Sunday Motivation | మీ జీవితం చాలా విలువైనది.. మీకు నచ్చినట్లు బతకండి
04 May 2022, 11:04 IST
- జీవితం అనేది చాలా విలువైనది. మన జీవితం పక్కనవాడికి చులకన కావొచ్చు కానీ.. మనకు మాత్రం చాలా విలువైనదే. కాబట్టి మీ జీవితాన్ని ఎవరి కోసమో కాకుండా.. మీ కోసం బతకండి. మీకు నచ్చినట్లు బతికి.. లైఫ్లో సక్సెస్ అవ్వండి.
జీవితం చాలా విలువైనది
Sunday Motivation | మీ జీవితం మీకు చాలా విలువైన బహుమతి. జీవశాస్త్ర పరంగా మీరు ఈ ప్రపంచంలో అడుగుపెట్టడానికి ఎన్నో మిలియన్ల స్పెర్మ్‌లను ఓడించారు. మీరు అర్హులైనందునే ఇప్పుడు ప్రపంచాన్ని చూస్తున్నారు. మీరు పుట్టిన మొదటి రోజు నుంచి.. ఇప్పటివరకు మీరు నేర్చుకున్న అన్ని విషయాలు మిమ్మల్ని ఇప్పుడు ఈ దశకు తీసుకువచ్చాయి. కష్టమో, నష్టమో.. ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని ఇప్పుడు ఈ స్టేజికి వచ్చారు. దానిని అలాగే కొనసాగనివ్వండి. అంతేకానీ వేరే వారి కోసం మీ విలువైన జీవితాన్ని పాడుచేసుకోకండి.
మీ జీవితంలో విలువైన వ్యక్తులను ఇప్పటికే కోల్పోయి ఉండొచ్చు. ఎప్పటికైనా కోల్పోవాల్సిందే. ఈ విషయం గ్రహించి.. ఎలాంటి ఆటు పోట్లు ఎదురైనా.. నిశ్చలంగా నిలబడి, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలి. అంతే కానీ విలువైన జీవితాన్ని మధ్యలోనే ఆపేయాలి అనకూడదు. చాలా మంది మీ వెనుక మీ గురించి అసత్యమైన విషయాలు ప్రసారం చేసి ఉండొచ్చు. అయితే వారు మీ విజయంలో ఏమాత్రం సహాయం అందించరు. మీకు అవసరమైనప్పుడు మీ పక్కన నిలబడే ఏకైక వ్యక్తి మీరు మాత్రమే.
కాబట్టి మిమ్మల్ని మీరు ఎప్పటికీ కోల్పోకండి. ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అనే వాటిని ఆలోచించాల్సిన అవసరం లేదు. దాని ఆధారంగా మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఒకవేళ ఇతరుల కోసం మీరు మారారు అంటే అది చెత్త పనే అవుతుంది. ఇతరులను ప్రేమించడం మంచిపనే. కానీ వారి కోసం మిమ్మల్ని మార్చుకోవడం అస్సలు మంచిది కాదు. కొన్ని రోజులకు మీ మీద మీకే చిరాకు వస్తుంది. అందుకే మీ జీవితాన్ని మీ నిబంధనల ప్రకారం గడపండి.
టాపిక్