Sagittarius Horoscope | ధనూ రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందో..
01 April 2022, 16:36 IST
- ధనూ రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం నందు ఎలా ఉండబోతుంది. కొత్త సంవత్సరంలో ఈ రాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వారి ఆర్థికపరిస్థితి, ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా ధనూ రాశి గురించి తెలుసుకుందాం.
ధనూ రాశి ఫలితములు
Ugadi Panchangam | మూల - 1,2,3,4 పాదములు, పూ.షాడ - 1, 2, 3, 4 పాదములు, ఉ.షాడ - 1 పాదము
* ఆదాయం - 2
* వ్యయం - 8
* రాజ్యపూజ్యం - 6
* అవమానం - 1
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం నందు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా ఈ సంవత్సరం బృహస్పతి 4వ స్థానమునందు సంచరించుట, శని 3వ స్థానము, వక్రియై 2వ స్థానమునందు సంచరించుట, రాహువు 5వ స్థానమందు సంచరించుట, కేతువు 11వ స్థానమునందు సంచరించుటచేత ధనూ రాశి వారికి ఈ సంవత్సరం మిక్కిలి శుభఫలితములు ఉన్నవి. ధనూ రాశి వారికి రాహువు కేతువు ప్రభావం చేత ఈ సంవత్సరం ఉద్యోగములో అభివద్ధి, ధనలాభము, కుటుంబ సౌఖ్యము కలుగును. 5వ ఇంట రాహువు ప్రభావముచేత అనుకున్న ప్రతి పని పూర్తి చేసి విజయములు సాధించెదరు.
ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య సమయంలో శని వక్రియై 2వ స్థానమునందు సంచరించుటచేత కుటుంబపరంగా, ఉద్యోగ, వ్యాపారపరంగా కొన్ని సమస్యలు ఉండును. బృహస్పతి 4వ స్థానములో సంచరించుట భేదాభిప్రాయములు, 4వ స్థానమందు బృహస్పతి ప్రభావం చేత ధనూ రాశివారికి ఈ సంవత్సరం ఆరోగ్యము, కుటుంబవిషయములందు మధ్యస్థ ఫలితముగా ఉండును. ఈ సంవత్సరం ధనూ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారములయందు శుభ ఫలితములు. సంవత్సరం ప్రథమార్థంలో శని వక్రియై తిరిగి ఏలిననాటి శని సంచారము జరుగుటచేత ఆర్థిక, కుటుంబపరంగా కొన్ని సమస్యలు ఏర్పడును.
ధనూరాశి వారికి ఏప్రిల్ 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు మధ్యస్థ ఫలితములు. జనవరి 2023 నుంచి ఏప్రిల్ 2023 మధ్య మిక్కిలి శుభ ఫలితములు కలుగును. ఈ సంవత్సరం ఆదాయం ఉన్నప్పటికి వ్యయం అధికంగా ఉండును. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయవలెను. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితములు కలుగును. ఉద్యోగస్తులకు అనుకూల ఫలితములు. విద్యార్థులు మధ్యస్థ సమయం. స్త్రీలకు మధ్యస్థం నుంచి అనుకూల సమయం. ఆరోగ్యం విషయంలో ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు మధ్యస్థంగా ఉంటుంది. రైతులు, సినీరంగం వారికి కలిసి వచ్చును. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ధనూ రాశివారు మరింత శుభఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే ఆదివారం నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం, శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవాలి. దశరథ ప్రోక్త శని స్తోత్రము పఠించాలి. గురు దక్షిణామూర్తిని గురువారం ఆరాధించాలి.
మాసవారి ఫలితములు
ఏప్రిల్ - ఈ మాసం మీకు మధ్యస్థం నుంచి చెడు ఫలితాలు ఉన్నాయి. గృహమునందు శాంతి లేకపోవడం, ఋణబాధలు పెరగడం, ఒత్తిళ్లు అధికమవ్వడం, మిత్రులు, బంధువుల తోటి భేదాభిప్రాయాలు ఏర్పడటం, భార్య, సంతానంతో గొడవలు పడడం వంటి సమస్యలు అధికంగా ఉన్నాయి.
మే - ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. ధనం అధికముగా ఖర్చుగును. సంతానమునకు అనారోగ్యము, అధికారుల నుంచి ప్రతికూలతలు. విందు వినోదయాత్రలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలయందు అభివృద్ధి కలుగును.
జూన్ - ఈ మాసం మీకు కలిసి వచ్చును. చేయు పనుల యందు మంచి ఫలితములు ఉండును. వస్త్ర వస్తు, ధన, ధాన్య లాభములు, శత్రువులను జయించెదరు. సంఘంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగును.
జూలై - ఈ మాసంలో మీకు అనుకూలంగా లేదు. ధన నష్టము, పెద్దలు, బంధువులతో గొడవలు, వృధా ప్రయాసలు, వ్యర్థ ప్రయాణాలుండును. సంతానంతో విరోధము. మానసిక ఆందోళన. అప్పు చేయవలిసి వస్తుంది. ఖర్చులు అధికమగును.
ఆగస్టు - ఈ మాసంలో మీకు అనుకూలంగా లేదు. మిత్రులతో గొడవలు, దుఖ వార్త మనస్తాపము కలిగిస్తుంది. పుత్రుల కారణంగా అర్థలాభము. చేయు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలయందు వృద్ధి.
సెప్టెంబర్ - ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. బంధు వియోగము, పెద్దలతో గొడవలు, మానసిక ఆందోళన, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి. సంసార సుఖము, ఆర్థిక లాభములు కలుగును.
అక్టోబర్ - ఈ మాసం మీకు కొంత ఊరట కలిగించేటువంటి మాసం. బంధుమిత్రులతో కలిసి ఉంటారు. ఆర్థిక లాభములు ఉండును. చేయు పనులు పూర్తియగును. నూతన, వస్తు, వస్త్ర, ధన, ధాన్య లాభములు కలుగును.
నవంబర్ - ఈ మాసం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. సంసార, సంతాన కారణంగా శుభములు. మిత్రుల నుంచి సహకారములు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులయందు వృద్ధి కలుగును.
డిసెంబర్ - ఈ మాసంలో మీకు మధ్యస్థ ఫలితములు ఉన్నాయి. శత్రుబాధలు, మానసిక ఆందోళన, కుటుంబమునందు సౌఖ్యముండదు. ఈ మాసమంతా అధికముగా ధనము ఖర్చగును.
జనవరి - ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. నూతన వస్తు సేకరణ, ద్రవ్య లాభము, మనోఉల్లాసము, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులయందు శుభ ఫలితములు కులుగును.
ఫిబ్రవరి - ఈ మాసం మీకు కలసి రాదు. బంధుమిత్రులతో గొడవలు, శత్రు జయము. నూతన వస్తు, వస్త్ర, ధన, ధాన్య లాభములు, అవమానములు, ఆర్థిక లాభము కలుగును.
మార్చి - ఈ మాసం మీకు అన్ని విధాల అనుకూలంగా ఉన్నది. శారీరక, మానసిక ఉల్లాసము, బంధుమిత్రుల రాకతో సంతోషము, పుత్రుల కారణంగా లాభము, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల యందు అభివృద్ధి. ద్రవ్య మోసం జాగ్రత్త వహించవలెను