నాన్నా..సింహం సింగిల్‌గా రాదు, తన సైన్యంతో వేటాడుతుంది, అందుకే అది అడవికి రారాజు
28 February 2022, 14:27 IST
- సింహం ఎప్పుడూ ఒంటరిగా నడవదు, తన సహచరులతో కలిసి నడుస్తుంది, దీనినే 'లయన్స్ ప్రైడ్' గా చెప్తారు. వేట కూడా సింహాలు బృందంగా వేటాడుతాయి, కలిసి ఆహారాన్ని తింటాయి. ఆ బృందానికి ఒక మగ సింహం నాయకత్వం వహిస్తుంది.
Lion- King of the jungle
పక్షులెన్ని ఉన్నా గగనపు వీధిలో రాజు డేగ అయితే అడవిలో ఎన్ని జంతువులున్నా సింహమే రారాజు. ఇదే ప్రకృతి చెప్పే సత్యం. ఇక్కడ సింహం గురించి మనం మాట్లాడుకుంటే, అడవిలో అతిపెద్ద జంతువేమి కాదు, తెలివైంది కాదు, వేగంగా పరుగెత్తేది కూడా కాదు. మరోవైపు పెద్దపులి, హైనాలు మరికొన్ని మాంసాహార జీవులు కూడా అడవిలో తమ ఆధిపత్యం ప్రదర్శిస్తాయి. అయినప్పటికీ అడవిలో ఏ జంతువుకి దక్కని గౌరవం, హోదా ఒక సింహానికి మాత్రమే దక్కింది. ఒక్క సింహం మాత్రమే మృగరాజుగా.. 'కింగ్ ఆఫ్ ద జంగల్' గా కీర్తి గడిస్తుంది. మరేందుకు అలా అంటే? సింహం ఆటిట్యూడ్ అలాంటిది అని చెప్తారు.
అడవికే రారాజు..
ఒక సమూహం మధ్యలో వ్యవహరించే తీరు, అవలంబించే వైఖరి, అనుసరించే వ్యూహాలు నాయకత్వ లక్షణాలను సూచిస్తాయి. సరిగ్గా సింహాలు ఇవే లక్షణాలను కనబరుస్తాయి.
సింహానికి ఉన్న కొన్ని లక్షణాలు ఒకసారి గమనిస్తే, సహజంగా అడవిలో ఏ జంతువునైనా వేటాడి తింటుంది. కానీ, సింహాన్ని వేటాడే జంతువు అడవిలో లేదు. అలాగే అది ఏ ప్రదేశానికైనా వెళ్తుంది, అంతా తనదే అన్నట్లుగా భావిస్తుంది. అదే పులి విషయానికి వస్తే, కొంతమేర ప్రాంతంలో తన టెరిటరీగా ఏర్పర్చుకొని అక్కడే జీవిస్తుంది.
లయన్స్ ప్రైడ్..
సింహం ఎప్పుడూ ఒంటరిగా నడవదు, తన సహచరులతో కలిసి నడుస్తుంది, దీనినే 'లయన్స్ ప్రైడ్' గా చెప్తారు. వేట కూడా సింహాలు బృందంగా వేటాడుతాయి, కలిసి ఆహారాన్ని తింటాయి. ఆ బృందానికి ఒక మగ సింహం నాయకత్వం వహిస్తుంది. "నాన్నా సింహం సింగిల్ గా వస్తుంది" అని ఒక సినిమాలో చెప్పే డైలాగ్ నిజానికి శాస్త్రీయంగా తప్పు, అది పెద్దపులికి వర్తిస్తుంది. పెద్దపులి ఒంటరిగా, ఆకస్మిక దాడి చేస్తుంది. ఏదైమైనా సింహం కూడా సింగిల్ గా దాడి చేసే శక్తి, సామర్థ్యాలు కలిగింది. కానీ సింహం సమయం చూసి పంజా విసురుతుంది.
నిద్ర జాస్తి..
ఒక రాజు లాగే సింహం కూడా తన తరువాత వారసుడు ఎవరన్నది ఎన్నుకుంటుంది. సింహం ముసలి అయినపుడు లేదా తన ఆధిపత్యాన్ని కోల్పోయినపుడు అది తన సమూహంలోని మరో సింహానికి బాధ్యతలను అప్పజెప్తుంది. అంతేనా సింహం కనీసం రోజుకు దాదాపు 16 నుంచి 20 గంటలు నిద్రపోతుంది. ఇంతకంటే రాజా జీవితం ఇంకేం కావాలి?
ఇలాంటి విలక్షణమైన లక్షణాలు సింహాలకు ఉంటాయి కాబట్టే అవి మృగరాజులుగా వెలుగొందుతున్నాయి. వాటి గంభీరమైన నడక, ఎంతటి శత్రువునైనా భయపెట్టే గర్జన, శక్తివంతమైన పంజా దెబ్బ, మగ సింహాల ముఖాలపై సహజంగా ఉండే జూలు రాజుకు ఉండే ఒక కిరీటం లాగా కనిపిస్తాయి. అందుకే.. ద లయన్ ఈజ్ ఆల్వేజ్ కింగ్!