Drinks For Weightloss | వేడినే కాదు.. ఈ జ్యూస్లు బరువు కూడా తగ్గిస్తాయి..
06 April 2022, 11:32 IST
- సమ్మర్లో జ్యూస్లు తాగడమనేది చాలా కామన్. కానీ హెల్తీ జ్యూస్లు ఎంతమంది తాగుతున్నారు. పైగా జ్యూస్లు తాగితే బరువు పెరిగిపోతామనే ఓ భయం కూడా ఉంటుంది. కానీ బరువు తగ్గేందుకు, శరీరానికి అవసరమైన పోషకాలు అందించే జ్యూస్లు ఉంటే ఓ పట్టు పట్టాల్సిందే అనిపిస్తుంది. మరి ఆ జ్యూస్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గేందుకు జ్యూస్లు
Healthy Juices | మన రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు తీసుకోవడం చాలా మంచిది. పైగా సమ్మర్లో మరీ మంచిది. తినాలని అనిపించకపోతే.. జ్యూస్ చేసుకుని తాగొచ్చు. పైగా కొన్ని, కూరగాయలు, పండ్లతో తయారు చేసుకునే జ్యూస్లు బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడతాయి. పైగా ఇవి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచి.. బరువు తగ్గడానికి అనుమతిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం చక్కెర పానీయాలను వీటితో భర్తీ చేసేయండి. బరువు తగ్గిపోండి.
1. కాకరకాయ జ్యూస్
కాకరకాయ రసం చేసేటప్పుడు కాకరకాయపై తొక్కను తీయకూడదనే విషయాన్ని గుర్తించాలి. ఎందుకంటే దానిలో గరిష్ట ప్రయోజనాలు ఉంటాయి. పైగా అది పూర్తిగా పోషకాలతో నిండి ఉంటుంది. విత్తనాలు లేతగా ఉంటే.. వాటిని కూడా తీయనవసరం లేదు. ఒకవేళ గింజలు ముదిరి ఉంటే మాత్రం వాటిని తొలగించాలి.
ముందుగా కాకరయకాయను, అల్లం కలిపి మిక్సిజార్లో వేసి మిక్స్ చేయాలి. దానికి కొద్దిగా నీళ్లు వేసి దానిని ఫిల్టర్ చేయాలి. దానిలో నిమ్మరసం, పసుపు, ఉప్పు, తేనె, మిరియాలు వేసి బాగా కలపాలి. అంతే కాకరకాయం రసం రెడీ. ఇది ఆరోగ్యానికి మంచి చేసి... బరువు తగ్గించడమే కాకుండా.. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయం చేస్తుంది.
2. క్యాబేజీ జ్యూస్
క్యాబేజీ రసం.. కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి అనేక కడుపు సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. పైగా జీర్ణ వ్యవస్థను క్లియర్ చేస్తుంది. కడుపులోని వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. దీని వల్ల బరువు తగ్గుతారు. క్యాబేజీ ముక్కలుగా తరిగి... బ్లెండర్లో వేయాలి. నీళ్లు పోసి ప్యూరీగా చేయాలి. ఒక గిన్నెలోకి వడకట్టండి. ఈ రసాన్ని ఫ్రిజ్లో పెట్టుకుని చల్లగా అయ్యాక తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం.. చల్లదనానికి చల్లదనం.
3. పుచ్చకాయ జ్యూస్
పుచ్చకాయ రసంలో కేలరీలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. పుచ్చకాయరసం కోసం గింజలు లేకుండా పుచ్చకాయను కట్ చేసుకోవాలి. వాటిని బ్లెండర్లో వేసి ప్యూరీ చేయాలి. అనంతరం దానిని వడకట్టాలి. రుచి కోసం నిమ్మరసం జోడించవచ్చు. ఈ మూడు జ్యూస్లు కూడా మీకు రిఫ్రెష్ ఇవ్వడమే కాకుండా బరువును అదుపులో ఉంచుతాయి.