Tuesday Motivation: తక్కువగా మాట్లాడడం ఒక సాధన, దీన్ని ప్రతిరోజూ ప్రాక్టీసు చేయండి, జీవితంలో సమస్యలు తక్కువ వస్తాయి
13 August 2024, 5:00 IST
- Tuesday Motivation: కొంతమంది అవసరానికి మించి మాట్లాడుతారు. మరికొంతమంది చాలా సైలెంట్ గా ఉంటారు. అయితే ఎవరైనా తక్కువ మాట్లాడితే మంచిదా లేక ఎక్కువ మాట్లాడితే మంచిదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
మోటివేషనల్ స్టోరీ
Tuesday Motivation: పూర్వం ఒక బడిలో ఒక మంచి పిల్లవాడు ఉండేవాడు. అతను ఎప్పుడూ ఏదో ఒక సందేహాన్ని తన గురువును అడుగుతూ ఉంటాడు. ఓసారి తన గురువు దగ్గరికి వెళ్లి ఎక్కువ మాట్లాడితే మంచిదా? లేక తక్కువ మాట్లాడితే మంచిదా అని అడుగుతాడు.
దానికి ఆ గురువుగారు మాట్లాడుతూ ‘ఎక్కువ మాట్లాడలో తక్కువ మాట్లాడారో నువ్వే నిర్ణయించుకో. అలా నిర్ణయించుకునే ముందు నీవు కప్పలా జీవించాలనుకుంటున్నావో, లేక కోడిలా జీవించాలనుకుంటున్నావో చెప్పు’ అన్నారు. దానికి ఆ విద్యార్థి ప్రశ్నార్థకంగా ముఖం పెట్టాడు. దానికి ఆ గురువు ‘కప్పు కూత ఉదయం నుంచి రాత్రి వరకు వినిపిస్తూనే ఉంటుంది, కానీ కోడి కూత తెల్లారి మాత్రమే వినిపిస్తుంది. దీన్ని బట్టి కప్పలా నిత్యం అరిచినా గౌరవం రాదు. అదే కోడిలా సమయానికి మాత్రమే మాట్లాడితే ఎంతో గౌరవం. కాబట్టి సరైన సమయంలోనే మాట్లాడాలి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ అలా మాట్లాడుతూ ఉండకూడదు’ అని చెప్పారు. ఆ విద్యార్థికి సందేహం తీరింది.
ఎక్కువ మాట్లాడితే అందులో అర్థవంతమైన మాటలు చాలా తక్కువగానే ఉంటాయి. కాబట్టి తక్కువగా, చెప్పాల్సిన దాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పేయడం మంచిది. ఎంత తక్కువగా మాట్లాడితే అంతగా సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అదే పదే పదే ఏదో ఒకటి మాట్లాడే వ్యక్తులు తమకు తెలియకుండానే చిక్కుల్లో కూరుకుపోతారు.
ఒక విషయం గురించి అవగాహన లేనప్పుడు, తప్పులు మాట్లాడుతామేమో అన్న భయం ఉన్నప్పుడు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. అలాగే ఎదుటివారి పెడార్థాలు తీసే అవకాశం ఉన్నప్పుడు కూడా చాలా పరిమితంగా మాట్లాడాలి. కట్టె, కొట్టె, తెచ్చే... పద్దతిలో మాట్లాడి వచ్చేయాలి.
ముఖ్యంగా మాట్లాడే వ్యక్తి కన్నా వినే వ్యక్తితో శక్తి తక్కువగా ఖర్చు అవుతుంది. వినే వాళ్లు కేవలం చెవులకు పని చెబితే చాలు. కానీ మాట్లాడాలంటే మాత్రం ముందుగా ఆ విషయం గురించి నేర్చుకోవాలి. ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదు. తక్కువ మాట్లాడే వ్యక్తులకు ఆలోచించే శక్తి ఎక్కువగా ఉంటుంది. వివేకంతో స్పందిస్తారు. మాట్లాడేటప్పుడు క్లారిటీగా ఉంటారు. తక్కువ మాట్లాడే వారి మాటలకు విలువ ఎక్కువ ఉంటుంది. తక్కువ మాట్లాడేవారి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరింత ఏకాగ్రతతో ఉంటారు. ఇతరులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు. కాబట్టి అవసరమైన సమయంలో మాత్రమే నోరు విప్పండి. అనువుగాని చోట శాంతంగా ఉండడమే మంచిది.