National French Fries Day 2023: ఆలూతో ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు.. ఒకసారి వీటితో ఫ్రైస్ చేసి చూడండి..
13 July 2023, 16:15 IST
National French Fries Day 2023: గార్లిక్ స్వీట్ పొటాటో ఫ్రైస్ నుంచి అవకాడో ఫ్రైస్ దాకా నోరూరించే వివిధ రకాల ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లోనే
ఎలా చేసుకోవాలో చూసేయండి.
ఫ్రెంచ్ ఫ్రైస్
National French Fries Day 2023: యేటా జులై 14 న నేషనల్ ఫ్రెంచ్ ఫ్రైస్ డే జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టపడే స్నాక్ మరి. అందుకే దానికోసం ప్రత్యేకంగా ఒక రోజునే నిర్ణయించారు. ఎప్పుడూ తినే పొటాలో ఫ్రెంచ్ ఫ్రైస్ కాకుండా కాస్త భిన్నంగా, ఇంట్లోనే రుచిగా వేరే వాటితో ఫ్రైస్ చేసుకోవచ్చో చూసేద్దాం.
1. అవకాడో ఫ్రైస్:
కావాల్సిన పదార్థాలు:
2 పెద్ద అవకాడోలు
పావు కప్పు మైదా
పావు కప్పు బ్రెడ్ క్రంబ్స్
1 చెంచా గార్లిక్ పౌడర్
సగం చెంచా ఉప్పు
పావు చెంచా మిరియాల పొడి
1 గుడ్డు, గిలగొట్టుకున్నది
నూనె డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం:
- అవకాడోలను సగానికి కట్ చేసి, సన్నని ముక్కలుగా చేసుకోవాలి. ఒక్కో అవకాడోను 3 నుంచి 4 ముక్కలుగా చేసుకోవాలి.
- ఒక గిన్నెలో మైదా, బ్రెడ్ క్రంబ్స్, గార్లిక్ పొడి, ఉప్పు, మిరియాల పొడి వేసుకుని బాగా విస్క్ చేసుకోవాలి.
- మరో గిన్నెలో గుడ్డు గిలకొట్టుకుని పెట్టుకోవాలి.
- అవకాడో ముక్కల్ని గుడ్డు సొనలో ముంచుకుని, పిండి మిశ్రమం కోట్ అయ్యేలా ఒకసారి దొర్లించాలి.
- ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేడిచేసుకుని, మీడియం మంటమీద అవకాడో ముక్కల్ని వేయించి తీసుకోవాలి. రంగు మారి క్రిస్పీగా మారతాయి.
- ఏదైనా డిప్ తో సర్వ్ చేసుకుంటే చాలు.
2. వెల్లుల్లి చిలగడదుంప ఫ్రైస్:
కావాల్సిన పదార్థాలు:
2 పెద్ద చిలగడదుంపలు
పావు కప్పు ఆలివ్ నూనె
1 చెంచా గార్లిక్ పౌడర్
సగం చెంచా ఉప్పు
పావు చెంచా మిరియాల పొడి
పావు చెంచా చీజ్ తురుము
తయారీ విధానం:
- ఓవెన్‌ను 425 డిగ్రీ F దగ్గర ప్రిహీట్ చేసుకోవాలి.
- ఇప్పుడు చిలగడదుంపలు చెక్కు తీసి, పొడవాటి ముక్కలు ఫ్రైస్ లాగా కట్ చేసుకోవాలి.
- ముక్కల్ని గిన్నెలో తీసుకుని అందులో ఆలివ్ నూనె, గార్లిక్ పౌడర్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు బేకింగ్ షీట్ మీద ఈ ఫ్రైస్ సర్దుకుని 20 నుంచి 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి.
- చివరగా చీజ్ చల్లుకుని సర్వ్ చేసుకుంటే చాలు.
3. క్యారట్ ఫ్రైస్:
కావాల్సిన పదార్థాలు:
2 పెద్ద క్యారట్లు
1 చెంచా ఆలివ్ నూనె
1 చెంచా కారం
సగం చెంచా ఉప్పు
పావు చెంచా మిరియాల పొడి
తయారీ విధానం:
- ఓవెన్ ను 425 డిగ్రీ F దగ్గర ప్రిహీట్ చేసుకోవాలి.
- క్యారెట్ చెక్కు తీసి పొడవాటి ఫ్రైస్ లాగా కట్ చేసుకోవాలి.
- క్యారెట్ ముక్కల్లో ఆలివ్ నూనె, కారం, ఉప్పు, మిరియాల పొడి వేసుకుని కలుపుకోవాలి.
- ఈ ముక్కల్ని బేకింగ్ షీట్ మీద దూరందూరంగా సర్దుకుని 20 నుంచి 25 నిమిషాలు బేక్ చేసుకోవాలి. అంతే!