Sprouts Dosa: మొలకల దోశ రెసిపీ, బరువు తగ్గేందుకు సరైన బ్రేక్ ఫాస్ట్
28 January 2024, 6:00 IST
- Sprouts Dosa: బరువు తగ్గేందుకు ఎక్కువ మంది మొలకలను తింటూ ఉంటారు. వాటి రుచి నచ్చకపోతే మొలకల దోశలు తిని చూడండి. ఇవి టేస్టీగా ఉంటాయి. పైగా ఆరోగ్యాన్ని అందిస్తాయి.
మొలకల దోశె రెసిపీ
Sprouts Dosa: బరువు తగ్గేందుకు ఎక్కువమంది ప్రతి ఉదయం మొలకలు తింటూ ఉంటారు. ఈ మొలకలు తినడం నచ్చకపోతే మొలకల దోశ ప్రతిరోజూ తినడానికి ప్రయత్నించండి. మొలకల దోశ తినడం వల్ల విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా అందుతాయి. అలాగే ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటివి కూడా శరీరానికి చేరుతాయి. ఈ మొలకలలో ఫోలేట్, ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. కాబట్టి మొలకల దోశ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
మొలకలు దోశకు కావలసిన రెసిపీకి కావాల్సిన పదార్థాలు
పొట్టు తీయని పెసరపప్పు - ఒక కప్పు
అల్లం - చిన్న ముక్క
పచ్చిమిర్చి - మూడు
జీలకర్ర - ఒక స్పూను
నీరు - తగినంత
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - ఒక కట్ట
మొలకల దోశ రెసిపీ
1.ముందు రోజు రాత్రి పొట్టు తీయని పెసరపప్పును నానబెట్టుకోవాలి. అవి మొలకలు వచ్చే వరకు ఉంచాలి.
2. మొలకలు రావడానికి తడిగుడ్డలో కడితే త్వరగా మొలకలు వచ్చే అవకాశం ఉంది.
3. ఉదయం లేచాక మొలకెత్తిన పెసళ్లను మిక్సీ జార్ లో వేసి మెత్తగా చేసుకోవాలి.
4. అందులోనే కొత్తిమీర తరుగు, అల్లం తరుగు, పచ్చిమిర్చి, జీలకర్ర, కాస్త నీరు వేసి మళ్లీ మిక్సీ పట్టాలి.
5. ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును వేయాలి.
6. స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేయాలి.
7. నూనె వేడెక్కాక దోశెల్లా పోసుకోవాలి.
8. పైన ఉల్లి తరుగును చల్లుకోవాలి.
9. రెండు వైపులా దోశెను కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
10. దీన్ని కొబ్బరి చట్నీతో తింటే టేస్టీగా ఉంటుంది
స్ప్రౌట్స్ లేదా మొలకలతో చేసే దోశ తినడం వల్ల బరువు పెరగరు. పైగా రోజంతా శక్తి అందుతుంది. ఈ గింజల్లో ఉన్న పోషకాలు శరీరానికి అంది రక్తప్రసరణ సవ్యంగా జరుగుతుంది. పోషకాలు, ఆక్సిజన్ అన్ని అవయవాలకు చేరుతాయి. మొలకల దోశను కనీసం వారంలో మూడు సార్లు తినేందుకు ప్రయత్నించండి. ఇది ఎన్నో రకాలుగా మనకి సాయం చేస్తుంది.
టాపిక్