Time Management Skills: టైం పాస్ చేయకండి.. మీ సమయాన్ని ఇలా ఉపయోగించుకోండి!
28 February 2022, 18:51 IST
- గడిచిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేము. మనలో చాలా మందికి టైం విలువ తెలియదు. సమయపాలనను పట్టించుకోరు. ప్రతి విషయంలోనూ లేజీగానే ఉంటారు. ఎంతో విలువైన సమయాన్ని వృథా చేస్తుంటారు.
సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి
చిన్నప్పటి నుంచి 'టైం ఈజ్ మనీ' అన్న మాట వింటూనే ఉంటాం. సమయం విలువ తెలిసిన వారు జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోగలరనీ పెద్దలు చెబుతుంటారు. కొంతమంది జీవితంలో విజయం సాధించకపోవడానికి ముఖ్య కారణం.. సమయం విలువ తెలియకపోవడం. చేసే పనిలో విజయం సాధించాలంటే తప్పనిసరిగా సమయపాలన, క్రమశిక్షణ అవసరం.
టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్
మీ వృత్తిపరమైన లేదా వ్యక్తిగత జీవితంలో విజయం సాధించడానికి అనేక అంశాలు దోహదం చేస్తాయి. ఇందులో టైమ్ మేనేజ్‌మెంట్ అనేది ఒక సవాలుతో కూడుకున్న అంశం. వృత్తిపరమైన జీవితంలో మెరుగైన సమయ నిర్వహణ నైపుణ్యాలు మీకు మంచి ఉద్యోగిగా మాత్రమే కాకుండా కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు బలమైన అభ్యర్థిగా నిలవడంలో సహాయపడతాయి. మీ సమయ నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరచడానికి కొన్ని మార్గాలు ఇక్కడ చూడండి.
- షెడ్యూల్‌ను సిద్ధం చేసి, దానిని ఖచ్చితంగా అనుసరించండి
- మీ కోసం కొన్ని పరిమితులు పెట్టుకోండి
- దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోండి
- మీ క్యాలెండర్‌ను సమర్థవంతంగా నిర్వహించండి
- మీ అసైన్‌మెంట్‌లకు ప్రాధాన్యత ఇవ్వండి
ప్రణాళిక
ప్రతి పనికి ప్రణాళిక అవసరం. చాలా మంది తమకు టైం లేదని చాలా పనులు వదిలేస్తుంటారు. సంస్థ యాజమానికి, సంస్థలో ఉద్యోగికి రోజుకు 24 గంటలే ఉంటాయి. రోజులో ఏ పనికి ఎంత కేటాయించాలో తెలియకపోయినా.. క్రమశిక్షణ లేకపోయినా సమస్యలు తప్పవు. అందువల్ల రోజువారీ పనుల విషయంలో ప్రణాళిక అవసరం. ఉదయం లేచిన వెంటనే మీరు రోజులో చేయాల్సిన పనులపై వివరాలు ఒక చోట రాసుకోవటం మంచిది. దీంతో వృత్తిపరమైన, వ్యక్తిగతమైన పనులపై మీకు అవగాహన వస్తుంది. ఇలా చేయడం వల్ల పనులన్నీ సాఫీగా, సజావుగా జరుగుతాయి.
సమయాన్ని వృథా చేయొద్దు
ఎప్పుడూ సమయాన్ని వృథా చేయొద్దు. ప్రతి నిమిషం విలువైనది అనే విషయాన్ని గుర్తించాలి. సమయం వృథా కావొద్దంటే ఏ పని ముందు చేయాలి, ఏది తర్వాత అనేది ఆలోచించాలి. చేసే పని పాజిటివ్ కోణంలో చేస్తే తిరిగి ఆ పని చేయాల్సిన అవసరం ఉండదు. దీంతో ఉపయోగించుకున్న సమయానికి సరైన ఫలితం ఉంటుంది. అనుకున్న పని ఎంత టైంలో పూర్తి అవుతుందో ముందే ఓ అంచనా వేయాలి. ఆ టైం అనుకున్న పనికి అనుకూలంగా ఉంటుందో లేదో చూసుకోవాలి. ఆ తరువాత మొదలుపెట్టిన పనిని దిగ్విజయంగా పూర్తి చేయాలి. ఇలాంటి ప్రణాళికతో కూడిన ఆలోచన వల్ల మీ సమయం వృథా కాకుండా ఉంటుంది.
ప్రాధాన్యత
విజయవంతమైన సమయ నిర్వహణకు ప్రాధాన్యతే ప్రధానం. మీరు మీ రోజువారీ పనులలో ప్రాధాన్యత అంశాలకు సమయం ఇచ్చినప్పుడు మీరు కచ్చితంగా అతి తక్కువ కాలంలో మరో మెట్టుకు ఎదుగుతారు. అనుకున్న సమయానికి ప్రాధాన్యత గల అంశాలను పూర్తి చేసినప్పుడు దాదాపు మీరు ఆ రోజును విజయవంతంగా ముగించినట్టే. ముందుగా ముఖ్యమైన పనులను గడువులోగా పూర్తి చేసుకునేలా ప్రణాళిక రచించుకోండి. ఇలా చేయడం వల్ల మీపై ఒత్తిడి ఉండదు. మిగిలిన పనులను కూడా అనుకున్న సమయంలో పూర్తి చేయగలరు.
దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోండి
మీరు సాధించాలనుకుంటున్న అంశానికి సంబంధించి ఒక దీర్ఘకాలిక లక్ష్యాన్ని సెట్ చేసుకోండి. ఈ లక్ష్యాలు మీరు జీవితంలో ఏ దిశలో వెళ్లాలని కోరుకుంటున్నారనే దానికి సంబంధించిన ఆలోచనను అందిస్తాయి. ప్రతి దీర్ఘకాలిక లక్ష్యానికి స్వల్పకాలిక లక్ష్యాలు కూడా అవసరం. అవి మిమ్మల్ని ట్రాక్‌లో ఉంచుతాయి. మీ దీర్ఘకాలిక లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తాయి.
ఉదాహరణకు, ఆరు నెలల్లోగా ప్రమోషన్ పొందడం మీ లక్ష్యం అయితే మీరు భవిష్యత్‌లో చేరుకోవాలనుకుంటున్న స్థానానికి సంబంధించిన నిర్దిష్ట నైపుణ్యాలను మెరుగుపరచడం అనే స్వల్పకాలిక లక్ష్యాన్ని సెట్ చేసుకోవాలి. మీ లక్ష్యాలు నిర్దిష్టంగా, సాధించగలిగేలా, ఆనందాన్నిచ్చేలా ఉండాలి.
టాపిక్