Tuesday Motivation: డబ్బు కన్నా విలువైనది కాలం, గడిచిపోయిన సమయాన్ని కోట్లు ఇచ్చిన తిరిగి పొందలేరు
27 August 2024, 5:00 IST
- Tuesday Motivation: కాలం ఎంతో విలువైనది. దాని విలువ తెలుసుకోలేక చాలామంది కాలాన్ని వృధా చేస్తూ ఉంటారు. దాని విలువ తెలియాలంటే ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుంది.
మోటివేషనల్ స్టోరీ
Tuesday Motivation: మీకు అత్యంత ఇష్టమైన వ్యక్తికి ఏదైనా విలువైన బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా? ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికైనా ఇవ్వగలగే అత్యంత ఖరీదైన బహుమతి ‘సమయం’. మీ సమయం ఎంతో విలువైనది. ఎవరు పడితే వారికి ఆ సమయాన్ని ఇచ్చి వృధా చేయకండి. దాన్ని పదిలంగా ఉపయోగించుకోండి. ఎన్ని కోట్లు పెట్టినా కూడా కొనలేని విలువైన బహుమతి సమయం.
ఒక ఏడాది సమయం ఎంత విలువైందో పరీక్షల్లో తప్పిన ఒక విద్యార్థిని అడిగి చూడండి... తెలుస్తుంది. ఒకరోజు ఎంత విలువైనదో ఒకటో తేదీన జీతం రాని వ్యక్తిని అడిగి తెలుసుకోండి. ఒక నిమిషం ఎంత విలువైందో రైలు మిస్సయిన ఒక ప్రయాణికుడిని అడిగి చూడండి. సమయం విలువ తెలుసుకుంటే మీరు ఆ సమయాన్ని కచ్చితంగా సద్వినియోగం చేసుకుంటారు.
బయట వాళ్లకి ఇచ్చే మీ సమయాన్ని మీ ఇంట్లో వాళ్లకి ఇచ్చి చూడండి. వాళ్ళు బయట వాళ్ళు కాకుండా మీ వాళ్ళు గానే మిగిలిపోతారు. సమయం ఇద్దరి మధ్య అనుబంధాన్ని పెంచుతుంది. ఎంతోమంది జీవితాన్ని నిలబెడుతుంది.
సమయం, సముద్రంలోని ఆటుపోట్లు ఒకలాంటివే. అవి ఎవరి కోసం వేచి ఉండవు. తమ పని తాము చేసుకుంటూ పోతాయి. రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనుకోకుండా ఈరోజే మీరు చేయాల్సింది చేయండి. లేకుంటే ఈరోజు సమయం రేపు ఉండదు. ఎల్లుండికి మిగలదు.
సమయం నిజమైన విలువను తెలుసుకోండి. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. బద్ధకం, సోమరితనంతో వాయిదా వేయడాన్ని మానుకోండి. ఈరోజు ఏమి చేయగలరో... ఈరోజే చేయండి. రేపటికి ఎప్పుడు వాయిదా వేయకండి.
మీరు జీవితంలో కోల్పోయిన ఒక్క క్షణాన్ని కూడా తిరిగి పొందలేరు. సమయాన్ని వెచ్చించడం అంటే మీరు పెట్టుబడి పెట్టినట్టే. దానికి తగిన ఫలితం రావాల్సిందే. ఏ ఫలితం రాలేదంటే మీరు సమయాన్ని వృధా చేశారని అర్థం. డబ్బు కన్నా సమయమే విలువైనది. మీరు కావాలనుకుంటే ఎంత డబ్బు నైనా సంపాదించగలరు. కానీ సమయాన్ని మాత్రం సంపాదించలేరు.
కాలం కుదురుగా నిలబడలేదు. నిత్యం ప్రయాణిస్తూనే ఉంటుంది. మనం కూడా దానితో పాటూ ఆగకుండా పయనిస్తూనే ఉండాలి. మీరు ధనవంతుడవ్వాలా లేక పేదవాడు కావాలా అన్నది మీరు సమయాన్ని ఎలా వినియోగిస్తున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుంది.
కాలం విలువ తెలిస్తే డబ్బు విలువ తెలుస్తుంది, జీవితం విలువ తెలుస్తుంది. కాలం విలువ తెలియని వాడు, జీవితం విలువ అర్థం చేసుకోలేడు. వేచి ఉండే ఓపిక మీకున్నా.. కాలానికి మాత్రం లేదు. మీరు దాని వెంట పరుగులు తీయాల్సిందే. కాబట్టి కాలాన్ని గౌరవించండి, సద్వినియోగం చేసుకోండి... దాని ఫలితం తీయగా ఉంటుంది.