Dry Eyes Remedies | కళ్లు పొడిబారి మండుతున్నాయా? ఈ చల్లని ఉపాయాలు చూడండి!
16 June 2023, 11:41 IST
- Dry Eyes Remedies: మీ కళ్లను తడి చేసేంత కన్నీళ్లు ఉత్పత్తి కాకపోతే లేదా అవి చాలా త్వరగా ఆవిరైపోతే కళ్లు పొడిబారతాయి. ఉపశమనం కలిగించే మార్గాలు చూడండి.
Dry Eyes Remedies
Dry Eyes Remedies: ఏ కారణం లేకుండానే కళ్లు మంటగా అనిపిస్తున్నాయా? అయితే మీ కళ్లు పొడిబారి ఉండవచ్చు. కన్నీళ్లు తగినంతగా ఉత్పత్తి కాకపోవడం వల్ల కళ్లు పొడిబారతాయి. మీ కళ్లను తడి చేసేంత కన్నీళ్లు ఉత్పత్తి కాకపోతే లేదా అవి చాలా త్వరగా ఆవిరైపోతే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. కన్నీళ్లు తక్కువగా ఉత్పత్తి కావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. పొడి కళ్ళు సమస్య ఉన్నప్పుడు మీ కళ్లలో ఏదో చేరినట్లు అనిపించడం, కళ్లు మంటగా, లాగుతున్నట్లుగా ఉంటుంది. దీని వల్ల మీకు అసౌకర్యం కలుగుతుంది.
ఎయిర్ కండీషనర్ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉన్నప్పుడు, చాలా సేపు కంప్యూటర్ స్క్రీన్‌ని చూస్తూ ఉన్నప్పుడు, సరైన నిద్రలేనప్పుడు మొదలైన పరిస్థితులలో పొడి కళ్ళ సమస్యను అనుభవించవచ్చు. అయితే, ఇదేమి చాలా తీవ్రమైన సమస్య కాదు, చికిత్స తీసుకుంటే కొన్నిసార్లు సైనస్ ఇన్ఫెక్షన్ వలన, రక్తంలో చక్కెర హెచ్చుతగ్గుల వలన కూడా కళ్లలో ఇన్ఫెక్షన్ పెరిగి కళ్లు పొడిబారినట్లు ఉంటుంది. అలాగే 50 ఏళ్లు పైబడిన ఆడవారిలో, విటమిన్ ఎ లోపం కలిగిన వారిలోనూ కళ్లు పొడిబారడం కనిపిస్తుంది.
కళ్లు పొడిబారినపుడు కనిపించే లక్షణాలు
- కాంతికి సున్నితత్వం ప్రదర్శించడం అంటే కాంతిని చూడలేకపోవడం
- కళ్లు ఎరుపెక్కడం
- కాంటాక్ట్ లెన్సులు ధరించడంలో ఇబ్బంది
- కళ్ళలో మంట, దురద, లాగినటువంటి అనుభూతి
- రాత్రిపూట డ్రైవింగ్ చేయడంలో ఇబ్బంది
- అస్పష్టమైన దృష్టి లేదా కంటి అలసట
పొడిబారిన కళ్లకు ఉపశమనం కలిగించే మార్గాలు
- మీ కళ్ళకు గాలి వీయకుండా జాగ్రత్తపడండి. హెయిర్ డ్రైయర్‌లు, కార్ హీటర్‌లు, ఎయిర్ కండిషనర్లు లేదా ఫ్యాన్‌లను మీ కళ్ల వైపు మళ్లించవద్దు.
- గాలికి తేమ ఉండేలా చూసుకోండి. చల్లని వాతావరణం ఉన్నప్పుడు హ్యూమిడిప్జైయర్ మీ ఇండోర్ గాలికి తేమను అందించవచ్చు.
- కళ్లను పూర్తిగా కప్పి ఉంచే సన్ గ్లాసెస్ లేదా ఇతర రక్షణ కళ్లజోడు ధరించండి.
- చదవడం, స్క్రీన్లు చూడడం లేదా తీక్షణంగా చూస్తూ సుదీర్ఘంగా ఏదైనా పనిచేస్తున్న సమయంలో కంటికి విరామం ఇవ్వండి. కొన్ని నిమిషాలు మీ కళ్ళు మూసుకోండి. లేదా కొన్ని సెకన్ల పాటు పదే పదే రెప్పవేయండి.
- ఎత్తైన ప్రదేశాలలో, ఎడారి ప్రాంతాలలో, విమానాలలో గాలి చాలా పొడిగా ఉంటుంది. అటువంటి వాతావరణంలో సమయాన్ని వెచ్చిస్తున్నప్పుడు, మీ కన్నీళ్ల బాష్పీభవనాన్ని తగ్గించడానికి కొన్ని నిమిషాల పాటు తరచుగా మీ కళ్ళు మూసుకోవడం చేయండి.
- మీ కంప్యూటర్ స్క్రీన్‌ను కంటి స్థాయికి దిగువన ఉంచండి. మీ కంప్యూటర్ స్క్రీన్ కంటి స్థాయికి ఎగువన ఉంటే, మీరు స్క్రీన్‌ను వీక్షించడానికి మీ కళ్ళు వెడల్పుగా తెరుస్తారు. కాబట్టి మీ కంప్యూటర్ స్క్రీన్‌ను కంటి స్థాయికి దిగువన ఉంచండి.
- ధూమపానం మానేయండి, పొగను నివారించండి. మీరు ధూమపానం చేయకపోతే, అలా చేసే వ్యక్తులకు దూరంగా ఉండండి. పొగ పొడి కళ్ళ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.
- మీ కళ్ళపై వెచ్చని కంప్రెస్ ఉంచండి, తగినంత నిద్రపోండి.
- కృత్రిమ కన్నీళ్లను క్రమం తప్పకుండా ఉపయోగించండి. మీకు దీర్ఘకాలిక పొడి కళ్ళు ఉన్నట్లయితే, మీ కళ్ళు బాగా లూబ్రికేట్‌గా ఉంచడానికి కంటి చుక్కలను ఉపయోగించండి.
మీ కళ్ళలో మంట తగ్గకుండా దీర్ఘకాలికంగా కొనసాగితే వెంటనే కంటి వైద్య నిపుణులను సంప్రదించండి.