Healthy Winter Soups | చలికాలం సాయంకాలాన్ని వేడివేడి చికెన్ సూప్‌తో ఆస్వాదించండి
28 February 2022, 15:25 IST
- చలికాలం సాయంకాలాల్లో వేడివేడి సూప్ గొంతులో జారుతూ ఉంటే ఆహా.. ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఈ సూప్స్ ఎంతో రుచికరంగా ఉంటూ సాధారణంగా వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా, రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
చికెన్ సూప్
చలికాలంలో ఒకరకమైన స్తబ్ధత ఆవరించినట్లు ఉంటుంది. ఏ పని చేయాలనిపించదు. చల్లటి గాలులు శరీరాన్ని తాకుతున్నప్పుడు నిండా ముసుగేసుకొని వెచ్చగా పడుకోవాలనిపిస్తుంది. ఏదైనా వేడిగా ఉంటేనే తినాలనిపిస్తుంది. వేడిగా ఉండే సూప్స్ తాగాలనిపిస్తుంది. ఈ చలికాలం సాయంకాలాల్లో వేడివేడి సూప్ గొంతులో జారుతూ ఉంటే ఆహా.. ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఈ సూప్స్ ఎంతో రుచికరంగా ఉంటూ సాధారణంగా వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా, రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ముఖ్యంగా చికెన్ సూప్ చేసుకొని తాగితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది.
ఇక్కడ మీకోసం ఒక ఆరోగ్యకరమైన, పోషకాలతో నిండిన చికెన్ సూప్ రెసిపీని అందిస్తున్నాం. ఇది చేసుకోవడం కూడా చాలా సులభం. ఈ వింటర్‌లో ఇంట్లోనే ఉండి ఈ సూప్ చేసుకొని తాగండి, ఎంజాయ్ చేయండి.
కావలసిన పదార్థాలు:
350 గ్రాముల కాలీఫ్లవర్ ముక్కలు
1/4 కప్పు బాదం పాలు లేదా చిక్కటి పాలు
1 కప్పు క్యారెట్ ముక్కలు
1 కప్పు సెలెరీ ముక్కలు లేదా ఉల్లికాడ ముక్కలు లేదా ముల్లంగి ముక్కలు
1/2 కప్పు తెల్ల ఉల్లిపాయ ముక్కలు
2 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె
2 కప్పుల బంగాళాదుంప ముక్కలు
అరకిలో చికెన్ (బ్రెస్ట్ భాగం)
చికెన్‌ను ఉడకబెట్టిన ఉప్పు నీరు - 4 కప్పులు
1 స్పూన్ థైమ్ లేదా ఓమ/వాము
1/2 స్పూన్ వెల్లుల్లి పొడి
రుచి తగినంత ఉప్పు, మిరియాలు
తయారీ విధానం:
ముందుగా అన్ని కూరగాయలను కోసి పెట్టుకోవాలి. ఒక పాత్రలో కాలీఫ్లవర్‌ను ఉడకబెట్టుకొని ఆ తర్వాత అందులోని నీటిని మొత్తం తీసేసి కాలీఫ్లవర్ ముక్కలను ఒక పక్కన పెట్టుకోవాలి. మరోపాత్రలో కొద్దిగా నీరు తీసుకొని, అందులో కొద్దిగా ఉప్పు, కావాలనుకుంటే చిటికెడు పసుపు కూడా వేసుకొచ్చు. ఈ నీటిలో శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కలను వేసి ఉడికించుకోవాలి. దీని తర్వాత చికెన్ వేరుచేసి ఈ నీటిని ఒక పక్కన ఉంచుకోవాలి. ఉడికిన చికెన్ ను చిన్నచిన్న ముక్కలుగా తరుగుకోవాలి.
ఇప్పుడు ఒక బాణలిలో ఆలివ్ నూనె వేడి చేసి ఉల్లిపాయలు, ముల్లంగి, క్యారెట్ ముక్కలను వేగించుకోవాలి. మెత్తగా ఉడికే వరకు వాటిని వేడిచేయాలి. ఆపై చికెన్ ఉడికించిన నీరు బాణిలో పోసుకొని, ఇందులోనే బంగాళాదుంప ముక్కలు వాము, వెల్లుల్లి పొడి, మిరియాలు, తగినంత ఉప్పు వేసి మరిగించండి. మధ్యమధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి.
మరోవైపు, పాలను బ్లెండర్‌లోకి తీసుకొని అందులో ఉడికించి ఆరబెట్టిన కాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని చక్కగా బ్లెండ్ చేసుకొని అందులోకి తురిమిన చికెన్ ముక్కలను కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూరగాయలు మరిగిస్తున్న బాణిలో వేసి ఒక 5 నిమిషాల పాటు కలిపి దించేయాలి. చికెన్ సూప్ రెడీ అయినట్లే, దీనిని వేడివేడిగా ఆస్వాదించండి.
ప్రయోజనాలు:
ఈ విధంగా చికెన్ సూప్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇందులో ఉపయోగించే పదార్థాలలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. కాబట్టి ఈ సూప్ ఎంతో ఆరోగ్యకరమైనది కూడా. ఇందులో శరీరానికి అవసరమయ్యే ఫ్యాటీ ఆసిడ్స్, ప్రోటీన్లు పుష్కలంగా సమృద్ధిగా ఉంటాయి. ఇవి కండరాలను, ఎముకలను దృఢంగా మార్చడంలో సహాయపడతాయి. చర్మం, రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.