Yoga For Sleep: నిద్ర పట్టడం లేదా? ఈ యోగా భంగిమలు ప్రయత్నించండి
31 July 2023, 15:07 IST
- నేడు జీవనశైలితో ముడిపడి ఉన్న అనేక సమస్యలలో నిద్రలేమి ఒకటి. నిద్రలేమి మానవులకు అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఈ సమస్యలకు యోగానే మందు. ఈ కొన్ని సాధారణ యోగా భంగిమలు మీకు నిద్ర రావడంలో సహాయపడుతాయి.
మీకు నిద్ర పట్టడంలో సమస్య ఉంటే ఈ యోగాసనాలు కొన్నింటిని ప్రయత్నించండి. శిశు ఆసనం (ఎడమ చిత్రం) హస్తపాదాసనం (కుడి చిత్రం)
ఆరోగ్యవంతమైన వ్యక్తికి ప్రతిరోజూ కనీసం 7 నుండి 8 గంటల నిద్ర అవసరం. కానీ ఒత్తిడితో కూడిన జీవనశైలి, పోషకాలు లేని ఆహారం, పెరిగిన స్క్రీన్ సమయం, పని చేసే చోట ఒత్తిడి వంటివన్నీ నిరంతరం మన నిద్రకు భంగం కలిగిస్తాయి. నిద్రలేమి అనేక జీవన శైలి సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. నిద్రలేమి మనల్ని త్వరగా వృద్ధాప్యానికి దగ్గర చేస్తుంది. కంటి నిండా నిద్ర ఉంటే మనం నిద్రపోతున్నప్పుడు శరీరంలోని కణాలు రిపేర్ అవుతాయి. శరీరం పునరుత్తేజం పొందుతుంది.
ఇదంతా సరే. కానీ ఏం చేసినా రాత్రికి నిద్ర పట్టడం లేదు.. ఏం చేయాలో చెప్పండి అంటున్నారా? అయితే నిద్ర సమస్యకు యోగా ఒక పరిష్కార మార్గంగా చెప్పొచ్చు. రోజూ యోగా సాధన చేయడం వల్ల నిద్ర సమస్యలను దూరం చేసుకోవచ్చు. క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేస్తే నిద్రలేమితో సహా అనేక నిద్ర సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడే కొన్ని యోగా భంగిమలను ఇక్కడ తెలుసుకోండి.
1.హస్తపాదాసనం
2.మార్జారియాసనం
3. శిశు ఆసనం
4. బద్ధకోణాసనం
హస్తపాదాసనం
ఈ ఆసనం యోగా మ్యాట్‌పై నిటారుగా నిలబడి పాదాలను తాకేలా ముందుకు వంగి ఉండాలి. ఈ భంగిమ వెనుక కండరాలను సాగదీస్తుంది. ఇది వెన్నెముక ఆరోగ్యానికి కూడా మంచిది. రక్త సరఫరాను పెంచడం ద్వారా నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది.
మార్జారియాసనం
పిల్లిలాగా చేతులు ముందుకు చాచి యోగా మ్యాట్‌పై పడుకోవాలి. ఈ ఆసనం వెన్నెముకను సాగదీస్తుంది. ఇది జీర్ణ అవయవాలకు మర్ధన అనుభవం కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మంచి నిద్రకు తోడ్పడుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మనస్సును రిలాక్స్ చేస్తుంది.
శిశు ఆసనం
కాళ్లను వెనుకకు మడిచి, తల మరియు శరీరాన్ని ముందుకు చాచి ఉంచాలి. ఈ ఆసనం మన నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. ఇది మంచి నిద్రకు కూడా సహాయపడుతుంది.
బద్ధకోణాసనం
సీతాకోకచిలుక భంగిమ అని కూడా పిలుస్తారు. ఈ ఆసనం ఎక్కువసేపు నడవడం వల్ల వచ్చే అలసటను నియంత్రిస్తుంది. లోపలి తొడలు, గజ్జలు మరియు మోకాళ్లను సాగదీయడానికి ఈ వ్యాయామం మంచిది.
ఈ యోగాసనాలే కాకుండా శవాసనంలో పడుకోవడం వల్ల కూడా శరీరం రిలాక్స్ అవుతుంది.