తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Varicose Veins | కాలు కదపకుండా ఒకేచోట ఉంటున్నారా? నరాల సమస్యకు దారితీయవచ్చు..

Varicose veins | కాలు కదపకుండా ఒకేచోట ఉంటున్నారా? నరాల సమస్యకు దారితీయవచ్చు..

Manda Vikas HT Telugu

26 July 2022, 16:17 IST

google News
    • ఎక్కువసేపు నిల్చోవటం, కూర్చోవటం చేసినా, నడవటం అనేది లేకపోతే నరాల్లో రక్త ప్రసరణ జరగదు. ఇది వెరికోస్ వెయిన్స్‌ అనే సమస్యకు దారితీస్తుంది. ఇది ప్రమాదకరమా? ఎలా నివారించవచ్చు.. ఇక్కడ తెలుసుకోండి.
Varicose veins
Varicose veins ( Varicose veins)

Varicose veins

నరాలలో రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే నొప్పి, వాపు ఏర్పడతాయి. కొంతమందికి కాళ్లలో నరాలు బాగా వాచినట్లు బయటకు కనిపిస్తాయి. నడవటానికి కూడా ఇబ్బందిపడతారు. ఈ పరిస్థితిని నరాల అనారోగ్యం (varicose veins)గా చెప్తారు. వైద్యశాస్త్రంలో దీనినే వేరికోస్ లేదా వేరికోసిటీస్ అని కూడా పిలుస్తారు. నరాలు ఎక్కువగా విస్తరించినప్పుడు లేదా రక్తంతో నిండి పోయినపుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఇలా రక్తంతో నిండిన నరాలు నీలం-ఊదా రంగు లేదా ఎరుపు రంగును కలిగి ఉంటాయి, అవి బయటకి కనిపిస్తాయి. ఆ ప్రాంతంలో నొప్పిగా కూడా ఉంటుంది.

ఈ పరిస్థితి చాలా సాధారణం. ముఖ్యంగా వయసు పైబడిన మహిళల్లో కనిపిస్తుంది. డయాబెటీస్, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో కూడా వేరికోస్ సమస్య సంభవించవచ్చు. అలాగే ఎక్కువ సేపు కదలకుండా ఒకేచోట కూర్చోవడం లేదా నిల్చోవటం చేసినా తలెత్తవచ్చు. కొంతమంది బద్ధకంతో కూడా అస్సలు కాలు కదపలేరు, నడవటానికి అసలే ఇష్టపడరు. అటువంటి సందర్భాలలో కూడా రక్తప్రసరణ సరిగ్గా జరగక వెరికోసిస్ వెయిన్స్ సమస్య సంభవిస్తుంది.

వెరికోస్ వెయిన్స్ సమస్య సాధారణంగా కాళ్లలో కనిపిస్తుంది. ఊబకాయం, నిశ్చల జీవనశైలి, గర్భంతో ఉన్నప్పుడు, కొన్నిసార్లు జన్యు సంబంధమైన కారణాలు ఉండవచ్చు. మధుమేహం ఉన్నవారికి ప్రత్యక్ష కారకం కాదు కానీ ఈ సమస్య వారికి మరిన్ని సంక్లిష్టతలకు దారితీస్తుంది.

ఎలాంటి లక్షణాలు ఉంటాయి?

  • నరాలు వక్రీకృతంగా, అడ్డదిడ్డంగా విస్తరించడం
  • నరాలు రంగుమారినట్లుగా కనిపించడం
  • నరాల నొప్పి, వాపు
  • పాదం ఎగువ భాగంలో దురద, చీలమండల వాపు
  • రాత్రి సమయంలో కాళ్లలో తిమ్మిరి లేదా నొప్పులు
  • ప్రభావితమైన చోట చర్మం గట్టిపడటం, రంగు మారడం, పొలుసుల చర్మం మొదలైన లక్షణాలు ఉంటాయి.

అనారోగ్య సిరలు (varicose veins) సాధారణంగా నిరపాయమైన సమస్య, అయినప్పటికీ ఈ పరిస్థితి కారణంగా కొంత అసౌకర్యం ఉంటుంది. అంతర్లీనంగా రక్త ప్రసరణ సమస్యలను పెంచుతాయి. కొన్నిసందర్భాల్లో వాపు, నొప్పి ఉండవచ్చు. సరైన కేర్ తీసుకోకపోతే అది ఇతర అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు.

నివారణ, పరిష్కార మార్గాలు

- శారీరక శ్రమ అనేది ఉండాలి, నడక కచ్చితంగా అలవాటు చేసుకోవాలి. ప్రతి చిన్నపనికి వాహనం ఉపయోగించవద్దు.

- అలాగే ఎక్కువసేపు దీర్ఘకాలం పాటు ఒకేచోట కూర్చోవటం, నిల్చోవటంగానీ చేయకూడదు.

- అధిక బరువు కారణంగా సిరలపై ఒత్తిడి ఉంటుంది. సిరల్లో రక్త ప్రసరణలో అవరోధాలు ఏర్పడతాయి, కాబట్టి బరువును నియంత్రించడానికి చర్యలు తీసుకోండి.

- డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కూడా వెరికోస్ వెయిన్స్‌కు కారణమవుతుంది. ఈ సందర్భంలో కాళ్లలో ఇతర నిశ్చల భాగాలలో రక్తం గడ్డకట్టడం జరుగుతుంది. స్థూలకాయం, అధిక బీపీని తగ్గించుకోవాలి.

పరిస్థితి తీవ్రంగా ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. కంప్రెషన్ సాక్స్ ధరించాల్సిందిగా, ఫియో థెరపీ చేయించాలని సూచించవచ్చు. పరిస్థితిని బట్టి స్ల్కెరోథెరపీ సహాయంతో సిరలోకి ఇంజెక్షన్ ఇస్తారు, శస్త్ర చికిత్స చేయవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం