Tuesday Motivation : శిష్యుల భవిష్యత్‍కు నిచ్చెన వేసే అక్షర కార్మికుడు.. విద్యార్థి ఎదుగుదల చూసే తోటమాలి గురువు
05 September 2023, 5:00 IST
- Tuesday Motivation : మన సంప్రదాయంలో గురువుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అమ్మానాన్న.. ఆ తర్వాత గురువే జీవితానికి ముఖ్యం. సరైన గురువు లేని జీవితం వ్యర్థం. భారతీయ సంస్కృతిలో గురువుకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు.
టీచర్స్ డే
మనిషి జీవితంలో కచ్చితంగా ఏదో ఒక రూపంలో గురువు అవసరం. మనల్ని అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుగులోకి తీసుకువచ్చే వ్యక్తి గురువు. అలాంటి గురువు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సత్యం, అసత్యం మధ్య తేడాను వివరించేది వారే. గురువు లేకుండా శిష్యుడు జ్ఞానం పొందడం అనేది అసాధ్యం. మన సంప్రదాయంలో గురువుది ప్రత్యేకమైన స్థానం. అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర.. గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః అంటారు. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తారు, గురువు ఆ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని సన్మార్గంలో నడిపించి వారి పురోగతికి బాటలు పరుస్తారు.
సెప్టెంబర్ 5న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఈ సందర్భంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న 'ఉపాధ్యాయ దినోత్సవం'గా జరుపుకొంటున్నాం. మన దేశంలో గురువులకున్న స్థానం వేరు. గురువునే దైవంగా కొలిచే సంస్కృతి మనది. పాఠాలు చెప్పే.. ఉపాధ్యాయుడిగా.. ఆచార వ్యవహారాలు నేర్పే ఆచార్యుడిగా.. తన జ్ఞానాన్ని మరొకరికి పంచి.. జీవితాల్లో వెలుగు నింపే గురువులు చాలా మంది ఉన్నారు.
గురువు పంచిన జ్ఞానమే మనల్ని ఎంతో ఎత్తుకు ఎదిగేలా చేస్తుంది. వారి బోధనలతోనే మన కలలను నిజం చేసుకుంటాం. తమ శక్తిని, విలువైన సమయాన్ని మన కోసం ఖర్చు చేసే నిస్వార్థమైనవారు గురువులు. మనల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు ఎంతో శ్రమిస్తారు. అలసట లేకుండా మన కోసం పని చేస్తారు.
గురువుల స్ఫూర్తిదాయకమైన మాటలే మన జీవితాన్ని మార్చేస్తుంది. వాళ్లు పంచిన జ్ఞానమే మన జీవితంలో వెలుగులు నింపుతుంది. గురువు ఇచ్చిన ప్రేరణతోనే మరింత పైకి ఎదుగుతాం. గురువుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. ఆదియుగం నుంచి ఆధునిక యుగం వరకు.. గురువే రుషి. శిష్యుల భవిష్యత్‍కు నిచ్చెన వేసే అక్షర కార్మికుడు.. విద్యార్థుల ఎదుగుదల చూస్తూ.., జీవితమనే తోటలో అనవసరమైన కలుపు మెుక్కలను తొలగించే తోటమాలి గురువు. అందుకే మన సమాజం.. మాతృదేవో భవ.. పితృదేవో భవ.. ఆచార్య దేవోభవ అని.. ఇప్పటికీ.. ఎప్పటికీ గుర్తు చేసుకుంటుంది.
దేవుడు, గురువు పక్క పక్కనే ఉంటే.. తాను మెుదట గురువుకే నమస్కారిస్తాను అన్నారు కబీర్ దాస్. కారణం.. ఆయన భగవంతడు అని మెుదట తనకు చెప్పింది గురువే కాబట్టి అని వివరించారు. సమాజానికి గురువు చేసే మేలు ఎంతో ఉంది. తాను చేసిన తప్పులు చేయకుండా శిష్యుడిని ముందుకు నడిపించే మార్గదర్శి గురువు. నిస్వార్థమైన మనసుతో శిష్యులను గొప్పవారిగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులందరికీ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు తరఫున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.