తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Personal Belongings | వీటిని ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు, మీకు చాలా డేంజర్!

Personal Belongings | వీటిని ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు, మీకు చాలా డేంజర్!

HT Telugu Desk HT Telugu

23 July 2023, 7:30 IST

google News
    • Personal Hygiene Tips: వర్షాకాలంలో ఆరోగ్యకరమైన జీవితం కోసం మీరు ఎవరితోనూ పంచుకోకూడని కొన్ని వ్యక్తిగత వస్తువుల జాబితాను అవేమిటో చూడండి.
Personal Hygiene
Personal Hygiene (istock)

Personal Hygiene

Personal Hygiene Tips: మీకు సంబంధించినవి కొన్నింటిని ఇతరులతో పంచుకోకూడదు. ముఖ్యంగా మీరు వ్యక్తిగతంగా ఉపయోగించే వస్తువులు ఇతరులు ఉపయోగించడం ద్వారా మీరు అనారోగ్యాల బారినపడవచ్చు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో గ్యాస్ట్రోఇంటెస్టినల్ వ్యాధులు, దగ్గు, జలుబు, చర్మ అలెర్జీలు, కంటి అలర్జీలు పెరుగుతున్నందున వ్యక్తిగత పరిశుభ్రతలో, పరిసరాల పరిశుభ్రతలో చాలా జాగ్రత్తలు వహించాలి.

మీకు సంబంధించిన వస్తువులను ఇతరులు ఉపయోగించినా లేదా మీ వస్తువులను ఇతరులు ఉపయోగించినా, అనేక రకాల ఇన్ఫెక్షన్లను కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. సాధారణంగా హాస్టల్ లో ఉండేవారు, బ్యాచిలర్స్ గా స్నేహితులతో కలిసి ఒక చోట కలిసి ఉండేవారు ఒకరి వస్తువులను ఒకరు వాడుకోవడం, ఒకరి దుస్తులను మరొకరు వేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి తప్పులే చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కొన్ని అంటువ్యాధులు తుమ్ములు లేదా దగ్గు ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఇతరుల వ్యక్తిగత వస్తువులను ఉపయోగిస్తున్నప్పుడు కూడా అనేక అంటువ్యాధులు సంక్రమించవచ్చు. E.coli, సాల్మోనెల్లా, షిగెల్లా బ్యాక్టీరియా లేదా నోరోవైరస్, రోటవైరస్, స్టాఫ్ వంటి వైరస్‌లు కలిగించే అనేక రకాల ఇన్ఫెక్షన్లు ఇతరుల బాత్రూమ్ వస్తువులు వాడటం వలన సంక్రమిస్తాయి. ఈ వర్షాకాలంలో మీరు స్నానానికి ఉపయోగించే సబ్బులను మీ కుటుంబ సభ్యులతో కూడా పంచుకోవద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఒక అధ్యయనం ప్రకారం, ఒక సబ్బును ఒకరు ఉపయోగిస్తే అది దాదాపు 62 శాతం కలుషితం అవుతుంది.

ది ఎస్తెటిక్ క్లినిక్స్ లో కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అయిన డాక్టర్ రింకీ కపూర్, HT డిజిటల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోగ్యకరమైన జీవితం కోసం మీరు ఎవరితోనూ పంచుకోకూడని కొన్ని వ్యక్తిగత వస్తువుల జాబితాను పంచుకున్నారు. అవేమిటో చూడండి.

తువ్వాలు

మీరు మీ టవల్‌ను ఎవరితోనైనా పంచుకుంటే, పెద్ద తప్పు చేస్తున్నారు అని తెలుసుకోండి. ఒక టవల్‌ని ఉపయోగించినప్పుడు, చీకటి గదులలో వేలాడదీయడం వల్ల అది తడిగా, వెచ్చగా మారుతుందని తెలిసిన విషయమే. దానిపై ఎన్నో క్రిములు వృద్ధి చెందుతాయి. అలాంటి తువ్వాలును ఎవరైనా ఉపయోగించినప్పుడు, అది ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.

సబ్బు

చర్మంపై మురికిని మనం సబ్బుతో రుద్ది వదిలించుకుంటాం. ఈ క్రమంలో మీ చర్మంపై ఉండే కొంత మురికి, బ్యాక్టీరియా సబ్బుపైకి బదిలీ అవుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉంచిన లేదా ఇతరులు ఉపయోగించే సబ్బులను ఉపయోగించడం మానుకోండి. అలాగే, ఇతరులు ఉపయోగించే స్నానపు స్పాంజ్‌లు లేదా లూఫాలకు దూరంగా ఉండండి. ఈ వస్తువులపై చాలా సూక్ష్మక్రిములు పెరుగుతాయి.

టూత్ బ్రష్

ఒకరి టూత్ బ్రష్ ను సాధారణంగా ఎవరూ ఉపయోగించరు కానీ కొందరు ఉంటారు. వేరొకరు ఉపయోగించిన టూత్ బ్రష్ పై మురుగు నీటిలో పెరిగే E.coli, స్టాఫ్‌ మొదలైన బ్యాక్టీరియాలు తిష్ట వేస్తాయి. ఒకరికొకరు టూత్ బ్రష్‌లను ఉపయోగించుకునే వారికి దంతక్షయం వంటి దంత సమస్యలకు దారితీసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా, గొంతు ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి.

దువ్వెన

మీకు చుండ్రు, జుట్టు రాలడం లేదా పేను వంటి అనేక జుట్టు సమస్యలు ఉంటే, దువ్వెనను ఇతరులతో పంచుకునేటప్పుడు లేదా వేరొకరి దువ్వెనను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇలా చేయడం వల్ల స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్, స్కేబీస్‌ వంటి సమస్యలను పొందడానికి ఆస్కారం ఉంది.

ఫ్లిప్-ఫ్లాప్స్

చెప్పులను బాత్‌రూమ్‌లో ఉపయోగించడం వల్ల ఇన్‌ఫెక్షన్లు వ్యాపించే మార్గం సులభం కావచ్చు. పాదరక్షలు తడిగా ఉండి, ఇతరులు ఉపయోగిస్తే, వాటిని పంచుకోవడం ద్వారా అథ్లెట్స్ ఫుట్, దద్దుర్లు వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్‌లను సంక్రమించే అవకాశం ఉంది.

లిప్ బామ్

ఇతరులతో లిప్ బామ్ పంచుకోవడం ద్వారా నోటి హెర్పెస్ సంక్రమించవచ్చు.

ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి మీరు క్షేమంగా ఉండాలంటే మీరు వ్యక్తిగతంగా ఉపయోగించే వస్తువులు మీకు మాత్రమే స్వంతంగా ఉండనివ్వండి, వాటిని జాతీయం చేయకండి.

తదుపరి వ్యాసం