Sankranti Sweet Recipe : సంక్రాంతి స్పెషల్.. కొత్త ఫ్లేవర్ స్వీట్.. ట్రై చేసి చూడండి
15 January 2024, 11:00 IST
- Sankranti Sweet Recipe Telugu : సంక్రాంతి పండగ అంటే పిండి వంటలే గుర్తుకువస్తాయి. అయితే కొత్తరకం వంటకాలు కూడా ట్రై చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చెప్పబోయే స్వీట్ ట్రై చేయండి.
స్వీట్ పొంగల్ రెసిపీ
Sweet Pongal Recipe : సంక్రాంతి వచ్చిందే తుమ్మెద.. సరదాలు తెచ్చిందే తుమ్మెద అనే పాట మీకు గుర్తుంది కదా. బహుశా ప్రతి ఒక్కరూ విన్న పాట ఇది. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సమయంలో సంక్రాంతి పండుగ వస్తుంది. అందుకే దీనిని మకర సంక్రాంతి అని అంటారు. సంక్రాంతి పండుగ నిజంగానే సరదాలు తెస్తుంది. ఎంతో ఆనందంగా కుటుంబ సభ్యులతో గడిపేలా చేస్తుంది.
సంవత్సరంలో మొదటి పండుగ సంక్రాంతి. అలాంటి పండగకి స్పెషల్ స్వీట్ లేకపోతే ఎలా మరి. అందుకే స్వీట్ పొంగల్ తయారు చేయండి. ఆరోగ్యానికి మంచిది. తినేందుకు కూడా కొత్త రుచి ఉంటుంది. సంక్రాంతికే కాకుండా అన్ని సందర్భాల్లోనూ ఈ స్వీట్ సరిపోతుంది. ఇది రుచికరమైనది. కుక్కర్‌ని ఉపయోగించి స్వీట్ పొంగల్‌ను సులభంగా తయారుచేసే రెసిపీ గురించి తెలుసుకుందాం..
స్వీట్ పొంగల్ తయారీకి కావాల్సిన పదార్థాలు : బియ్యం - ఒక కప్పు, శనగపప్పు-అరకప్పు, పాలు - ఒక కప్పు, బెల్లం - అరకప్పు, కొబ్బరి తురుము - అరకప్పు, ఏలకులు - 4, జీడిపప్పు, ద్రాక్షపప్పులు పిడికెడు, నెయ్యి-అరకప్పు.
స్వీట్ తయారు చేసే విధానం
మెుదట శనగలు కొద్దిగా వేయించుకోవాలి. నెయ్యిలో వేయించుకుంటే బాగుంటుంది. తర్వాత బియ్యాన్ని కడగాలి. కుక్కర్‌లో కడిగిన బియ్యం, కొద్దిగా వేయించిన పప్పు రెండింటినీ వేసుకోవాలి. అందులో సరిపడే పరిమాణంలో నీరు పోసి మూతపెట్టాలి. రెండు లేదా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు బెల్లంను సన్నగా తరిగి మెత్తగా రుబ్బుకోవాలి. బెల్లం పొడిని వేడినీటిలో కరిగించండి. బెల్లం పానకం లాగా చేసుకోవాలి.
కుక్కర్ లోని పదార్థం చల్లారిన తర్వాత మూత తీసి చూడండి. అన్నం, పప్పు బాగా ఉడికించాలి. ఈ మిశ్రమంలో కప్పు పాలు, బెల్లం నీళ్లు పోసి బాగా కలపాలి. తురిమిన పచ్చి కొబ్బరి వేసి కలపాలి. ఇప్పుడు కాసేపు మంట మీద పెట్టుకోవాలి. ఇప్పటికే కుక్కర్‌లో ఉడికించినందున ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన పనిలేదు. పది నిమిషాలు ఉడికిస్తే చాలు. తియ్యగా కావాలంటే కాస్త పంచదార లేదా బెల్లం వేసుకోవచ్చు.
మరొక పాత్రలో అరకప్పు నెయ్యి వేసి వేడయ్యాక అందులో ఏలకులు, జీడిపప్పు, ద్రాక్ష చూర్ణం వేయాలి. దీన్ని తయారు చేసుకున్న పొంగల్ పై వేసి బాగా కలుపుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ స్వీట్ పొంగల్ రెడీ. ఈ స్వీట్ శరీరానికి ఎంతో చల్లదనాన్ని ఇస్తుంది. ఇందులోని బెల్లం శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. సులభంగా జీర్ణం కూడా అవుతుంది. వెంటనే ఈ కొత్త స్వీట్ పొంగల్ తయారు చేయండి.