తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Integrity | కెరీర్‌లో ఇంటిగ్రిటీ ఎందుకు అవసరం? దీని వల్ల ప్రయోజనం ఏంటి?

Integrity | కెరీర్‌లో ఇంటిగ్రిటీ ఎందుకు అవసరం? దీని వల్ల ప్రయోజనం ఏంటి?

03 August 2024, 22:04 IST

google News
    • Integirty అనే పదానికి అర్థాలు న్యాయవర్తన, నైతిక నిష్ఠ, చిత్తశుద్ధి, సరళత, నిష్కాపట్యం, సజ్జనత్వం, నీతి అని ఆధునిక వ్యవహార కోశం (డిక్షనరీ)లో బూదరాజు రాధాకృష్ణ నిర్వచించారు. ఈ పదాన్ని మనం తరచూ వాడుతాం. ఉద్యోగంలో దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.
ప్రతీకాత్మక చిత్రం: ఉద్యోగులు
ప్రతీకాత్మక చిత్రం: ఉద్యోగులు (Unsplash)

ప్రతీకాత్మక చిత్రం: ఉద్యోగులు

Integirty పదాన్ని మనం తరచూ వాడుతాం. ‘అరేయ్.. వాడికి ఇంటిగ్రిటీ లేదురా’ అని స్నేహితులు ముచ్చటించుకోవడం కామన్‌గా కనిపిస్తుంది. ఇంటిగ్రిటీ ఉన్న వారు పని ప్రదేశాల్లో ప్రత్యేకత కలిగి ఉంటారు. వారిని అందరూ ఇష్టపడతారు. ముఖ్యంగా బాస్‌లకు వారంటే ఇష్టం.

ఇంటిగ్రిటీని ఎలా నిర్వచిస్తారు?

ఇంటిగ్రిటీ అనేది మన ప్రవర్తనను సూచిస్తుంది. అందుకే దీనిని న్యాయవర్తన అన్నారు. నిజాయతీగా ఉండడం, నైతిక విలువలకు కట్టుబడి ఉండడం, మనస్సు శుద్ధిగా ఉండడం, కపటం లేకుండా ఉండడం, కాంప్లికేటెడ్‌గా లేకపోవడం, మంచి మనిషిగా ఉండడం, నీతిగా వ్యవహరించడం, విశ్వసనీయత కలిగి ఉండడం.. ఇవన్నీ ఇంటిగ్రిటీ కిందికే వస్తాయి. ఉద్యోగిగానే కాకుండా, జీవితంలో ఆయా లక్షణాలను పుణికి పుచ్చుకుంటే మీకు తిరుగే ఉండదు.

నిజాయతీగా ఉండడం..

కొందరు తమకు అప్పగించిన పనిని పూర్తి చేయకుండా చేస్తున్నట్టు నటిస్తుంటారు. అడిగినప్పుడు దాటవేస్తూ వస్తుంటారు. పూర్తయిందని చెబుతారు. చివరకు ఫలితం చూపించాల్సి వస్తే తప్పుడు మార్గాలు ఎంచుకుంటారు. ఇతరుల పనిని తమ పనిగా చూపించడం, పని చూపించాల్సి వచ్చినప్పుడు సాకులు వెతకడం చేస్తారు. ఒక తప్పును కప్పి పుచ్చుకునేందుకు అనేక తప్పులు చేస్తారు. ఇవన్నీ నిజాయతీ లేకపోవడం కిందకు వస్తాయి. ఇది ఇంటిగ్రిటీ లేని మనిషిగా ముద్రపడేలా చేస్తుంది. చివరకు ఉద్యోగం కోల్పోవాల్సిన పరిస్థితిని కొనితెచ్చుకుంటారు.

