Thursday Motivation: ఈ సంస్కృత మంత్రాలు జీవిత పరమార్ధాన్ని సింపుల్‌గా చెప్పేస్తాయి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి
01 August 2024, 5:00 IST
- Thursday Motivation: ప్రపంచంలోని పురాతన భాషలలో సంస్కృతం ఒకటి. ఇది చాలా తక్కువ పదాలలో జీవిత పరమార్ధాన్ని వివరిస్తుంది. అలాంటి కొన్ని సంస్కృత మంత్రాలను ఇక్కడ ఇచ్చాము.
మోటివేషనల్ స్టోరీ
Thursday Motivation: సంస్కృతాన్ని దైవ భాషగా చెబుతారు. ఎంతో గాంభీర్యమైన భాషలా కనిపిస్తుంది ఈ సంస్కృతం. ఈ భాషలోని పదాలు మనపై ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. జీవితంలోని ఏ విషయాన్ని అయినా వ్యక్తీకరించడానికి చాలా తక్కువ పదాలలో సంస్కృతంలో చెప్పొచ్చు. ఇక్కడ కొన్ని సంస్కృత కోట్స్ ఉన్నాయి. ఇవి జీవిత పరమార్ధాన్ని సూక్ష్మంగా చెబుతాయి.
సర్వం అనిత్యం
‘సర్వం అనిత్యం’ అంటే ‘అంతా తాత్కాలికమే’ అని అర్థం. ఇవి రెండు సాధారణ పదాలు మాత్రమే. కానీ ఎంతో అర్ధాన్ని కలిగి ఉన్నాయి. జీవితంలో ప్రతి దశా, ప్రతి వస్తువు తాత్కాలికమైనదని చెప్పడమే దీని భావం. ఇది జీవితంలోని అశాశ్వత గురించి చెబుతుంది. భౌతిక ప్రపంచంలో ఏది శాశ్వతం కాదని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి సుఖదుఃఖాలను మనసుకు తీసుకోకుండా ప్రశాంతంగా జీవించండి.
పరివర్తకో భవ
‘పరివర్తకో భవ’ అంటే మారడానికి సిద్ధంగా ఉండమని అర్థం. ప్రపంచంలో మీరు కోరుకున్నట్టు అన్నీ జరగవు. ప్రపంచంలో జరిగే మార్పులకు అనుగుణంగా మీరు మారడానికి సిద్ధంగా ఉండాలని ఈ సంస్కృత వాక్యం చెబుతోంది. ఇది ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే వాక్యం. రెండు సాధారణ పదాలలో ఒక మనిషి జీవితాన్ని మార్చేంత అర్థం ఉంది. మారడానికి ఎప్పుడూ మనిషి సిద్ధంగా ఉంటేనే ఎదురయ్యే ప్రతి సమస్యను దాటగలడు.
విహాగ్ ఇవ ముక్తం
‘విహాగ్ ఇవ ముక్తం’ అంటే ప్రతి మనిషి పక్షుల్లా స్వేచ్ఛగా ఎగరాలన్న అర్థం. ప్రతి మనిషికి ఎన్ని సమస్యలు ఉన్నా, పరిమితులు ఉన్నా వాటిని అదుపులో పెట్టుకొని స్వేచ్ఛగా జీవించాలన్నదే ఈ వాక్యం అర్థం. ఆకాశంలో ఎగురుతున్న పక్షులు స్వేచ్ఛగా ఉండమని ఇది చెబుతోంది. ఎక్కడో ఏదో జరుగుతుందనే చింతనతో జీవించడం కన్నా, పక్షుల్లా స్వేచ్ఛగా ఉండడమే సంతోషానికి దారి అని వివరిస్తుంది.
అహం స్వయమేవ పర్యాప్తః
ఈ వాక్యానికి సంస్కృతంలో నేనొక్కడినే చాలు అనే అర్ధాన్ని ఇస్తుంది. అంటే జీవితమనే పందెంలో మీకు ఎవరూ తోడు రారు. మీరు ఒక్కరే మీకు తోడుగా ఉండాలని ఇది సూక్ష్మంగా సూచిస్తుంది. ఏ రేసులో అయినా చివరికి ఒకరే మిగులుతారు. కాబట్టి ఎదుటి వారిపై ఆధారపడడం మానేసి, మీకు మీరుగా ఎదగమని చెప్పే సంస్కృత వాక్యం ఇది.
పశ్చాతాపహ న, భయం న
దీనికి అర్థం ‘పశ్చాత్తాపం లేదు, భయం లేదు’ అని అర్థం, జీవితంలో వేసే ప్రతి అడుగుకు భయపడడం మానేయాలి. అలా అడుగులు వేసాక వచ్చే పరిణామాలను స్వీకరించాలి. అంతే తప్ప పశ్చాత్తాప పడుతూ కూర్చోకూడదు. అది మంచైనా చెడైనా ఒక పని చేశాక పశ్చాత్తాపాన్ని వీడి ముందుకే సాగడం అలవాటు చేసుకోమని ఈ సంస్కృతం శ్లోకం చెబుతుంది. తాము చేసే పనిని భయంతో చేసినా, ఆ పని పూర్తయ్యాక పశ్చాత్తాప పడినా కూడా ఫలితాలు సవ్యంగా రావు. మీరూ చేసే ప్రతి పని, తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మీకు మీరు స్వీకరించాలి. అంగీకరించాలి. అప్పుడే మీకు అది ప్రోత్సాహాన్ని అందిస్తుంది.