తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Golconda Diamonds: గోల్కొండ వజ్రాలు ఎందుకంత స్పెషల్? వాటిని ఎక్కడ నుంచి తవ్వి తీశారు?

Golconda Diamonds: గోల్కొండ వజ్రాలు ఎందుకంత స్పెషల్? వాటిని ఎక్కడ నుంచి తవ్వి తీశారు?

Haritha Chappa HT Telugu

20 June 2024, 13:00 IST

google News
    • Golconda Diamnonds: గోల్కొండ వజ్రాలు చాలా ప్రత్యేకమైనవి. ఇప్పటికీ వీటి గురించి చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఈ గోల్కొండ వజ్రాలకు అంత విలువ ఎందుకు వచ్చిందో తెలుసుకోండి.
గోల్కొండ డైమండ్
గోల్కొండ డైమండ్ (Pixabay)

గోల్కొండ డైమండ్

Golconda Diamonds: తెలంగాణలోని హైదరాబాద్ పశ్చిమ శివారులలో ప్రసిద్ధమైన గోల్కొండ కోటను పదకొండవ శతాబ్దంలో నిర్మించారు. ఈ శక్తివంతమైన కోటపై నుంచి చూస్తే నగరం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. గోల్కొండ అతి పెద్ద కోటకే కాదు, అందమైన వజ్రాలకు ప్రసిద్ధి చెందింది. గోల్కొండ వజ్రాలకు ఎంతో విలువ ఉంటుంది. ఒకప్పుడు ఈ గోల్కొండ ప్రాంతంలో అమ్మే వజ్రాలను కొనడానికి దేశ విదేశాల నుంచి వచ్చారు. అప్పట్లో గోల్కొండను ప్రపంచ వజ్రాల పరిశ్రమగా చెప్పుకునేవారు.

భారతదేశం గతంలో 1000 సంవత్సరాల పాటు ప్రపంచంలోనే ఏకైక వజ్రాల ఉత్పత్తిదారుగా ఉండేది. వజ్రాలంటే అత్యంత విలువైన రత్నాలలో ఒకటి. ఇవి అద్భుతమైన మెరుపుతో ఉంటాయి. వీటిని ముక్కలు చేయడం చాలా కష్టం. 14వ శతాబ్దం చివరలో గోల్కొండ ప్రాంతంలో డైమండ్లను మార్కెట్లో పెట్టి అమ్మేవారు. పర్షియన్లు, అరబ్బులు వీటిని ఎంతో ఇష్టంగా కొనుక్కునేవారు.

గోల్కొండ వజ్రాలు ప్రత్యేకత

ఇతర వజ్రాలలో గోల్కొండ వజ్రాలను కలిపి చూస్తే ఇవి ప్రత్యేకంగా కనిపించేవి. ఇవి అరుదుగా దొరుకుతాయి. పారదర్శకత అధికంగా ఉంటుంది. చూడగానే కంటికి చాలా స్వచ్ఛంగా కనిపిస్తాయి. రాయిగుంట కాంతి వెదజల్లుతుంది. వీటి నాణ్యత కూడా అధికంగా ఉంటుంది. సహజమైన స్వచ్ఛత, పారదర్శకత, ప్రకాశవంతం... ఈ గోల్కొండ వజ్రాలకు ఎక్కువ. ప్రసిద్ధ గోల్కొండ వజ్రాలలో ఒకటి బ్రిటిష్ వారి దగ్గర ఉంది. ఆగ్రా డైమండ్, ద ప్రిన్సి డైమండ్ ఇవన్నీ కూడా గోల్కొండ వజ్రాలే. ఇవన్నీ ఇప్పుడు విదేశాలలో ఉన్నాయి

కోళ్లూరు గనుల నుంచి

గోల్కొండ వజ్రాలు పూర్తిగా మన దేశానికి చెందినవి. వీటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలోనే తవ్వి తీశారు. కుతుబ్షాహీ రాజవంశం పాలనలో వీటిని కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న గనుల నుండి సేకరించారని చెబుతారు. ముఖ్యంగా కోళ్లూరు గనుల నుంచి ఈ వజ్రాలను తవ్వి తీసినట్టు చెబుతున్నారు. వాటిని అందమైన ఆకారంలో తయారు చేసేందుకు హైదరాబాద్ నగరానికి తీసుకెళ్లి మెరుగు పెట్టి, అమ్మకం వంటి లావాదేవీలను చేసేవారు. గోల్కొండ వజ్రాల వాణిజ్య కేంద్రంగా అప్పట్లో స్థిరపడింది. గోల్కొండలో అమ్మిన ఎన్నో వజ్రాలు ఇప్పుడు కనిపించకుండా పోయాయి. అవన్నీ కూడా విదేశాలకు చేరినట్టు అంచనా వేస్తున్నారు.

కుతుబ్షాహీ రాజవంశం పాలిస్తున్న కాలంలో గుంటూరు జిల్లాకు దగ్గరలో ఉన్న కోళ్లూరు గనులు చాలా ప్రసిద్ధమైనవి. ఇది కృష్ణానది పక్కనే ఉండేది. అక్కడి నుంచే వజ్రాల వెలికితీత జరిగేది. హైదరాబాద్ చరిత్రకారుడు మహమ్మద్ సఫిల్లా గోల్కొండలోని వజ్రాల గురించి చెబుతూ అన్ని గనుల నుండి తీసిన వజ్రాల బరువు 12 మిలియన్ క్యారెట్లు ఉంటుందని అంచనా వేశారు. కానీ ఇందులో ఎంతో భాగం పరదేశీయుల చేతిలోనే పడింది.

రెండు ప్రధాన సముద్ర ఓడరేవులైన సూరత్, మచిలీపట్నం మధ్య ఈ గోల్కొండ రాజ్యం విస్తరించి ఉండేది. దీంతో ఇది వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది. వజ్రాలకు అందరూ గోల్కొండ రావడం మొదలుపెట్టారు. వజ్రాల వ్యాపారం ఒక స్థాయిలో వెలిగింది. కేవలం వజ్రాలను వెలికి తీసేందుకు వాటికి సాన పెట్టేందుకు పదివేల లక్ష మంది అప్పట్లో పనిచేసేవారట.

మన దేశానికి చెందిన అన్ని వజ్రాలలో రంగులేని కోహినూర్ డైమండ్ ఎంతో విలువైనది. ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోళ్లూరు గనుల నుంచే సేకరించిందని చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం ఇది బ్రిటన్ రాజుల చేతిలో ఇరుక్కుపోయింది.

ప్రస్తుతం మన దేశంలో వజ్రాల ఉత్పత్తి పూర్వంతో పోలిస్తే తగ్గిందనే చెప్పాలి. ఆస్ట్రేలియా, రష్యా, ఆఫ్రికా వంటి దేశాల్లో వజ్రాల మైనింగ్ పెరిగిపోయింది. ఎన్ని వజ్రాలు వచ్చినా గోల్కొండ వజ్రానికి ఉన్న నాణ్యత మాత్రం ఇప్పటివరకు ఏ వజ్రాలలో కనిపించలేదు.

టాపిక్

తదుపరి వ్యాసం