Friday Motivation: మీ జీవితంలో ఇతరులు విసిరే రాళ్లను మీ ఎదుగుదలకు పునాదులుగా వాడుకోండి
21 June 2024, 5:00 IST
- Friday Motivation: ప్రతి మనిషికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఎంతోమంది సూటిపోటి మాటలు విసురుతూనే ఉంటారు. అలాంటివి పట్టించుకోకుండా ముందుకు సాగితేనే ఒక వ్యక్తి సంతోషంగా జీవించగలడు.
మోటివేషనల్ స్టోరీ
Friday Motivation: కష్టాలు లేకుండా, సమస్యలు ఎదుర్కోకుండా ఏ వ్యక్తీ పెద్దవాడు కాలేడు. తన జీవిత ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. విజయం సాధించే ప్రయాణంలో ఇతరులు ఎన్నో రాళ్ళను విసురుతూనే ఉంటారు. ఆ రాళ్ళను ఎవరైతే తన ఎదుగుదలకు పునాదులుగా వేసుకుంటాడో... అతడే తెలివైన వ్యక్తి. సక్సెస్ సాధించేందుకు ఇతరులను కాకుండా మిమ్మల్ని మీరు నమ్ముకోండి. అందరికీ నచ్చేలా కాకుండా మీకు నచ్చేలా ఉండాలి. జీవితం ఒక్కటే... చేయాలనుకున్నవన్నీ చేసేయాలి. లేకుంటే 20 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే చెప్పుకోవడానికి, గర్వపడేందుకు ఏమీ ఉండదు.
మీరు మనసులో ఎలా ఫీల్ అవుతారో అదే మీ ముఖంలో ప్రతిబింబిస్తుంది. అందుకే మీ మనసులో ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలు ఉంచుకోండి.ఆ పాజిటివ్‌తనం మీ ముఖంలోనే కనిపిస్తుంది. ఒక రోజులో 1440 నిమిషాలు ఉంటాయి. అంటే ఒక రోజు మన జీవితంలోకి సంతోషాన్ని ఆహ్వానించేందుకు మీకు 1440 అవకాశాలను అందిస్తున్నట్టే లెక్క. ఆ నిమిషాలలో ఎన్నింటిని మీరు ప్రయోజనకరంగా మార్చుకుంటారనేది మీ మీదే ఆధారపడి ఉంటుంది.
ఉదయం లేవగానే మీ దగ్గర రెండు అవకాశాలు మాత్రమే ఉంటాయి. ఒకటి ఆ రోజును పాజిటివ్‌గా కొనసాగించడం లేదా నెగిటివ్‌గా కొనసాగించడం. మీరు ఎలా కొనసాగిస్తారో... మీ జీవితం కూడా అలానే ఉంటుంది. కాబట్టి ముందుకు వెళ్ళండి. మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు. నెగిటివ్‌గా మాట్లాడే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నువ్వు చేయలేవని, చాలా కష్టపడాల్సి వస్తుందని... మాటలతో తొక్కేవారు ఎంతోమంది. అలాంటి వారి మాటలు ఈటెల్లా గుచ్చుకుంటాయి. అవి పైన పడే బండరాళ్లలా అనిపిస్తాయి. ఆ బండరాళ్లను మీ విజయానికి పునాదిగా మార్చుకొని ముందుకు సాగండి.
జీవితంలో మొదటిగా సాధించాల్సిన విషయం ఒకటి ఉంది... అది మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా జీవించగలగడమే. ఎదుటివారి కోసం జీవించడం ఎప్పుడైతే మొదలు పెడతారో... అప్పుడే మీలో అసహనం పెరుగుతుంది. మీ విజయం ఆమడ దూరం పరిగెడుతుంది. కాబట్టి మీకు నచ్చేట్టు మీరు జీవించడం మొదలు పెట్టండి. జీవితం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. జీవితం ఒక ఖాళీ కాన్వాస్ లాంటిది. దానిపై ఏ రంగులు చల్లాలి అనుకుంటున్నారో, ఎలాంటి పెయింటింగ్ వెయ్యాలనుకుంటున్నారో, ఎంత కలర్ ఫుల్‌గా మార్చాలనుకుంటున్నారో... అంతా మీ ఇష్టమే.
ఎప్పుడూ ఆశావాదిగా ఉండేందుకే ప్రయత్నించండి. నిరాశ వాది తనకు ఎదురైన ప్రతి అవకాశంలో కూడా కష్టాన్ని గుర్తిస్తాడు. కానీ ఆశావాది తనకు ఎదురైన ఇబ్బందుల్లో కూడా అవకాశాలను వెతుకుతాడు.
మీలో కంట్రోల్ చేసుకోవాల్సింది... ముఖ్యంగా కోపం. తొందరగా కోపం తెచ్చుకునే వ్యక్తి మూర్ఖుడితో సమానం. అలాంటి మూర్ఖులు ఎప్పటికీ విజయాలను సాధించలేరు. వెయ్యి యుద్దాలు గెలవడం కాదు... మిమ్మల్ని మీరు గెలవడానికి మొదట ప్రయత్నించండి. మీ గురించి మీరు తెలుసుకోండి. మిమ్మల్ని మీరు గెలిస్తే ఈ ప్రపంచాన్ని గెలవడం పెద్ద కష్టంగా అనిపించదు. భగవద్గీత చెబుతున్న ప్రకారం మనం మన మనసును కంట్రోల్ చేసుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారిపోతుంది. జీవితాన్ని నాశనం చేసేస్తుంది. ఏ పని చేసినా సంతోషంగా చేయాలి. ప్రతి పనిని ఇష్టం లేనట్టు చేస్తే అది ఎప్పటికైనా కష్టంగానే అనిపిస్తుంది.
మీరు జీవితంలో కావాలనుకున్న ప్రతి ఒక్కటి భయం, సమస్యలు అనూ అడ్డుగోడలకు అవతలే ఉంటాయి. మీరు ఆ అడ్డు గోడలను పగలగొట్టి వెళితేనే మీకు కావలసినది మీకు దక్కుతుంది. వాటిని చూసి భయపడితే ఎప్పటికీ విజయాన్ని అందుకోలేరు. ఓటమి అనేది గెలుపుకి ఒక మార్గం. ఓటమి వద్దనుకున్న వాళ్ళు గెలుపును సాధించడం చాలా కష్టం.
తుఫానులను తట్టుకుని బలమైన చెట్లు నిలబడతాయి. అలాగే జీవితంలో కూడా బలమైన తుఫానులను ఎదుర్కొన్ని నిలిచి ఉంటే ఆ వ్యక్తి... తిరుగులేని వ్యక్తిగా రూపాంతరం చెందుతాడు. ఒక్క జీవితాన్ని గొప్పగా చూడాలి. అప్పుడే ఆ జీవితం కూడా గొప్పగా మారుతుంది.