Obesity: మహిళలూ జాగ్రత్త ,బరువు పెరిగారో మానసిక సమస్యలు మొదలైపోతాయి, ప్రశాంతంగా జీవించలేరు
13 March 2024, 9:30 IST
- Obesity: మహిళలు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. వారు ఊబకాయం, అధిక బరువు బారిన పడితే వారి మానసిక ఆరోగ్యం చాలా ప్రభావితం అవుతుంది.
అధిక బరువుతో వచ్చే సమస్యలు
Obesity: ఊబకాయం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. బరువు పెరుగుతున్న కొద్దీ మగవారిలోనైనా, ఆడవారిలోనైనా రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా బరువు పెరుగుతున్న మహిళలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారిలో మానసిక సమస్యలు త్వరగా వస్తాయి. ముఖ్యంగా బరువు పెరగడం అనేది వారిలో మానసిక ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. బరువు పెరుగుతున్న కొద్దీ వారి ఆలోచనా శక్తి తగ్గిపోతుంది. కోపం, చిరాకు పెరుగుతాయి. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.
అధిక బరువు అనేది మహిళల మానసిక ఆరోగ్యం పై ఎంతగా ప్రభావం చూపిస్తుందో ఒక తాజా అధ్యయనం తేల్చింది. అధ్యయనంలో భాగంగా 1800 మంది మహిళలు, పురుషులపై పరిశోధనలను చేశారు. వీరిలో అందరూ 46 ఏళ్ల నుండి 73 సంవత్సరాల వయసులోపువారే. వారి రక్త నమూనాలను పరిశీలించారు. అలాగే రాత్రిపూట ఉపవాసం ఉన్నాక కూడా రక్త నమూనాలను సేకరించి పరిశీలించారు. వారి గ్లూకోజ్ స్థాయిలు, గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ స్థాయిలు, వారి ఎత్తు, బరువు, నడుము చుట్టుకొలతలు అన్నింటి డేటాను సేకరించారు.
మహిళల్లో డిప్రెషన్
డేటాను విశ్లేషించాక అధిక బరువు బారిన పడిన మహిళల్లో డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు త్వరగా వస్తున్నట్టు గుర్తించారు. అధిక బరువుతో ఉన్న పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నట్టు చెబుతున్నారు అధ్యయనకర్తలు. ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తులలో సామాజికంగానూ ఎన్నో సమస్యలు వస్తున్నట్టు కనుక్కున్నారు. వారు వివక్షతో కూడిన జీవితాన్ని గడుపుతున్నట్టు నిర్ధారించారు. మానసిక ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల శారీరకంగా కూడా వారు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నట్టు గుర్తించారు. కీళ్లనొప్పి, వెన్నునొప్పి, కార్డియో వాస్కులర్ వ్యాధులు వంటివి ఉబకాయంతో ముడిపడి ఉన్నాయి. ఇవన్నీ కూడా అధిక బరువుతో ఉన్న మహిళలకు త్వరగా వచ్చే అవకాశం ఉన్నట్టు చెబుతోంది ఈ కొత్త అధ్యయనం. ఈ అధ్యయనాన్ని యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ కార్క్ వారు నిర్వహించారు. ఇది ఐర్లాండ్ దేశంలో ఉంది.
అధిక బరువుతో బాధపడుతున్న మహిళలు కచ్చితంగా బరువును తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వారి మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బరువు పెరగడం వల్ల శారీరక సమస్యలే వస్తాయని ఇన్నాళ్లు ఎక్కువమంది భావించారు. నిజానికి మానసిక సమస్యలు కూడా మహిళలను ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అధిక బరువు ఉన్న మహిళలు డిప్రెషన్ బారిన త్వరగా పడడమే కాదు, కోపం, చిరాకు, త్వరగా విసుగు రావడం, ప్రశాంతంగా లేకపోవడం, ప్రతిదానికి అరవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం.
టాపిక్