Meghalaya flash floods : మేఘాలయలో భారీ వర్షాలు- ఆకస్మిక వరదలకు 10 మంది బలి!
06 October 2024, 8:27 IST
Meghalaya floods latest news : మేఘాలయలో భారీ వర్షాల కారణం సంభవించిన ఆకస్మిక వరదలకు 10మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక ప్రాంతాలు నీటమునిగాయి.
మేఘాలయలో భారీ వర్షాలు- కొనసాగుతున్న సహాయక చర్యలు..
ఈశాన్య భారతంలోని కీలక రాష్ట్రమైన మేఘాలయను భారీ వర్షాలు ముంచెత్తాయి. మరీ ముఖ్యంగా సౌత్ గారో హిల్స్ జిల్లాలో 24 గంటల వ్యవధిలో కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలకు 10 మంది మరణించారు.
భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక గ్రామాలు నీటమునిగాయి. రోడ్లు జలమయం అయ్యాయి. విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మేఘాలయలో భారీ వర్షాలు- ఆకస్మిక వరదలు..
సౌత్ గారో హిల్స్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు గాసుపరా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. మారుమూల గ్రామమైన హతియాసియా సోంగ్మాలో కొండచరియలు విరిగిపడి కింద ఇంటి మీద పడ్డాయి. ఫలితంగా ఏడుగురు సభ్యులున్న కుటుంబంలో విషాదం అలుముకుంది. మృతి చెందిన ఏడుగురిలో ముగ్గురు మైనర్లు సైతం ఉన్నారు.
గారో హిల్స్‌లోని ఐదు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వాటి ప్రభావాలపై మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా సమీక్ష నిర్వహించారు. బాధితులను ఆదుకుంటామని హామీనిచ్చారు.
వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో దాలుకు ప్రాంతానికి చెందిన ముగ్గురు, హతియాసియా సోంగ్మాకు చెందిన ఏడుగురు మరణించడంపై సీఎం సంగ్మా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.
మేఘాలయ వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు తక్షణమే ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు అధికారులు పీటీఐకి తెలిపారు.
జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డిఆర్ఎఫ్) రెండూ.. వరద ప్రభావిత ప్రాంతాల్లో గాలింపు, సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
గాసుపరా ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఓ వంతెన కొట్టుకుపోయింది. వేగవంతమైన అసెంబ్లింగ్, రవాణాకు వీలు కల్పించే బెయిలీ బ్రిడ్జి టెక్నాలజీని ఉపయోగించాలని సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి సంగ్మా సూచించారు.
మేఘాలయలోని అన్ని చెక్క వంతెనలను గుర్తించామని, వాటి స్థానంలో కొత్త నిర్మాణాలను చేపడతామని సీఎం చెప్పారు.
ఈ ప్రాంతంలో పలుమార్లు కొండచరియలు విరిగిపడటంతో దాలు నుంచి బాగ్మారాకు రోడ్డు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రాంతంలో రహదారి కనెక్టివిటీని పునరుద్ధరించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించాలని సీఎం సంగ్మా యంత్రాంగాన్ని ఆదేశించారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితిని జాగ్రత్తగా పర్యవేక్షించాలని ఆదేశించారు.
భారీ వర్షాలకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్‌ని పునరుద్ధరించేందుకు వేగంగా చర్యలు సాగుతున్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడానికి, తగిన సహాయక చర్యలను నిర్ధారించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని అధికారులకు సంగ్మా చెప్పారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.