తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saturday Motivation: ప్రతి పనిలో నిజాయితీగా ఉండడం చాలా అవసరం, ఒక్కోసారి అది మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది

Saturday Motivation: ప్రతి పనిలో నిజాయితీగా ఉండడం చాలా అవసరం, ఒక్కోసారి అది మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది

Haritha Chappa HT Telugu

24 February 2024, 5:00 IST

google News
    • Saturday Motivation: పని పెద్దదైనా, చిన్నదైనా నిజాయితీగా పని చేయాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు నిజాయితీగా ఉండకపోతే మిమ్మల్ని మీరే మోసం చేసుకునే పరిస్థితులు ఎదురవుతాయి. అందుకు ఈ వడ్రంగి కథే ఉదాహరణ.
మోటివేషన్ స్టోరీ
మోటివేషన్ స్టోరీ (pixabay)

మోటివేషన్ స్టోరీ

Saturday Motivation: రామాపురం అనే గ్రామంలో ఒక వడ్రంగి ఉండేవాడు. అతను తనకు ఊహ తెలిసినప్పటి నుంచి వడ్రంగి పని మాత్రమే చేసేవాడు. ఒక కాంట్రాక్టర్ దగ్గర తన జీవితమంతా పనిచేశాడు. అరవై ఏళ్లు రావడంతో ఇక ఉద్యోగ విరమణకు సిద్ధమయ్యాడు. అతను తన భార్య, కుటుంబంతో సంతోషంగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని తన కాంట్రాక్టర్‌కు చెప్పాడు. కాంట్రాక్టర్ ఆ విషయం విని చాలా బాధపడ్డాడు. ఇన్నేళ్లు తన దగ్గర పని చేసిన వ్యక్తి ఇక పనికిరాలేనని చెప్పడం ఆయనకి బాధ కలిగించింది. కానీ వడ్రంగి వయసులో దృష్టిలో ఉంచుకొని ఆయన చెప్పిందానికి అంగీకరించాడు.

ఇక చివరిగా ఒకే ఒక ఇంటి నిర్మాణాన్ని చేపట్టాలని కోరాడు కాంట్రాక్టర్. దానికి వడ్రంగి కూడా ఒప్పుకున్నాడు. కాంట్రాక్టర్ ఇల్లు కట్టాక... వడ్రంగి పనిని అతనికి అప్పగించాడు. ఎప్పటిలా వడ్రంగి నమ్మకంగా, నాణ్యతగా పనిచేయలేదు. చాలా నాసిరకం కలపను ఉపయోగించాడు. వాటితోనే ఇంట్లోని వస్తువులను తయారు చేశాడు. చాలా తక్కువ డబ్బులకే ఆ ఇంటి పని పూర్తి చేశాడు. ఇంటిపని పూర్తయ్యాక కాంట్రాక్టర్‌కు చెప్పాడు.

కాంట్రాక్టర్ ఇల్లంతా ఒకసారి తిరిగి చూశాడు. తర్వాత వడ్రంగి ముందుకు వచ్చి నిలిచున్నాడు. ఇంటి తాళం చెవి వడ్రంగి చేతిలో పెట్టి.. ‘ఇది నీ ఇల్లు. నీకు ఇది నేను ఇచ్చే ప్రత్యేకమైన బహుమతి. ఇన్నాళ్లు నువ్వు నా దగ్గర నమ్మకంగా పనిచేశావు. ఆ నమ్మకానికి నేను ఏది ఇచ్చినా తక్కువే. అందుకే నీ చివరి రోజుల్లో ప్రశాంతంగా జీవించేందుకు ఈ ఇంటిని ఇస్తున్నాను’ అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ విషయం విని వడ్రంగి పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. కాంట్రాక్టర్ తన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నా కూడా తాను చివరి ఇంటిని నాసిరకంగా కట్టడం ఆయనకు చాలా అవమానంగా అనిపించింది. ముఖ్యంగా తన ఇల్లే తాను ఇలా నాసిరకంగా కట్టానని అర్థం చేసుకొని ఎంతో బాధపడ్డాడు. కాంట్రాక్టర్ నిజాయితీగా ఉన్నా కూడా తాను మాత్రం నిజాయితీని కోల్పోయినందుకు ఎంతో బాధపడ్డాడు. నాసిరకంగా నిర్మించిన ఆ ఇంట్లోనే నివసించాడు. ఇదే తనకు తగిన శిక్షగా భావించాడు.

ఈ కథ నుంచి మనం కూడా తెలుసుకోవలసిన నీతి ఉంది. ప్రతి పనిలో నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా లేకపోతే అది తిరిగి మనకే బాధను మిగిల్చే అవకాశం ఉంది. ఈ వడ్రంగి కూడా తన కోసం ఆ ఇల్లు అని తెలియక... నాసిరకంతో ఇంటి పనిని ముగించాడు. చివరికి ఆ నాసిరకం ఇంటిలోనే నివసించాల్సి వచ్చింది. కాబట్టి నైతికత ప్రతి మనిషికి ముఖ్యం. అది లేకపోతే ఎప్పుడో ఒకసారి ఈ వడ్రంగిలా మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు.

టాపిక్

తదుపరి వ్యాసం