తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saturday Motivation: కోపంలో నోరు జారకండి, ఏ నిర్ణయాలు తీసుకోకండి, ఓపిక పడితే కోపం మంచులా కరిగిపోతుంది

Saturday Motivation: కోపంలో నోరు జారకండి, ఏ నిర్ణయాలు తీసుకోకండి, ఓపిక పడితే కోపం మంచులా కరిగిపోతుంది

Haritha Chappa HT Telugu

09 March 2024, 5:00 IST

google News
    • Saturday Motivation: కోపం... ప్రతి వినాశనానికి కారణం. ప్రపంచంలో జరిగిన యుద్ధాలన్నీ ఏదో ఒక వ్యక్తి కోపం నుంచి పుట్టినవే. కోపంలో నిర్ణయాలు తీసుకునే బదులు కాస్త సమయం ఇస్తే... ఆ కోపమే చల్లారిపోతుంది.
మోటివేషనల్ స్టోరీ
మోటివేషనల్ స్టోరీ (pixabay)

మోటివేషనల్ స్టోరీ

Saturday Motivation: సిద్ధార్థుడు రాజ్యాన్ని విడిచిపెట్టి గౌతమ బుద్ధుడిగా మారాడు. ఓ చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాడు. ధ్యానం ముగించే సమయానికి అతనికి దాహంగా అనిపించింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఒక శిష్యుడు కనిపించాడు. ఆ శిష్యుడిని పిలిచి పక్కనున్న చెరువులో నుంచి నీళ్లు తీసుకురావాలని కోరాడు. శిష్యుడు చిన్న కలశం పట్టుకుని చెరువు వైపు నడిచాడు. అతను చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని అడవి జంతువులు నీళ్లు తాగుతూ ఉన్నాయి. సరస్సు బురదగా అనిపించింది. వెంటనే బుద్ధుడి వద్దకు వచ్చాడు. క్షమించమని అడిగాడు. నీరు తేలేకపోయానని, నీరు బురదగా ఉందని, జంతువులు నీళ్లు తాగుతున్నాయని చెప్పాడు. బుద్ధుడు మరోసారి చెరువు దగ్గరకు వెళ్ళమని ఆదేశించాడు.

రెండోసారి చెరువు దగ్గరకు వెళ్లిన శిష్యుడు తిరిగి ఉత్త చేతులతోనే గౌతమ బుద్ధుడు దగ్గరికి వచ్చాడు. ఈసారి కూడా నీరు బురదగానే ఉందని, అందుకే తేలేదని చెప్పాడు. కాసేపు ఆగిన బుద్ధుడు మళ్ళీ వెళ్లి నీళ్లు తెమ్మని చెప్పాడు. ఈసారి మాత్రం మీరు స్పటికంలా మిలమిలలాడుతోంది. శిష్యుడు వెంటనే ఆ నీటిని తీసుకొచ్చి బుద్ధుడికి ఇచ్చాడు.

శిష్యుడు తెచ్చిన నీటిని తాగాడు బుద్ధుడు. వెంటనే శిష్యుడు ‘నేను రెండుసార్లు వెళ్ళినప్పుడు నీళ్లు బురదగానే అనిపించాయి... మూడోసారి మాత్రం స్పటికంలా తేలియాడుతూ ఉన్నాయి. అదెలా జరిగింది’ బుద్ధుడిని అడిగాడు.

వెంటనే బుద్ధుడు ‘దేనికైనా సమయం పడుతుంది. జంతువులు నీళ్లు తాగుతున్న సంగతి నువ్వు చూసావు. జంతువులు ఇటూ అటూ నడిచి ఆ నీటిని బురదగా చేశాయి. కాస్త సమయం నీవు అక్కడే నిలుచుని ఓపికగా ఉంటే సరిపోయేది. ఇలా రెండు మూడు సార్లు తిరిగే బదులు అక్కడే నిలిచి ఉంటే కాసేపటికి జంతువులన్నీ వెళ్ళిపోయేవి. మరి కాసేపటికి నీళ్లు తేటగా మారేవి. బురదంతా చెరువు అడుగుభాగానికి వెళ్ళిపోయేది. ఆ సమయాన్ని నువ్వు ఇవ్వలేకపోయావు. అందుకే ఎన్నిసార్లు తిరగాల్సి వచ్చింది’ అని వివరించాడు.

తన శిష్యులందరినీ పిలిచాడు గౌతమ బుద్ధుడు. ఓపిక, సహనం ఎంత ఎక్కువగా ఉంటే జీవితంలో అంత ప్రశాంతంగా ఉంటారని వివరించాడు. కోపం వచ్చినప్పుడు కాస్త ఓపికగా ఉంటే ఆ సమస్య పరిష్కారం అయిపోతుందని, కొన్ని క్షణాల పాటు కోపాన్ని నియంత్రించుకోలేకపోవడమే ప్రపంచంలోని ఎన్నో వినాశనాలకు కారణమయ్యాయి అని చెప్పాడు.

మనిషికి ఉండే షడ్గుణాలలో కోపం కూడా ఒకటి. మన మనసుకు నచ్చనిది జరిగిన వెంటనే ఈ కోపం వచ్చేస్తుంది. కోపం ఉద్రేకంగా మారిపోతుంది. పురాతన కాలం నుంచి కోపం కారణంగా ఎంతో మంది ఇబ్బంది పడ్డారు... ఎంతో మంది చెడ్డ పేరును తెచ్చుకున్నారు. కోపం వచ్చినప్పుడు ఆవేశానికి లోను కాకుండా, కాసేపు మీ మనసుకు సమయాన్ని ఇవ్వండి చాలు, అది శాంత పడిపోతుంది. కోపం చల్లారిపోతుంది. ఎలాంటి వినాశనాలు జరగవు.

ప్రతి మనిషికి కోపం ఉంటుంది. అది సహజ ఉద్వేగం... అలా అని వదిలేస్తే వీలు కాదు. మన చుట్టూ ఉన్న పరిస్థితులకు తగ్గట్టు ఆ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలంటే సహనం, ఓపిక కావాలి. అలాగే కోపం వచ్చినప్పుడు ఆ ఓపిక, సహనంతోనే నోరు జారకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. కోపం పై అదుపు సాధిస్తే జీవితంలో మీరు ఏదైనా సాధించగలరు. ఎవరితోనూ మీకు విరోధం ఏర్పడదు. ప్రశాంతంగా జీవించే అదృష్టం మీకు దక్కుతుంది.

కోపాన్ని జయించిన వాడు ఈ ప్రపంచాన్నే జయించినట్టు. కోపం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో నష్టాలు వస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఎదుటివారిపై కోపాన్ని ప్రదర్శిస్తే మీకు ప్రశాంతంగా అనిపించవచ్చు. కానీ ఎదుటివారికి ఎంతో బాధను కలిగిస్తుంది. అదే పనిగా కోప్పడడం వల్ల మీ ఆరోగ్యం చెడిపోతుంది. ఎక్కువగా కోప్పడే వారికి తలనొప్పి వస్తుంది. అలాగే రక్తపోటు పెరిగిపోతుంది. శ్వాస వేగం పెరుగుతుంది. ఇవన్నీ మంచివి కాదు. అలాగే కోపం అధికంగా వచ్చే వారిలో మానసిక సమస్యలు త్వరగా వస్తాయి. యాంగ్జయిటీ, డిప్రెషన్ వంటివి వారికి ఎప్పుడైనా వచ్చి అవకాశం ఉంది. కాబట్టి కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలో తెలుసుకోండి.

తదుపరి వ్యాసం