుతుంది.
అయితే కరోనావైరస్ మహమ్మారి కారణంగా 2019 డిసెంబర్ 31 తర్వాత దాదాపు 18 నెలల పాటు డీఏను సవరించలేదు.
2020 జనవరి నుంచి 2021 జూన్ మధ్య డీఏ పెంపును నిలిపివేశారు. గత ఏడాది జూలైలో డీఏను పెంచారు.
పెరుగుతున్న జీవన వ్యయానికి తగినట్టుగా సర్దుబాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం అందిస్తారు. రిటైల్ ద్రవ్యోల్బణ రేట్లను పరిగణనలోకి తీసుకొని డీఏ రేటును కేంద్రం ఎప్పటికప్పుడు సవరిస్తుంది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కూడా ఈ ప్రయోజనం వర్తిస్తుంది.
dearness allowance ఎంత పెరుగుతుంది?
నెలకు రూ. 30,000 మూల వేతనం ఉంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ప్రస్తుత డిఎ రేటు 34 శాతానికి అనుగుణంగా రూ. 10,200 డీఏ పొందుతారు.
తాజాగా పెరిగిన 4 శాతంతో 30 వేలు మూల వేతనం ఉన్న ఉద్యోగికి నెలకు రూ. 1200 పెరుగుతుంది. మొత్తం డీఏ 38 శాతం అయితే పెంచిన డీఏతో కలిపి రూ. 11,400కు చేరుకుంటుంది.