Saturday Motivation: ఏది శాశ్వతం? మీ డబ్బా మీ అందమా మీ అధికారమా?
26 October 2024, 5:30 IST
- Saturday Motivation: మీ జీవితంలో ఏది శాశ్వతమో కాసేపు కూర్చుని ఆలోచించండి. మీ ప్రాణం కూడా మీ శరీరంతో ఎన్నాళ్లు ఉంటుందో చెప్పలేం. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు, అయినా అత్యాశ పడే వారు ఎంతో మంది.
మోటివేషనల్ స్టోరీ
ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, ఆ విషయం తెలిసినా కూడా ఎంతో మంది విపరీతమైన అత్యశతో జీవిస్తారు. తామే బావుండాలని, తామే డబ్బు సంపాదించాలని, తమకే సంతోషం దక్కాలని విపరీతమైన స్వార్థంతో ప్రవర్తిస్తారు. ఒక్క నిమిషం కూర్చుని ఆలోచించండి ఈ ప్రపంచంలో ఏది శాశ్వతమో? మీకు చెప్పడం కష్టమే.
కాలం శాశ్వతం కాదు, ఈ క్షణం గడిచిపోతే తిరిగి తెచ్చుకోలేం. ఆ క్షణాన్ని కాసేపు ఆపలేం కూడా. ఇక వయసు గంటలు గడుస్తున్న కొద్దీ మీరు గతం కన్నా ఓ గంట వయసు పెరిగి కూర్చుంటుంది. ప్రేమ శాశ్వతమంటారు... నిజానికి ప్రేమ కూడా శాశ్వతం కాదు, భార్యని అమితంగా ప్రేమించిన భర్త, వారికి పిల్లలు పుట్టాక వారిని అధికంగా ప్రేమించడం మొదలుపెడతారు. ఇలా పరిస్థితిని బట్టి ప్రేమలో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి. ఒక్కోసారి ఆ ప్రేమ పూర్తిగా చచ్చిపోయే క్షణాలు కూడా వస్తాయి.
ఒక్కసారి పోయిన ప్రాణాన్ని వందల కోట్లు ఇచ్చిన వెనక్కి తెచ్చుకోలేం. యవ్వనంలో ఉన్న అందం... వయసు ముదిరాక పోతుంది. దాన్ని తిరిగి తెచ్చుకోవడం అసాధ్యం. అధికారంలో ఉన్నవారు గర్వంతో విర్రవీగిపోతారు కానీ, ప్రజల్లో తిరుగుబాటు వస్తే అంతే సంగతులు. కానీ అందాన్ని, డబ్బులు, అధికారాన్ని చూసి తెగ మిడిసిపోయే వారు ఎంతో మంది. శాశ్వతం కానీ అంశాలను తలకెక్కించుకుని... చుట్టూ ఉన్న వారిని చులకనగా చూసే వారు ఎంతోమంది.
ఎవ్వరి జీవితంలోనైనా ఏదీ శాశ్వతంగా మిగిలిపోదు. ప్రతి జీవికి మరణం ఉంటుంది. అందుకే మీరు బతికినన్నాళ్లూ సంతోషంగా జీవించండి. అందరికీ ప్రేమను పంచండి, వారి నుంచి ప్రేమను పొందండి. పెదవులపై చిరునవ్వును చెదరనివ్వకండి.
ప్రతి ఒక్క మనిషి ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చారు, మళ్లీ ఒంటరిగానే భూమిలో కలిసిపోతారు. మధ్యలో ఈ అందం, అధికారం, డబ్బు, మదం అవసరమా?
రూపాన్ని,రూపాయిని చూసి మురిసిపోతున్నారా... అవి మిమ్మల్ని వదిలి వెళ్లే రోజు ఎప్పుడో ఒకసారి వస్తుందని గుర్తుంచుకోండి. ఈ మారిపోయే లోకంలో ఏదీ శాశ్వతం కాదు. తేదీలు మారుతున్నా, ఏళ్లు గడుస్తున్నా, కాలం ఎప్పుడూ నేర్పించే పాఠం ఒక్కటే... మీ జీవితంలో ఎవ్వరూ శాశ్వతం కాదని.
మీరు సాధించిన విజయాలు, ఘనతలు మాత్రం మీ మరణానంతరం కూడా కొన్ని తరాలు గుర్తు పెట్టుకుంటాయి. ఐన్ స్టీన్ బల్బు కనిపెట్టి వంద ఏళ్లు దాటి పోయినా ఇప్పటికీ మనం ఆయన్ని మర్చిపోలేకపోతున్నాం. అలాగే మీరు మానవాళికి చేసే మంచి మాత్రం ఎక్కువ కాలం పాటూ మీరు ఉనికిలో లేకపోయినా నిలిచే అవకాశం ఉంది.