బాధ్యతగా వ్యవహరించడం

ఉద్యోగంలో చేరినప్పుడు సంస్థ ఇచ్చే జాబ్ రోల్‌ను కొందరు తరచూ మరిచిపోయి తప్పించుకునే ధోరణి కనబరుస్తారు. కర్తవ్యాన్ని విస్మరించి కష్టాలు కొని తెచ్చుకుంటారు. సంస్థలో ఒక ప్రొడక్ట్ తయారీ వెనక అందరి కష్టం దాగి ఉంటుంది. నేను ఒక్కడిని చేయకపోతే ఏమవుతుందిలే అనుకుంటే ఆ ప్రొడక్ట్ వెలువడదు. ఆ ఒక్కరి తప్పు వల్ల ప్రొడక్ట్ క్వాలిటీ దెబ్బతింటుంది. ఆ ప్రొడక్ట్ ఏ దశలోనైనా ఎన్ని పరీక్షలకైనా నిలబడాలంటే కలెక్టివ్ వర్క్ తప్పనిసరి. అందువల్ల మనకు ఇచ్చిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తించాలి.

జవాబుదారీగా ఉండడం

మనకు అప్పగించిన పనికి మనం పూర్తి జవాబుదారీగా ఉండాలి. అర్థం కానప్పుడు పైవాళ్లను మరోసారి అడగాలి. ప్రొడక్ట్ మీ చేతిలోకి వచ్చినప్పుడు అంతకుముందు దశ సరైన రీతిలో లేనిపక్షంలో వారికి తెలియపరిచి సరైన రీతికి వచ్చేలా చూడాలి. మీరు చేయాల్సిన పని ఏదైనా పరిస్థితుల్లో మీరు చేయలేని పక్షంలో అది సక్రమంగా జరిగేలా వ్యవస్థను తయారు చేసి పెట్టుకోవాలి. ఈ పరిస్థితిని మీ పైవారికి ముందే తెలియపరచాలి. జవాబుదారీగా ఉండడం కూడా ఇంటిగ్రిటీలో భాగేమ.

నిష్కాపట్యం (కపటం లేకపోవడం)

ఉద్యోగ వేటలో ఉన్నత స్థానాలు, అత్యున్నత వేతనాలు సాధించేందుకు లేనిపోని అసత్యాలతో కపట వేషధారణతో మోసగిస్తారు. రెజ్యుమెలో నకిలీ అనుభవాలను జోడించి సంస్థలను మోసగిస్తారు. ఉద్యోగంలో తమ సామర్థ్యం బయటపడేసరికి సంస్థపై, పైవారిపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తారు. నిష్కాపట్యం కూడా ఇంటిగ్రిటీలో భాగమే.

ఇంటిగ్రిటీ వల్ల ప్రయోజనమేంటి?

దేశంలో కొన్ని సంస్థలపై మనకు ప్రత్యేక ప్రేమ ఉంటుంది. అవి పాటిస్తున్న విలువలే వాటికి శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి. శతాబ్దాలుగా వాటిని ఉనికిని చాటుకుంటున్నాయి. తాత్కాలిక ప్రయోజనాలు, రాత్రికి రాత్రే ధనవంతులవ్వాలన్న ధోరణి కాకుండా దీర్ఘకాలంలో ఒక విలువను సమకూర్చుకుంటున్నాయి. అలాగే మనం జీవితంలో అయినా, ఉద్యోగ జీవితంలో అయినా ఇంటిగ్రిటీ మనకు సదా రక్షణగా ఉంటుంది. 

ఇంటిగ్రిటీ ఒక ఆభరణంలా, మనకు ఒక అదనపు స్కిల్‌గా నిలిచిపోతుంది. అత్యున్నత శిఖరాలు అధిరోహించేలా చేస్తుంది. అలవరచుకోవడం కష్టమే అయినప్పటికీ, దీర్ఘకాలం కష్టపడాల్సి వచ్చినప్పటికీ వజ్రంలా మెరిసేలా చేస్తుంది. ఎటువంటి సందర్భాలనైనా ఎదుర్కొనేలా సంసిద్ధులను చేస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తుంది. విశ్వసనీయతను పెంపొందింపజేస్తుంది.

 

టాపిక్

తదుపరి వ్యాసం