Saturday Motivation: అద్దం చెప్పే జీవిత సత్యాలు ఇవి, ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిందే
06 April 2024, 5:00 IST
- Saturday Motivation: ప్రతి ఇంట్లోనూ అద్దం ఉంటుంది. అద్దం చెప్పకనే మనకు ఎన్నో సత్యాలను చెబుతుంది. ప్రతి ఒక్కరూ వాటిని పాటించాల్సిందే. అద్దం చెప్పే జీవిత సత్యాలు ఏంటో తెలుసుకోండి.
మోటివేషనల్ స్టోరీ
Saturday Motivation: ఒక గ్రామంలో ఓ ముసలాయన ఉండేవాడు. అతను తన ఇంటి ముందు కూర్చుని ప్రతిరోజూ అద్దాన్ని తుడుస్తూ కనిపించేవాడు. ఒక యువకుడు అతడిని చూశాడు. ప్రతిరోజు అద్దం తుడవడం కనిపించేది. వెంటనే తాత దగ్గరికి వెళ్లి ‘నేను వారం రోజులుగా మిమ్మల్ని చూస్తున్నాను. ప్రతిరోజూ అద్దం తుడుస్తూ కనిపిస్తారు. ఏముంటుంది అద్దంలో అంత ప్రత్యేకత’ అన్నాడు. దానికి ఆ ముసలాయన దానికి ‘అద్దం మనకు ఎన్నో జీవిత సత్యాలను చెబుతుంది. ఆ జీవిత సత్యాలు అందరికీ అర్థం కాదు. అద్దం మన జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది’ అని అన్నాడు. దానికి యువకుడు అర్థం చెప్పే జీవిత సత్యాలు ఏంటో చెప్పమని అడిగాడు.
ఉన్నది ఉన్నట్టు
దానికి ఆ తాత ‘అద్దంలో నువ్వు చూస్తే నువ్వు మాత్రమే కనిపిస్తావు. అదే నేను చూస్తే నన్ను మాత్రమే చూపిస్తుంది. అంటే ఉన్నది ఉన్నట్టుగా చూపించడమే అద్దం ప్రత్యేకత. నీ ముఖం పైన మరక ఉంటే ఆ మరకను కూడా ఉన్నది ఉన్నట్టే చూపిస్తుంది. ఆ మరకను ఎక్కువగానో తక్కువగానో చేసి చూపించదు. అలాగే ప్రతి ఒక్కరూ ఉన్నది ఉన్నట్టే మాట్లాడుకోవాలి. ఉన్న విషయాన్ని ఎక్కువ చేసి లేదా తక్కువ చేసి మాట్లాడుకోకూడదు. ఇదే మనకి అర్థం చెప్పే మొదటి పాఠం’ అన్నాడు.
‘అద్దం ముందు నువ్వు నిలిచి ఉంటే నువ్వు మాత్రమే కనిపిస్తావు. నువ్వు వెనుక వైపుగా నిలుచుంటే నీ వీపు మాత్రమే కనిపిస్తుంది. నువ్వు ముందువైపు నిలుచుంటే వెనుక వైపు చూపించే లక్షణం అద్దానిది కాదు. అలాగే మనుషులు ఎవరైనా, ఎవరి గురించైనా వారి ఎదుటే మాట్లాడాలి తప్ప... వారి వెనుక మాట్లాడకూడదు. ఇది అర్థం చెప్పే రెండో పాఠం’ అని చెప్పారు ఆ ముసలాయన.
‘మన ముఖం పై ఉన్న మరకలు అద్దంలో చూస్తే స్పష్టంగా కనిపిస్తాయి. అద్దం మీ మరకలను చూపించింది కదా అని దాన్ని పగలగొట్టరు కదా? అలాగే మన లోపాల్ని ఎవరైనా చెప్పినా కూడా వాటిని స్వీకరించాలి. సరి చేసుకోవాలి తప్ప కోపం తెచ్చుకొని వారితో గొడవలు పడకూడదు’ అని చెప్పాడు ఆ ముసలాయన.
ఆ ముసలాయన చెప్పిన విషయాలు విని ఆ యువకుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. ‘ప్రతిరోజు నేను అద్దంలో నా ముఖాన్ని చూసుకుంటాను కానీ అర్థం ఇన్ని విషయాలు మనకు నేర్పుతుందని మాత్రం అర్థం చేసుకోలేకపోయాను. మీ వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అద్దం చెప్పే జీవిత పాఠాలను ఆచరణలో పెట్టాలని కోరుకుంటున్నాను’ అంటూ అక్కడ నుంచి నిష్క్రమించాడు.
ఆ యువకుడే కాదు.. ఎవరైనా కూడా జీవితంలో అద్దం చూపేంత స్పష్టంగా ఉండాలి. వెనుకో మాట ముందో మాట మాట్లాడకూడదు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనిపించకూడదు. మీలో ఉన్న లోపాలను చెబితే వెంటనే కోపగించుకోవడం, వారితో గొడవలు పడడం చేస్తే ఎలాంటి లాభం ఉండదు. అద్దంలో మీ ముఖంపై ఉన్న మరకలు చూసి ఎలా సరి చేసుకుంటారో... ఎదుటివారు చెప్పిన విషయాల్లోని సారాన్ని గ్రహించి అలాగే మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి.