Meal Maker 65: మీల్ మేకర్ 65 తిన్నారంటే ఆహా అనాల్సిందే, సింపుల్ రెసిపీ ఇదే
20 October 2024, 15:30 IST
Meal Maker 65: మీల్ మేకర్ 65 మంచి కమ్మటి స్నాక్. మీల్ మేకర్ అంటే మీకిష్టముంటే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయాల్సిందే. ఈ సింపుల్ రెసిపీ కోసం ఏమేం కావాలో, తయారీ ఎలాగో చూసేయండి.
మీల్ మేకర్ 65
మీల్ మేకర్ 65 మంచి పార్టీ స్నాక్ అనుకోవచ్చు. ఫ్యాన్సీగా, రుచిగా ఉండే సింపుల్ రెసిపీ ఇది. సాయంత్రం పూట పిల్లలకు చేసివ్వడానికి సులభంగానూ పూర్తయిపోయే వంటకం. ఎక్కువగా చికెన్ 65, పన్నీర్ 65 లాంటివి తింటుంటాం. కానీ ఈసారి మీల్ మేకర్ లేదా సోయా చంక్స్ తో ఎలా చేయాలో చూసేయండి.
మీల్ మేకర్ 65 కోసం కావాల్సిన పదార్థాలు:
2 కప్పుల మీల్ మేకర్ లేదా సోయా చంక్స్
2 చెంచాల కార్న్ ఫ్లోర్ (బియ్యం పిండి కూడా వాడొచ్చు)
2 చెంచాల మైదా
1 చెంచాడు కారం
అర చెంచా మిరియాల పొడి
అరచెంచా ధనియాల పొడి
అర చెంచా జీలకర్ర పొడి
1 టీస్పూన్ గరం మసాలా
1 టీస్పూన్ చాట్ మసాలా
డీప్ ఫ్రై కోసం నూనె
1 కరివేపాకు రెమ్మ
4 పచ్చిమిర్చి చీలికలు
మీల్ మేకర్ 65 తయారీ విధానం:
- ముందుగా రెండు మూడు కప్పుల నీల్లు ఓ పాత్రలో పోసుకుని అందులో ఉప్పు కూడా వేసి వేడి చేయాలి.
- అందులో మీల్ మేకర్ కూడా వేసి ఒక ఉడుకు రానివ్వాలి. తర్వాత స్టవ్ కట్టేసి అదే నీళ్లలో మీల్ మేకర్ ఓ పది నిమిషాల పాటూ నాననివ్వాలి.
- ఇప్పుడు మీల్ మేకర్ నుంచి నీళ్లన్నీ బాగా పిండేసుకుని ఒక బౌల్ లోకి తీసుకోండి.
- మరో బౌల్ తీసుకుని అందులో కార్న్ ఫ్లోర్, మైదా, కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చాట్ మసాలా, ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.
- ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుని అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఈ పిండి మీల్ మేకర్‌కు అంటుకునేలాగా ఉంటే సరిపోతుంది. అన్ని నీళ్లు పోసుకోవచ్చు.
- ఇప్పుడు కడాయి పెట్టుకుని నూనె పోసుకోండి. వేడెక్కాక మీడియం మంట మీద పెట్టుకోండి. మీల్ మేకర్ ను పిండి మిశ్రమంలో ముంచుతూ బజ్జీల్లాగా వేసుకోండి.
- కాస్త రంగు మారి క్రిస్పీగా అయ్యాక తీసేసుకుంటే సరిపోతుంది. వీటికి ఇప్పుడు తాలింపు పెట్టుకుంటే రుచి ఇంకా బాగుంటుంది.
- దాని కోసం అదే నూనెలో కరివేపాకు, పచ్చిమిర్చి చీలికల్ని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. వీటిని వేయించుకున్న మీల్ మేకర్ మీద వేసి సర్వ్ చేయడమే. మీల్ మేకర్ 65 రెడీ అయినట్లే.