సౌత్- ఇండియాలోని ఈ రొమాంటిక్ బీచ్‌లు హనీమూన్ జంటలకు ప్రత్యేకం
28 February 2022, 20:06 IST
- హనీమూన్ విషయానికి వస్తే బీచ్‌లు చాలా రొమాంటిక్ ప్రదేశాలుగా పరిగణించవచ్చు. ఉదయం సన్ రైజ్ చేస్తూ తీరం వెంబడి జాగింగ్ చేయడం, ఇసుక గూళ్లు నిర్మించి జాలీగా గడపడం, సాయంకాలం సన్ సెట్ చూస్తూ సముద్రపు అలలు తాకుతుండగా ఇసుక తివాచీపై జంటగా నడవడం తన్మయత్వంతో కూడిన అనుభూతిని కలగజేస్తాయి.
Representational Image
కొత్తగా పెళ్లైన జంటలు ఏకాంతాన్ని కోరుకుంటాయి. ఈ ఏకాంతం ఆలుమగలను మనసు విప్పి మాట్లాడుకునేలా చేసి ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు తోడ్పాటునిస్తుంది. వారి మధ్య బంధం మరింత ధృడంగా మారేందుకు ఒక అవకాశం కల్పిస్తుంది. అందుకే కొత్త జంటలు కొన్ని రోజుల పాటు ఎక్కడైనా గడిపేందుకు 'హనీమూన్' అంటూ వెళ్తుంటారు. ఇందుకోసం ఏదైనా ప్రశాంతమైన రొమాంటిక్ ప్రదేశాల కోసం అన్వేషిస్తారు.
ఇక హనీమూన్ కోసం ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు బీచ్‌లు చాలా రొమాంటిక్ ప్రదేశాలు అని చెప్తారు. ఉదయం సన్ రైజ్ చేస్తూ తీరం వెంబడి జాగింగ్ చేయడం, ఇసుక గూళ్లు నిర్మించి జాలీగా గడపడం, సాయంకాలం సన్ సెట్ చూస్తూ సముద్రపు అలలు తాకుతుండగా ఇసుక తివాచీపై జంటగా నడవడం, మెత్తని ఇసుకలో సేదతీరుతూ అలలు శ్రావ్యమైన శబ్దాల మధ్యన చల్లని పిల్లగాలులు తాకుతుండగా ఊసులాడుకోవడం ఒక తన్మయత్వంతో కూడిన అనుభూతిని బీచ్‌లు కలగజేస్తాయి. మరి ఇంతకంటే గొప్ప రొమాంటిక్ ప్లేస్ ఒక జంటకు వేరే ఏదైనా ఉంటుందా?
మన తెలుగు రాష్ట్రాలకు చాలా చేరువగా దక్షిణ భారతదేశ వ్యాప్తంగా హనీమూన్ కు అనువైన ఎన్నో బీచ్ ప్రాంతాలు ఉన్నాయి. అందులో కొన్ని ఉత్తమమైనవి ఎంపిక చేసి వాటి వివరాలు ఇక్కడ అందజేస్తున్నాం. ఇవి మీకు ఉపయోగపడతాయని భావిస్తున్నాం.
అగొండా బీచ్, గోవా
గోవాలో అనేక బీచ్‌లు ఉన్నాయి, అయినప్పటికీ ఇక్కడి అగొండా బీచ్ హనీమూన్ జంటలకు అనువైనదిగా చెప్తారు. ఈ బీచ్‌లో అలల అటుపోట్లు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి, ఈతకు అంతగా సురక్షితం కాదు. అంతేకాకుండా సముద్రం వద్ద జరిపే అడ్వెంచర్స్ కు అవకాశం తక్కువ. దీంతో ఈ బీచ్‌కు పర్యాటకుల తాకిడి కూడా తక్కువగా ఉంటుంది. చాలా వరకు జంటలే ఈ బీచ్‌లో దర్శనమిస్తాయి. అందువల్ల సాయంకాలం సమయంలో సూర్యాస్తమయం చూస్తూ విశాలమైన ఇసుక తిన్నెల్లో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు. సెక్యూరిటీ కూడా ఉంటుంది కాబట్టి కలవరపడాల్సిన అవసరం లేదు. సమీపంలోనే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి కాబట్టి రుచికరమైన ఫుడ్, బేవరేజెస్ ఆస్వాదించవచ్చు.
కాండోలిమ్ బీచ్, గోవా
గోవాలోనే మరొకటి కాండోలిమ్ బీచ్. ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన బీచ్‌లలో ఒకటి. ఉత్తర గోవాలోని కలాంగుట్, అగుడా బీచ్‌లకు సమీపంలో ఉండే కాండోలిమ్ బీచ్ హనీమూన్ జంటలకు మరో చక్కటి గమ్యస్థానంగా చెప్పవచ్చు. ఈ బీచ్‌కు పర్యాటకుల తాకిడి ఉన్నప్పటికీ ప్రశాంతమైన వాతావరణాన్నే అందిస్తుంది. ఈ బీచ్‌లో బీచ్ పారాసైలింగ్, వాటర్ స్కీయింగ్ లాంటి వాటర్ స్పోర్ట్స్ కార్యకలపాలతో పాటు ఎన్నో బీచ్ రెస్టారెంట్లు రుచికరమైన ఆహారం, పానీయాలతో ఆకర్షిస్తాయి. ప్రశాంతమైన అలలు, పరిశుభ్రమైన తీరం కలిగి మీకు సన్నిహితమైన క్షణాలను ఆస్వాదించటానికి కాండోలిమ్ బీచ్ అవకాశం కల్పిస్తుంది.
వర్కాల బీచ్, కేరళ
కేరళ రాష్ట్రం హనీమూన్ జంటలకు ఒక మంచి ఛాయిస్. ఇక్కడ అందమైన హిల్ స్టేషన్స్, బ్యాక్ వాటర్ ప్రదేశాలతో పాటు రొమాంటిక్ బీచ్‌లకు కొదవలేదు. ఇక్కడి వర్కాల బీచ్ హనీమూన్ జంటలకు ఒక ప్రశాంతమైన డెస్టినేషన్ గా చెప్పవచ్చు. చుట్టూ కొండలతో అరేబియా సముద్రం యొక్క విశాలమైన దృశ్యం అద్భుతం అనిపిస్తుంది. ఈ బీచ్ వెంబడి ఆయుర్వేద మసాజ్‌ను కూడా ఆస్వాదించేందుకు అవకాశం ఉంది. అంతేకాకుండా వర్కాల బీచ్ కు సమీపంలో ఎన్నో చూడదగ్గ ప్రదేశాలున్నాయి. ఒక బైక్‌ను అద్దెకు అన్ని ప్రదేశాలను చుట్టేయవచ్చు.
మరారి బీచ్, అలప్పుజ, కేరళ
కేరళలోని మరారీ బీచ్ మరో అద్భుతమైన ప్రదేశం. ఏడాది పొడవునా అనేక కార్యకలాపాలతో ఈ బీచ్ ఎప్పుడూ సందడిగా ఉంటుంది. ఒకవైపు అందమైన సముద్రం, మరోవైపు పొడవాటి కొబ్బరిచెట్లతో ఈ ప్రదేశం స్వర్గాన్ని తలపిస్తుంది. ఇది హనీమూన్ జంటలకు ఎంతో అనువైన ప్రదేశం. ఇక్కడ గుడిసెల లాంటి రిసార్టుల్లో బస చేయడం, అందులోనే ఒక రాత్రి నిద్రించడం జీవితంలో మరిచిపోలేని అనుభూతినిస్తుంది. మరో విశేషం ఏమిటంటే వర్షకాలంలో కూడా ఈ బీచ్ సందర్శించటానికి అనువైంది. కాబట్టి సీజన్ తో సంబంధం లేకుండా ఇక్కడ హనీమూన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ బీచ్ సమీపంలో కూడా ఎన్నో పర్యాటక ప్రదేశాలున్నాయి.
యారాడ బీచ్, వైజాగ్
సముద్రతీరాల ప్రస్తావించే ముందు ఇక్కడ విశాఖనగరం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 'సిటీ ఆఫ్ డెస్టినీ'గా పేరుగాంచిన వైజాగ్ నగరంలో ఎన్నో బీచ్ లు ఉన్నాయి. అయితే ఇక్కడి యారాడ బీచ్ హనీమూన్ జంటలకు అనువైనది అని చెప్పవచ్చు. బిజీబిజీ నగర జీవితానికి దూరంగా ప్రశాంతమైన ప్రదేశంలో ఉండే యారాడ బీచ్ కు సందర్శకుల తాకిడి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏకాంతంగా గడిపే అవకాశం లభిస్తుంది.
టాపిక్