Bus falls into gorge: లోయలో పడిన బస్సు; 36 మంది దుర్మరణం
15 November 2023, 14:48 IST
Bus falls into gorge: కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాశ్మీర్లోని దోడా జిల్లాలో ప్రయాణికులతో వెళుతున్న బస్సు లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు.
కశ్మీర్లో లోయలో పడిన బస్సు
Bus falls into gorge: కాశ్మీర్లో బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది.
60 మంది ప్రయాణికులు
ఈ ఘటన బుధవారం ఉదయం జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. బస్సు బతోటే - కిష్ట్వర్ నేషనల్ హైవేపై ప్రయాణిస్తుండగా తుంగల్ - అసార్ సమీపంలో 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో 36 మంది ప్రాణాలు కోల్పోగా 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని దోడాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రధాని మోదీ దిగ్బ్రాంతి
ఈ ప్రమాదం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 ఇవ్వాలని నిర్ణయించారు ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి ఈ ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నారు. చాలా ఎత్తు నుంచి పడడంతో బస్సు పూర్తిగా ధ్వంసం అయింది. పోలీసులు, రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తో పాటు స్థానికులు కూడా సహాయ చర్యల్లో పాల్గొన్నారు.