Effects of smoking on Diabetes: స్మోకింగ్‌తో షుగర్ పేషెంట్ల ప్రాణానికి పొగ..
26 December 2022, 14:16 IST
- Effects of smoking on Diabetes: డయాబెటిస్ పేషెంట్లపై స్మోకింగ్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Effects of smoking on Diabetes: Nutritionist shares tips
స్మోకింగ్ అలవాటు ఉన్న వారు వారికి దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నా ఈ పాడు అలవాటు నుంచి బయటపడలేరు. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్లలో స్మోకింగ్ పెంచే ప్రమాదంపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్ అంటే శరీరంలోని రక్తంలో షుగర్ లెవెల్స్ అధికంగా ఉండడం. పాంక్రియాటిస్ అవసరమైన మోతాదులో ఇన్సులిన్ విడుదల చేయనప్పుడు ఈ దుస్థితి ఏర్పడుతుంది. కొన్ని కేసుల్లో ఇన్సులిన్ ఉత్పత్తి అయినా దానిని శరీరం వినియోగించుకోలేకపోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. డయాబెటిస్‌కు జీవన శైలి మార్పులు ఒక్కటే మార్గం అని వైద్య నిపుణులు చెబుతున్నా చాలా మంది పేషెంట్లు నిర్లక్ష్యం చేస్తారు. డయాబెటిక్ పేషెంట్లు సిగరెట్లు తాగితే తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
న్యూట్రిషనలిస్ట్ అంజలి ముఖర్జీ డయాబెటిస్‌పై స్మోకింగ్ చూపే దుష్పరిణామాలను వివరించారు. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో దీనిపై చర్చించారు. ‘డయాబెటిస్ అంటే దీర్ఘకాలం రక్తంలో షుగర్ లెవెల్స్ అధికంగా ఉండే స్థితి. డయాబెటిస్‌ను ఎదర్కోవడం ఒక సవాలు. ఇక స్మోకింగ్ అలవాటు ఉండే పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే స్మోకింగ్ ద్వారా బాడీలోకి చేరే నికోటిన్ ఇన్సులిన్ ఉత్పత్తికి, శోషించడానికి ప్రతిబంధకంగా ఉంటుంది. తద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అంతిమంగా డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండదు. సాధారణంగా పొగ తాగేవారిపై పొగాకు పెను ప్రభావం చూపుతుంది. ఇక డయాబెటిక్ పేషెంట్లలో ఇది మరింత ప్రభావం చూపుతుంది..’ అని హెచ్చరించారు. డయాబెటిక్ పేషెంట్లపై స్మోకింగ్ వల్ల కలిగే హానిని వివరించారు.
డయాబెటిక్ పేషెంట్లపై స్మోకింగ్ ప్రభావం ఇదే
ధమనుల గట్టిపడటం: ధూమపానం డయాబెటిక్ రోగులలో ధమనులు గట్టిపడటానికి కారణమవుతుంది. వ్యాధి లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.
గుండె సమస్యలు: మధుమేహం ఉండి ధూమపానం, పొగాకు సేవించే అలవాటు ఉన్నవారు గుండె జబ్బులకు గురయ్యే అవకాశం ఉంది. వారికి గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.
కిడ్నీ వ్యాధులు: మధుమేహం ఉన్న వారు పొగ తాగితే ఆ అలవాటు ఇప్పటికే ఉన్న వ్యాధులను తీవ్రతరం చేస్తుంది. ప్రధానంగా కిడ్నీ సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. కండరాల సమస్యలు, రక్త ప్రసరణ సమస్యలు వస్తాయి.
గ్లూకోజ్ అసాధారణతలు: అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అండ్ డయాబెటిస్‌లో ప్రచురితమైన పరిశోధనను ఉటంకిస్తూ ధూమపానం గ్లూకోజ్ అసాధారణతలకు దారితీస్తుందని అంజలి వివరించారు.
అల్బుమినూరియా: ఇది అల్బుమినూరియాకు కూడా దారితీస్తుంది. మూత్రంలో ప్రోటీన్ వెళ్లిపోవడం దీని లక్షణం. నరాలు దెబ్బతింటాయి. గాయాలు ఆలస్యంగా నయం అవుతాయి.
టైప్ 2 డయాబెటిస్: ధూమపానం చేసేవారికి ఇతరులకన్నా త్వరగా టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.