తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  New Criminal Laws: ఐపీసీ, సీఆర్పీసీ స్థానంలో కొత్త క్రిమినల్ చట్టాలు; జులై 1 నుంచి అమల్లోకి; ఈ చట్టాల్లో కొత్తగా ఏముంది?

New criminal laws: ఐపీసీ, సీఆర్పీసీ స్థానంలో కొత్త క్రిమినల్ చట్టాలు; జులై 1 నుంచి అమల్లోకి; ఈ చట్టాల్లో కొత్తగా ఏముంది?

HT Telugu Desk HT Telugu

24 February 2024, 15:44 IST

google News
  • New criminal laws: ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇంండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ల స్థానంలో కొత్తగా మూడు క్రిమినల్ చట్టాలను పార్లమెంటు ఆమోదించిన విషయం తెలిసిందే. ఆ మూడు కొత్త క్రిమినల్ చట్టాలు జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా (HT_PRINT)

కేంద్ర హోం మంత్రి అమిత్ షా

New criminal laws: ప్రస్తుతం అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ (IPC), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPc), ఎవిడెన్స్ యాక్ట్ (Evidence Act) ల స్థానంలో కొత్తగా మూడు క్రిమినల్ చట్టాలను కేంద్రం రూపొందించిన విషయం తెలిసిందే. భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyaya Sanhita), భారతీయ నగరిక్ సురక్ష సంహిత (Bharatiya Nagarik Suraksha Sanhita) , భారతీయ సాక్షాయ (Bharatiya Sakshaya Act).. అనే ఆ మూడు చట్టాలు ఈ సంవత్సరం జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.ఈ చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం శనివారం ప్రకటించింది.

కీలక మార్పులతో..

ఇండియన్ పీనల్ కోడ్ (IPC), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPc), ఎవిడెన్స్ యాక్ట్ (Evidence Act) ల స్థానంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్షాయ చట్టాలను అమల్లోకి తీసుకువస్తున్నారు. కొత్త చట్టాలలో బ్రిటీష్ కాలం నాటి చట్టాలను పూర్తిగా సమూలంగా మారుస్తూ.. ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు. రాజద్రోహాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించారు. ‘రాజ్యానికి వ్యతిరేకంగా నేరాలు’ అనే కొత్త సెక్షన్ ను ప్రవేశపెట్టారు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో..

ఈ మూడు బిల్లులను 2023 ఆగస్టులో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టారు. హోమ్ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ పలు సిఫార్సులు చేసిన తర్వాత 2023 పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లుకు పలు మార్పులు చేసి మరోసారి సభలో ప్రవేశపెట్టారు. విస్తృత సంప్రదింపుల తర్వాతే ఈ బిల్లులను రూపొందించామని, ముసాయిదాను తాను పూర్తిగా పరిశీలించానని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు.

భారతీయ న్యాయ సంహిత

1860 భారతీయ శిక్షాస్మృతి స్థానంలో భారతీయ న్యాయ సంహిత, 2023 ని తీసుకువచ్చారు. ఇందులో రాజద్రోహం అంశాన్ని తొలగించారు. కానీ భారతదేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతకు వ్యతిరేకంగా చేసే వేర్పాటువాదం, వేర్పాటువాద తిరుగుబాటు, ఉగ్రవాదం వంటి చర్యలను కఠినంగా శిక్షించే మరో నిబంధనను ప్రవేశపెట్టారు. మైనర్లపై సామూహిక అత్యాచారం, మూకదాడులకు మరణశిక్ష నిబంధనను పొందుపర్చారు. మొదటిసారిగా కమ్యూనిటీ సర్వీసెస్ ఒక శిక్షగా ప్రవేశపెట్టారు.

భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, 2023

1973 సీఆర్పీసీ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, 2023 ని తీసుకువస్తున్నారు. ఇందులో నేరాలకు సంబంధించి దర్యాప్తు, విచారణలతో పాటు తీర్పు వెలువరించడానికి స్పష్టమైన కాలపరిమితి విధించారు. లైంగిక దాడి బాధితుల వాంగ్మూలాన్ని తప్పనిసరిగా వీడియో రికార్డింగ్ చేయాలని పేర్కొన్నారు. నేరాలకు పాల్పడిన వారి ఆస్తులను జప్తు చేయడానికి కొత్త నిబంధనను ప్రవేశపెట్టారు.

భారతీయ సాక్ష్యాయ, 2023

ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 1872 స్థానంలో భారతీయ సాక్ష్యాయ చట్టం, 2023 ను ప్రవేశపెట్టారు. ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ రికార్డులు, ఇ మెయిల్స్, సర్వర్ లాగ్స్, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, ఎస్ఎంఎస్ లు, వెబ్ సైట్లు, లొకేషన్ ఎవిడెన్స్, మెయిల్స్, ఎలక్ట్రానిక్ డివైజ్ల లోని సందేశాలను సాక్ష్యాలుగా పరిగణించాలని నిర్ణయించారు. కేస్ డైరీ, ఎఫ్ఐఆర్, ఛార్జీషీట్, తీర్పు కాపీలను తప్పనిసరిగా డిజిటలైజ్ చేయాలని నిర్ణయించారు. అలాగే, ఎలక్ట్రానిక్, డిజిటల్ రికార్డులు.. పేపర్ రికార్డుల మాదిరిగానే చట్టపరంగా చెల్లుబాటు అవుతాయి.

తదుపరి వ్యాసం