బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం 2023.. ఎందుకు సమర్థించాలో తెలుసుకోండి
12 June 2023, 10:57 IST
- ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జూన్ 12న జరుపుకుంటారు. దీనిని ఎందుకు సమర్థించాలో తెలుసుకోండి
ఇటుక బట్టీల వద్ద అలసిపోయి నీళ్లు తాగుతున్న బాలకార్మికుడు
ప్రతి సంవత్సరం జూన్ 12న బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రపంచ బాల కార్మిక దినోత్సవం జరుపుకుంటారు. చిన్నారులను పనిలో చేర్చడానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త ఉద్యమానికి ఉత్ప్రేరకంగా పనిచేయడం దీని లక్ష్యం. ప్రజలు, ప్రభుత్వాలు దీనికి మూలకారణంపై దృష్టి సారించి, సామాజిక న్యాయం, బాల కార్మికులు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయని అర్థం చేసుకుంటే బాల కార్మిక వ్యవస్థను ప్రపంచం నుండి నిర్మూలించవచ్చని ఐక్య రాజ్యసమితి విశ్వసిస్తోంది.
సామాజిక న్యాయాన్ని సాధించడానికి ఐక్య రాజ్య సమితి ఈ రోజు పిలుపునిస్తోంది. సామాజిక న్యాయం దిశగా బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పిల్లలందరికీ చట్టపరమైన రక్షణను అందిస్తుంది.
ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం 2023 థీమ్:
ఈ సంవత్సరం ప్రపంచ బాల కార్మికుల వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం యొక్క థీమ్ '‘అందరికీ సామాజిక న్యాయం. బాల కార్మిక వ్యవస్థను అంతం చేయండి!'..’ ఇది సామాజిక న్యాయం, బాల కార్మికుల మధ్య సంబంధాన్ని నొక్కి చెబుతోంది.
ప్రపంచ బాల కార్మికుల వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం 2023 చరిత్ర ప్రాముఖ్యత:
ఈ సంవత్సరం 21వ ప్రపంచ బాల కార్మికుల వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దాదాపు రెండు దశాబ్దాలుగా బాల కార్మికులను తగ్గించడంలో స్థిరమైన పురోగతి కనిపిస్తోంది. అయితే సంఘర్షణలు, సంక్షోభాలు, కోవిడ్-19 మహమ్మారి మరిన్ని కుటుంబాలను పేదరికంలోకి నెట్టాయి. లక్షలాది మంది పిల్లలను బాల కార్మికుల వ్యవస్థలోకి నెట్టాయి.
ఇది తీవ్రమైన సమస్య అని ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం గుర్తుచేస్తోంది. ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. చిన్నారుల హక్కులను, సాధారణ బాల్యాన్ని దోచుకుంటున్నారు. వారు కఠినమైన పరిస్థితులలో పని చేయవలసి వస్తోంది. తరచుగా ప్రమాదాలకు, గాయాలకు గురవుతున్నారు. ఈ అమానవీయ ఆచారాన్ని నిర్మూలించే సందేశాన్ని విస్తరించడానికి ఈ రోజును సమర్ధించడం, పాటించడం చాలా ముఖ్యం.
మీకు తెలుసా?
ఐక్యరాజ్యసమితి యొక్క అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 160 మిలియన్ల మంది పిల్లలు బాల కార్మికులుగా మారారు. అంటే ఇది ప్రతి10 మంది పిల్లలలో ఒకరు బాలకార్మిక వ్యవస్థలో మగ్గుతున్నారని సూచిస్తోంది.
2000 నుండి 2020 వరకు బాల కార్మికులు 85.5 మిలియన్ల మేర తగ్గారు. ప్రపంచవ్యాప్తంగా 26.4 శాతం మంది పిల్లలు మాత్రమే సామాజిక రక్షణ నగదు ప్రయోజనాలను పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పిల్లల సామాజిక రక్షణ కోసం జీడీపీలో 1.1 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నారు. ఇక ఆఫ్రికాలో పిల్లల కోసం జీడీపీలో 0.4 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నారు.
టాపిక్