తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nightlife | నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలా.. హైదరాబాద్‌లోని కొన్ని బెస్ట్ స్పాట్స్ ఇవే!

Nightlife | నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలా.. హైదరాబాద్‌లోని కొన్ని బెస్ట్ స్పాట్స్ ఇవే!

HT Telugu Desk HT Telugu

27 April 2022, 19:56 IST

google News
    • హైదరాబాద్ నగరంలో సాయంకాలం వేళల్లో అసలైన సిటీ నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటే కొన్ని బెస్ట్ హ్యాంగౌట్ స్పాట్లకు సంబంధించిన సమాచారం ఇక్కడ అందించాం, చూడండి..
Hyderabad City - Cable Bridge Point
Hyderabad City - Cable Bridge Point (Stock Photo)

Hyderabad City - Cable Bridge Point

హైదరాబాద్ నగరం ఒకవైపు దాని చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుంటూనే మరోవైపు ఆధునిక పోకడలను స్వీకరిస్తూ అన్ని రకాల సంస్కృతుల జీవనశైలిని ప్రతిబింబిస్తుంది. అసలైన కాస్మోపాలిటన్ కల్చర్‌కు అద్దంపడుతోంది మన భాగ్యనగరం. నగరంలో నివసించే ప్రతి పౌరుడి అభిరుచికి తగినట్లుగా వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు ఎన్నో వైవిధ్యమైన కార్యకలాపాలు హైదరాబాద్ సిటీలో నిరంతరం జరుగుతూనే ఉంటాయి.

మీరు హైదరాబాద్ నగరంలో ఉంటే ఈ సాయంకాలం ఎక్కడికైనా వెళ్లాలి అనుకుంటే నగరంలో సందడిగా ఉండే ప్రదేశాలను, అక్కడి ప్రత్యేకతలను ఇక్కడ పరిచయం చేస్తున్నాం.

సీక్రెట్ లేక్

సైబరాబాద్‌లోని సీక్రెట్ లేక్ - దుర్గం చెరువు ఇప్పుడు నగరంలో ట్రెండింగ్ అట్రాక్షన్. సాయంత్రం వేళలో చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. విశాలమైన పచ్చటి ల్యాండ్ స్కేప్, బోటింగ్, ట్రెక్కింగ్ లాంటి కార్యకలాపాల కోసం మంచి గ్రీన్ స్పాట్‌గా అవతరించింది.  ప్రశాంతమైన చెరువు నీటి పక్కన స్నేహితులు, ఫ్యామిలీతో కలిసి ప్రకృతి ఒడిలో విశ్రాంతి తీసుకోవచ్చు. ఇలాంటి సందడే నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ వద్ద కూడా ఉంటుంది.

లమాఖాన్

మీకు లైవ్ మ్యూజిక్ కన్సర్ట్స్ లేదా ఇంగ్లీష్- తెలుగు- హిందీ డ్రామాలు చూడటం ఇష్టం ఉంటే బంజారాహిల్స్ లోని లామాఖాన్ గుడ్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఇక్కడికి ఎక్కువగా యువతే వస్తారు. తినడానికి - తాగటానికి కావాల్సినవి అన్నీ అందుబాటులో ధరల్లో ఉంటాయి. మధ్యాహ్నం సమయంలో కూడా ఈ ప్రదేశం సందడిగా ఉంటుంది. అభిరుచి కలిగిన వ్యక్తులతో పరిచయం పెంచుకోవడానికి, వారితో కలిసి పనిచేసే అవకాశాలు పొందటానికి కూడా ఇదొక వేదికగా ఉంటుంది.ఒకవేళ మీకు తెలుగు డ్రామా చూడాలంటే హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ వద్ద సురభి డ్రామా కంపెనీ ఉంది.

గో- కార్టింగ్

శంషాబాద్ విమానాశ్రం వద్ద కార్టింగ్ ఎంజాయ్ చేయవచ్చు. 600 మీటర్ల పొడవు ఉన్న ట్రాక్‌పై పెడల్ ఉంచి మీ స్నేహితులతో కలిసి వెళ్లి తెల్లవారుజాము వరకు అద్భుతమైన సమయాన్ని ఆస్వాదించవచ్చు. రాత్రి నుంచి ఉదయం 4 గంటల వరకు తెరిచే ఉంటుంది. మేడ్చల్ మార్గంలో కూడా కార్టింగ్ ఉంది.

ది పైరేట్ బ్రూ

హాలీవుడ్ మూవీ 'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్' సిరీస్ మీరు చూసే ఉంటారు. అచ్ఛం అలాంటి థీమ్ తోనే 'ది పైరేట్ బ్రూ ' రెస్టారెంట్ - పబ్ ఉంది. మీరు సాయంకాలం వేళ కంటినెంటల్ కుసీన్ రుచులు ఆస్వాదించాలి, కొంచెం చిల్ అవ్వాలి అనుకుంటే ఇక్కడికి వెళ్లొచ్చు. ఇదే తరహాలో జూబ్లీహిల్స్‌లోనే కేఫ్ అబాట్ కూడా ఉంది.

చార్మినార్ - చార్ కమాన్

మామూలు టైంలోనే చార్మినార్ ప్రాంతం సందడిగా ఉంటుంది. ఇక రంజాన్ సీజన్ లో అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాయంకాలం పూట ఈ చారిత్రక స్మారక చిహ్నం వద్ద ఉత్సవ వాతావరణం ఉంటుంది. మీ పర్స్ ఖాళీ అయ్యే వరకు షాపింగ్ చేయవచ్చు, మీ కడుపు పగిలేలా ఎన్నో రకాల రుచులను ఆస్వాదించవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం