తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Children's Day: మన దేశ పిల్లల కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులు ఇవన్నీ, వీటిని వారికి అందించే బాధ్యత మనదే

Children's Day: మన దేశ పిల్లల కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులు ఇవన్నీ, వీటిని వారికి అందించే బాధ్యత మనదే

Haritha Chappa HT Telugu

13 November 2024, 14:00 IST

google News
    • Children's Day: మన దేశంలో జరిగే ముఖ్య వేడుకల్లో బాలల దినోత్సవం ఒకటి. నవంబర్ 14 వచ్చిందంటే దేశమంతా పిల్లల పండుగలో బిజీగా మారిపోతుంది. ఈ సందర్భంగా పిల్లలకు మన దేశంలో ఎలాంటి హక్కులు ఉన్నాయో తెలుసుకుందాం.
బాలల ప్రాథమిక హక్కులు ఇవే
బాలల ప్రాథమిక హక్కులు ఇవే (Pixabay)

బాలల ప్రాథమిక హక్కులు ఇవే

చిల్డ్రన్స్ డే లేదా బాలల దినోత్సవం... ఈ పండుగ కేవలం పిల్లల కోసం ఏర్పాటు చేసినది. మన దేశంలో ఉన్న ప్రతి బిడ్డా ఆనందంగా ఉండాలన్న నెహ్రూ ఆకాంక్ష రూపమే ఈ చిల్డ్రన్స్ డే. మన దేశ మొదటి ప్రధాన మంత్రి అయినా జవహర్ లాల్ నెహ్రూకి పిల్లలంటే ఎంతో ప్రేమ. వారు కనిపిస్తే చాలు ఆయన మనసు కరిగిపోయేది. అందుకే ఆయన పుట్టిన రోజున అంటే నవంబర్ 14న భారతదేశంలో బాలల దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. చాచా నెహ్రూ కోరిక ప్రకారం పిల్లలకు వారి హక్కులు, విద్యా, సంక్షేమం అన్ని సవ్యంగా అందాలి. అలా అందించే బాధ్యత ఈ ప్రభుత్వం, పెద్దలు, సమాజానిదే. రాజ్యాంగం కూడా పిల్లల కోసం కొన్ని హక్కులను కల్పించింది. ఆ హక్కుల వారికి అందేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

బాలల ప్రాథమిక హక్కులు

భారత రాజ్యాంగం బాలల కోసం అనేక ప్రాథమిక హక్కులను ఇచ్చింది. వారి కోసం బాలల హక్కుల చట్టాన్ని చేసింది. వాటిలో కొన్ని ముఖ్యమైన చట్టాలు ఉన్నాయి. వీటి గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవాలి. తమ పిల్లలకు కూడా వీటి గురించి చెప్పాలి. ఆ హక్కులు ఏంటో తెలుసుకోండి.

సమానత్వపు హక్కు

రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం ప్రతి బిడ్డా సమానమే. ప్రతి బిడ్డను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. వారికి అవసరమైనప్పుడు చికిత్సను అందించాలి. అందరి పిల్లలను సమానంగా చూడాలి. పేద, ధనికా అనే బేధం ఇక్కడ లేదు. అదే ఈ సమానత్వ హక్కు చెబుతోంది.

జీవించే హక్కు

ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు జీవించే హక్కు ఉంది. వారికి పూర్తి స్వేచ్ఛను, భద్రతను ఇవ్వాల్సిన బాధ్యత సమాజానిదే. వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, సమాజం, ప్రభుత్వానిదే అని ఆర్టికల్ 21 చెబుతోంది. వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదు.

వివక్ష

పిల్లలను వారి జాతి, మతం, కులం, లింగం ఆధారంగా వివక్షకు గురి చేయకూడదు. వారు పుట్టిన ప్రదేశం, వారి రంగు, రూపం ఆధారంగా వివక్షను చూపించకూడదు. అందరి పిల్లలను సమానంగా చూడాలని ఆర్టికల్ 15 వివరిస్తోంది.

ఉచిత నిర్బంధ విద్యాహక్కు

ఆర్టికల్ 21ఏ చెబుతున్న ప్రకారం ఈ దేశంలో పుట్టిన ప్రతి పిల్లాడికి ఉచిత విద్యను అందించాలి. అలాగే నిర్బంధ విద్యను కూడా ఇవ్వాలి. ముఖ్యంగా ఆరు ఏళ్ల నుండి 14 సంవత్సరాల మధ్య పిల్లలకు విద్యను కచ్చితంగా అందించాల్సిందే. నిర్బంధ విద్య అంటే వారికి ఇష్టం లేకపోయినా కూడా వారిని స్కూల్లో జాయిన్ చేసి చదివించాల్సిన బాధ్యత ఉంది. అది వారి భవిష్యత్తు కోసమే.

దోపిడి నుంచి రక్షణ

ఎన్నో చోట్ల పిల్లల అక్రమ రవాణా జరుగుతోంది. వారిని బలవంతంగా వెట్టి చాకిరీలోకి పంపిస్తున్నారు. ఇలా చేయకుండా వారి అక్రమ రవాణాలను అడ్డుకోవడానికి ఆర్టికల్ 23 ఏర్పాటు చేశారు. దీని ప్రకారం పిల్లలను అక్రమంగా తీసుకెళ్లి పనుల్లో పెట్టుకోవడం నేరం.

ప్రమాదకర పనులు

పద్నాలుగేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ఉద్యోగాలలో నియమించుకోకూడదు. ముఖ్యంగా ప్రమాదకర పరిస్థితుల్లో చేసే పనుల్లో వీరిని ఉంచకూడదని ఆర్టికల్ 24 చెబుతోంది.

భాగస్వామ్య హక్కు

పిల్లలు తమకు నచ్చిన విషయాలను లేదా నచ్చిన చదువును గురించి అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు వారికి ఉంది. వారి అభిప్రాయాల్ని కొట్టిపడేయాల్సిన అవసరం లేదు. వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని రాజ్యాంగం వివరిస్తుంది.

గుర్తింపు హక్కు

ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఒక పేరు, జాతీయత కచ్చితంగా ఉంటుంది. అలాగే వారి కుటుంబ సంబంధాల విషయంలో కూడా వారు పలానా వారి అబ్బాయి అనే హక్కును కల్పిస్తుంది. ఎవరూ కూడా బిడ్డ జాతీయతను లేదా కుటుంబ సంబంధాలను నిర్వీర్యం చేయలేరు.

పర్యావరణ హక్కు

పిల్లలు తమ చుట్టూ ఉన్న పరిసరాలలో ఆనందంగా జీవించే సురక్షిత పర్యావరణ హక్కును వారికి ఇవ్వాలి. వారి ఆనందాన్ని దూరం చేసి పరిసరాలలో దుర్వినియోగం, హింస, దోపిడీ వంటి వాటికీ గురికాకుండా రాజ్యాంగం రక్షణ కల్పిస్తోంది.

అభివృద్ధి హక్కు

ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఆరోగ్యపరంగా సంరక్షణ లభించాలి. పోషకాహారం అందించాలి. వారి సంపూర్ణ అభివృద్ధికి అవకాశాలు కల్పించాలని రాజ్యాంగం ఆర్టికల్ 39 ఎఫ్ లో వివరిస్తుంది.

బాలల దినోత్సవం వస్తే ప్రతి పాఠశాలలో రకరకాల టాలెంట్ షోలు, సాంస్కృతిక ప్రదర్శనలు, సరదా ఆటలు పెడుతూ ఉంటారు. నిజానికి పిల్లలకు తమకు ఈ దేశం నుంచి కల్పించే రక్షణ వ్యవస్థ గురించి చెప్పాలి. వారి రాజ్యాంగపు హక్కుల గురించి వివరించాలి. వారు ఎక్కడైనా హింసకు గురైతే వారిని వారు ఎలా కాపాడుకోవాలో, రక్షణను ఎలా కోరాలో వివరించాలి. అలా అయితేనే బాధలు సురక్షితంగా ఎదగగలరు.

టాపిక్

తదుపరి వ్యాసం