Ayurvedam: ఆయుర్వేదంలో పిత్త దోషం అంటే ఏమిటి? ఇది మన రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
23 June 2024, 9:30 IST
- Ayurvedam: ఆయుర్వేదంలో ఎక్కువగా వినిపించే పదం పిత్త దోషం. నిజానికి పిత్తదోషం అంటే ఎంతో మందికి తెలియదు. అదేంటో తెలుసుకోండి.
పిత్త దోషం అంటే ఏమిటి?
Ayurvedam: ప్రపంచంలో ఎన్నో పురాతన సాంప్రదాయ వైద్యాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఆయుర్వేద వైద్యం. ఆయుర్వేదానికి భారతదేశంలో ఎంతో ఆదరణ ఉంది. ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో మూడు రకాల దోషాలు ఉంటాయి. అవి వాత, పిత్త, కఫ దోషాలు గురించి తెలుసుకుంటే ఎన్నో రకాల వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. వీటిని దోషాలుగానే కాదు శక్తులుగా కూడా చెబుతారు. ఇవి సమతులంగా ఉంటే శరీరం బలంగా ఉంటుందని నమ్ముతారు.
పిత్త దోషం అంటే...
ప్రస్తుతం మనం పిత్త దోషం గురించి తెలుసుకుందాం. పిత్తదోషం అగ్ని, నీటి మూలకాలతో నిండి ఉంటుంది. అంటే వేడి చేసే ప్రక్రియ అన్న మాట. జీర్ణ క్రియ, జీర్ణవ్యవస్థలో ఎక్కువగా ఈ పిత్త దోషం వల్ల సమస్యలు వస్తాయి. జీవక్రియ, జీర్ణక్రియ, శరీర ఉష్ణోగ్రతకు ఈ పిత్తదోషం బాధ్యత వహిస్తుంది. ఒక్కో వ్యక్తి ఒక్కో రకమైన దోషానికి లేదా శక్తికి చెందిన వారై ఉంటారు. కొంతమంది వాత దోషానికి చెందిన వ్యక్తి అయితే, మరికొందరు పిత్తదోషం, ఇంకొందరు కఫ దోషానికి చెందిన వారై ఉంటారు. మీరు పిత్తదోషానికి చెందిన వారైతే మీలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి.
పిత్త దోషం ఉన్న వ్యక్తుల్లో మధ్యస్థంగా ఉంటారు. మరీ పొడవుగా ఉండరు. అలా అని పొట్టిగా ఉండరు. లావుగా ఉండరు, అలా అని మరీ సన్నంగానూ ఉండరు. జిడ్డుగల చర్మాన్ని కలిగి ఉంటారు. జుట్టు కూడా జిడ్డుగానే ఉంటుంది. సులభంగా వీరి శరీరం వేడెక్కుతుంది. జీర్ణవ్యవస్థ మాత్రం బలంగా ఉంటుంది.
పిత్త దోషం కలవారు కొన్ని రకాల ఆహారాలను ప్రత్యేకంగా తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, పెరుగు వంటి శరీరానికి చలువ చేసే ఆహారాన్ని తినాలి. స్పైసీ, ఆయిల్ ఫుడ్స్ తినడం మానుకోవాలి. అలాగే అధిక వేడికి గురి కాకుండా చూసుకోవాలి. మండే ఎండల్లో బయట తిరగకూడదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయించాలి. కానీ అతిగా శ్రమించకూడదు. ప్రాణాయామం వంటి వ్యాయామాలు చేస్తూ ఉండాలి.
ప్రతి వ్యక్తిలోనూ వాత, పిత్త, కఫ దోషాలు ఉంటాయి. ఇవి సమతుల్యంగా ఉంటేనే ఆ వ్యక్తి ఆరోగ్యంగా జీవిస్తారు. పిత్తదోషం అనేది శరీరంలో జీర్ణక్రియ, జీవక్రియ నియంత్రించే శక్తి ఇది. మనం తిన్న ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి పోషకాలను శక్తిగా మార్చడానికి బాధ్యత వహిస్తుంది. ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. పిత్తదోషం సమతుల్యంగా ఉంటే తెలివితేటలు, ధైర్యం, జ్ఞాపకశక్తి ఉంటాయి. పిత్త దోషంలో అసమతుల్యత ఉంటే కోపం, చిరాకు వంటివి పెరిగిపోతాయి. ఆయుర్వేదంలో పిత్తదోషాన్ని సమతుల్యంగా ఉంచేందుకు ఎన్నో ఔషధాలు ఉన్నాయి.