Monsoon Footcare | అడుసు తొక్కనేలా.. కాలు కడగనేలా? వానాకాలంలో పాదాల సంరక్షణ ఇలా!
03 July 2022, 10:19 IST
- వర్షాకాలంలో పైనుంచి కురిసే చినుకులు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.. కానీ కింద నేల బురదగా మారి మీకు చిరాకును కలిగిస్తుంది. అదే సమయంలో మీ పాదాలు చెడిపోవచ్చు, ఇన్ఫెక్షన్లు సోకవచ్చు. కాబట్టి ఈ టిప్స్ పాటించండి.
Foot Care Tips
వర్షాకాలంలో నేలంతా తడిగా మారుతుంది. చిత్తడి నేలల్లో నడవడం ద్వారా పాదాలు చెడిపోవచ్చు. అరికాళ్లలో పగుళ్లు ఏర్పడటం, చర్మ ఊడిపోవడం సాధారణంగా మనం గమనించవచ్చు. అలాగే ఇలా పగిలిన కాళ్లతో నడిస్తే బురద, మురికి నీటిలోని హానికర సూక్ష్మక్రిములు మీ పాదాల పగుళ్ల నుంచి మీ శరీరంలోకి ప్రవేశిస్తాయి. తద్వారా వివిధ రకాల ఇన్ఫెక్షన్లు సోకుతాయి. పాదాలకు ఏవైనా గాయాలు ఉన్నప్పుడు వర్షాకాలంలో బయట తిరిగేటపుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ వర్షాకాలంలో మీ పాదాల సంరక్షణ కోసం కొన్ని మార్గాలను ఇక్కడ తెలియజేస్తున్నాం.
1) గోళ్లను చిన్నగా కత్తిరించుకోండి
వర్షాకాలంలో గోళ్లను ఎల్లప్పుడూ చిన్నగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఆడవారు గోళ్లను పొడవుగా పెంచుకోవటానికి, ఆకర్షణీయమైన నెయిల్ పాలిష్ వేసుకోటానికి ఇష్టపడతారు. పొడవాటి గోర్లు మీ చేతులు, కాళ్ళ అందాన్ని పెంచడానికి చాలా బాగుంటాయి, కానీ వర్షాకాలంలో దీని వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఈ సీజన్‌లో పొడవాటి గోర్లు ఉంచుకోవడం వల అవి మురికిని, బ్యాక్టీరియాను స్టోర్ చేయగలవు. కాబట్టి వీలైనంత చిన్నవిగా కత్తిరించుకుంటే పరిశుభ్రంగా ఉంటాయి.
2) పెడిక్యూర్ ఇంట్లోనే
వర్షాకాలంలో పెడిక్యూర్ చేసుకోవడం కోసం బ్యూటీ పార్లర్లకు వెళ్లడం మానుకోండి. మీకు కావాలంటే వారానికి ఒకసారి ఇంట్లోనే మీకు మీరుగా ప్రయత్నించుకోండి. వర్షాకాలంలో బయట తిరిగేటపుడు చాలామంది బూట్లు ధరిస్తారు. అయితే చాలాసేపు ఇలా ఉండటం వలన కూడా తేమ కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. కాబట్టి ఇంట్లో పెడిక్యూర్ చేసుకోవడం మంచిది. మీ పాదాలకు గాయాలేవైనా ఉంటే ఫిష్ పెడిక్యూర్ చేసుకోకూడదు.
3) ఫంగల్ పౌడర్ ఉపయోగించండి
ఈ సీజన్‌లో పాదాలకు క్రీమ్ రాసుకోవడం ఉత్తమైన చర్య కాదు ఎందుకంటే ఇది తేమను సృష్టిస్తుంది, ఆపై ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. మీరు ఇంట్లో ఉన్నప్పుడు లేదా బయటకు వెళ్లే ముందు, మీ మడమల చుట్టూ, మీ కాలి మధ్య ప్రాంతంలో యాంటీ ఫంగల్ పౌడర్‌ను చల్లండి. ఇది మీ పాదాలను పొడిగా ఉంచుతుంది. బ్యాక్టీరియా వృద్ధిని నివారిస్తుంది.
4) గాయాన్ని మూసేయండి
వర్షాకాలంలో గాయాన్ని తెరిచి ఉంచడం కారణంగా గాయం మరింత తీవ్రతరం అవుతుంది. కాబట్టి గాయాలను పొడిగా ఉంచుకోవాలి. గాయాల కోసం మీకు సూచించిన యాంటీసెప్టిక్, యాంటి ఫంగల్ పౌడర్ వాడాలి. త్వరగా నయం కావడం కోసం మీ వైద్యుడి సలహా తప్పకుండా తీసుకోండి. ముఖ్యంగా వర్షాకాలంలో గాయాలు కాకుండా జాగ్రత్తపడండి.
5) సరైన పాదరక్షలను ఎంచుకోండి
పాదాలకు గాలి తగలకుండా మూసి ఉన్న బూట్లు, చెప్పులు ఇతర పాదరక్షలను ధరించకపోవడం మంచిది. ఈ సీజన్‌లో మీ సౌకర్యాన్ని బట్టి పాదరక్షలను ఎంచుకోండి. ఫ్లోటర్లు, ఫ్లిప్ ఫ్లాప్‌లు, క్రాక్స్ వంటి ప్లాస్టిక్ లేదా రబ్బరు చెప్పులు ధరించడం వర్షాకాలంలో పాదాలకు అనుకూలంగా ఉంటుంది. ఇది మీ పాదాలను పొడిగా ఉంచడమే కాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.