తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wednesday Motivation : మీలో ఉన్న లోపాలే.. అనుకుంటే మీ ఆయుధాలు..

Wednesday Motivation : మీలో ఉన్న లోపాలే.. అనుకుంటే మీ ఆయుధాలు..

HT Telugu Desk HT Telugu

12 April 2023, 4:30 IST

    • Wednesday Motivation : చాలా మంది.. తమకున్న లోపాలతో ఏం చేయలేకపోతారు. నాకు ఈ సమస్య ఉంది.. అందుకే చేయలేకపోతున్నానని పక్క వాళ్లకు చెబుతూ.. తమ మనసుకు సర్దిచెప్పుకుంటారు. లోపాలనే ఆయుధాలుగా చేసుకుని.. విజయం సాధించిన గొప్ప వ్యక్తులు ఈ లోకంలో ఉన్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

ప్రతీకాత్మక చిత్రం

నాకు కోపం ఎక్కువ.., నాకు మైండ్ సరిగా ఉండదు, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సరిగా లేవు.., ఉద్యోగం చేస్తేనే మా ఇంట్లో గడుస్తుంది.. అందుకే నా జీవిత లక్ష్యాన్ని పక్కకు పెట్టాను.., ఇలాంటి కారణాలు చాలా చెప్పే ఉంటారు.. చాలా వినే ఉంటారు. ప్రతీ మనిషికి వెనక్కు లాగే లోపాలు ఉంటాయి. వాటిని మెట్లుగా చేసుకుని ముందుకు వెళ్లేవారే గెలుపును చూసే వీరులు. మైక్ టైసన్ గురించి వినే ఉంటారు కదా. ప్రపంచంలో ఆ పేరు చాలా ఫేమస్. చిన్న గ్రామంలోకి వెళ్లి అడిగినా.. చెబుతారు. అతడి కోపం.. అతడికి ఒకప్పుడు శత్రువు. కానీ అదే కోపం అనే లోపాన్ని ఆయుధంగా చేసుకుని.. బాక్సింగ్ లో చరిత్ర సృష్టించాడు.

అమెరికాలోని బ్రూక్లిన్ లో నేరగాళ్లు ఎక్కువగా ఉండే.. బ్రౌన్స్ విలే ప్రాంతంలో పుట్టాడు మైక్ టైసన్. చిన్నప్పటి నుంచే చాలా కోపం. ఎవరూ అతడి దగ్గరకు వెళ్లేవారు కాదు. ఎవరిని పడితే వారిని కొట్టేవాడు. ఇదే అతడి జీవితాన్ని మార్చింది. సమస్య పెద్దదిగా అయింది. జైలు తరహాలో ఉండే.. సంరక్షణ కేంద్రానికి పంపించారు. అతడిలో మార్పు తెచ్చే క్రమంలో ఓ కౌన్సిలర్ టైసన్ కు బాక్సింగ్ నేర్పించాడు.

టైసన్ కు మెల్లగా.. బాక్సింగ్ మీద ఇష్టం పెరిగింది. పట్టుదల, క్రమశిక్షణ, కఠోర శ్రమంతో పూర్తిస్థాయిలో బాక్సింగ్ పై దృష్టిపెట్టాడు. 18 ఏళ్ల వయసుకే ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ బరిలోకి దిగి హేమాహేమీలను భయపెట్టించాడు. 1985లో టైసన్‌ 15 బౌట్‌లలో పాల్గొంటే అన్నీ నాకౌట్‌ విజయాలే. అంటే.. అతడి కోపాన్ని ఎలా ఆయుధంగా మార్చుకున్నాడో ఇక్కడే మీకు అర్థం కావాలి. బాక్సింగ్ చరిత్రలో ఎన్నో రికార్డులను లిఖించాడు మైక్ టైసన్. కనీసం ప్రత్యర్థికి ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వకుండా విరుచుకుపడేవాడు.

పెద్ద పెద్ద బాక్సింగ్ ఛాంపియన్స్ కూడా టైసన్ వస్తున్నాడంటే భయపడేవారు. కేవలం 20 ఏళ్ల 145 రోజుల వయసులో వరల్డ్‌ హెవీ వెయిట్‌ చాంపియన్‌గా నిలిచి కొత్త చరిత్ర సృష్టించాడు. టైసన్‌ను నిలువరించడం ఎవ్వరి తరం కాలేదు. డబ్ల్యూబీసీతో పాటు డబ్ల్యూబీఏ, ఐబీఎఫ్‌ ఏర్పాటు చేసిన బౌట్‌లలో విజేతగా నిలిచి మూడు టైటిల్స్‌ను ఒకేసారి తన ఖాతాలో వేసుకొన్న గ్రేట్ పర్సన్ టైసన్‌. ఇలా చెప్పుకుంటూ పోతే.. మైక్ టైసన్ ఖాతాలో ఎన్నో విజయాలు. ఆ తర్వాత పరిస్థితుల కారణంగా.. అతడి జీవితం మారిపోయింది. అంతకుముందు ఉన్న ప్రాభవం కోల్పోయాడు. అయినా బాక్సింగ్ లో మైక్ టైసన్ ముద్ర చెరగనిది. ఇప్పటికీ ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లి అడిగినా.. చదవుకోని వారు కూడా మైక్ టైసన్ అంటే ఎవరో చెబుతారు.

ఇక్కడ మైక్ టైసన్ తన కోపాన్ని ఆయుధంగా చేసుకున్నాడు. అదే అతడికి విజయాన్ని తెచ్చిపెట్టింది. లోపాలన్నీ.. ఆయుధంగా చేసుకుంటే.. ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో.. మైక్ టైసన్ జీవితం ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

నీలోని లోపం నీ ఆయుధమైతే.. విజయం నీ సొంతమవుతుంది..

నీ లోపాలను నువ్వే గుర్తించు.. వాటిని సరిదిద్దుకోవాల్సింది నువ్వే..

లోపంతో బాధపడే బదులు.. దాన్నే ఆయుధం చేసుకుంటే.. గెలుపు నీ చెంతకు వస్తుంది..!

తదుపరి వ్యాసం