Brain Tumor Symptoms । తలనొప్పి కూడా బ్రెయిన్ ట్యూమర్‌కు ఒక సంకేతం, మిగతా లక్షణాలు ఇలా ఉంటాయి!
08 June 2023, 9:59 IST
- Brain Tumor Symptoms: మెదడు కణితి సంకేతాలు ఇతర వ్యాధుల కంటే ఎక్కువ గందరగోళం సృష్టిస్తాయి, ఎందుకంటే మెదడు కణతి లక్షణాలు సాధారణంగా అనిపించవచ్చు. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.
Brain Tumor Symptoms:
Brain Tumor Day: బ్రెయిన్ ట్యూమర్ అనేది మెదడులోని కణాలు అసాధారణ రీతిలో పెరగడం వలన ఏర్పడే ఒక పరిస్థితి. మెదడులో పెరిగిన ఈ కణితులు అన్నీ ప్రాణాంతకమైనవి లేదా క్యాన్సర్ కణాలు కావు. కొన్నిసార్లు బ్రెయిన్ క్యాన్సర్ వలన కూడా మెదడులో కణతులు ఏర్పడతాయి. క్యాన్సర్ మెదడు కణితులు వేగంగా పెరుగుతాయి, మెదడును ఆక్రమిస్తాయి. క్యాన్సర్ కాని మెదడు కణతులు నెమ్మదిగా పెరుగుతాయి. అయితే ఈ మెదడు కణితులు అన్నీ కూడా అవి మెదుడులో అభివృద్ధి చెందిన భాగాన్ని బట్టి లక్షణాలను చూపించవచ్చు లేదా చూపించకపోవచ్చు. మెదడులోని చురుకుగా లేని భాగాలలో కణితి అభివృద్ధి చెందితే, ఆ కణితి చాలా పెద్దదిగా పెరిగే వరకు లక్షణాలు కనిపించకపోవచ్చు.
మెదడు కణితి సంకేతాలు ఇతర వ్యాధుల కంటే ఎక్కువ గందరగోళం సృష్టిస్తాయి, ఎందుకంటే మెదడు కణతి లక్షణాలు సాధారణంగా అనిపించవచ్చు. ఉదాహారణకు బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చే తలనొప్పిని, సాధారణమైన నొప్పిగా భావించి పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. కానీ ఇది తాత్కాలికమైన ఉపశమనం ఇవ్వొచ్చు లేదా మాత్ర పనిచేయకపోవచ్చు. అలాగే వాంతులు, వికారం ఉంటాయి, ఇది జీర్ణ సమస్యగా అపోహ పడవచ్చు.
బ్రెయిన్ ట్యూమర్ అని తెలియకుండా ప్రజలు విస్మరించే కొన్ని సంకేతాలు, లక్షణాల గురించి గురుగ్రామ్‌లోని న్యూరోవాస్కులర్ ఇంటర్వెన్షన్, స్ట్రోక్ స్పెషలిస్ట్ డాక్టర్ విపుల్ గుప్తా వివరించారు. డాక్టర్ గుప్తా ప్రకారం బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు (Brain Tumor Symptoms) ఎలా ఉంటాయో తెలుసుకోండి.
1. నిరంతర తలనొప్పి
తలనొప్పులు నిరంతరంగా కొనసాగటం, ఎంతకీ తగ్గకపోగా మరింత కావడం, తలనొప్పి కొత్తగా అనుభూతి చెందుతున్నట్లు అనిపిస్తే దానిని తేలికగా తీసుకోకూడదు. తలనొప్పి సాధారణమైనప్పటికీ, తీవ్రతలో ఏదైనా భయంకరమైన మార్పు లేదా ఇతర లక్షణాలతో సంబంధం ఉన్నట్లయితే తక్షణ వైద్య సహాయం అవసరం.
2. దృష్టి సమస్యలు
అస్పష్టమైన దృష్టి, డబుల్ దృష్టి లేదా ఆకస్మికంగా దృశ్యాలు కనిపించకపోవడం వంటి దృష్టి లోపాలు కూడా అంతర్లీన మెదడు కణితిని సూచించవచ్చు. అటువంటి దృష్టిలోపాలు అనుభవిస్తున్నప్పుడు ఆ సంకేతాలను విస్మరించకూడదు.
3. వికారం- వాంతులు
నిరంతర వికారం, వాంతులు లేదా మైకముగా అనిపించడం, వివరింలేని విధంగా పరిస్థితి ఉన్నట్లయితే అది కణితి కారణంగా మెదడులో ఒత్తిడి పెరగడం వల్ల కలిగే లక్షణాలు.
4. మూర్ఛలు
వివరించలేని మూర్ఛలు, ముఖ్యంగా ఇదివరకు ఫిట్స్ రానివారికి కూడా కొత్తగా ఫిట్స్ రావడం జరుగుతుందంటే, క్షుణ్ణంగా మెదడును స్కాన్ చేయవలసి ఉంటుంది. మూర్ఛలు మెదడు కణితికి ముందస్తు హెచ్చరికల లాంటివి. ఎటువంటి ఆలస్యం చేయకుండా వైద్య సహాయం పొందాలి.
బ్రెయిన్ ట్యూమర్ వలన వ్యక్తుల ప్రవర్తనలో కూడా మార్పులు కనిపిస్తాయి. సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ లో న్యూరోసర్జరీ విభాగానికి చెందిన డాక్టర్ వివేక్ అగర్వాల్ మెదడు కణితి కారణంగా కలిగే సాధారణ ప్రవర్తన, ఇంద్రియ మార్పులను తెలియజేశారు, అవి ఈ రకంగా ఉంటాయి.
1. ఉదయాన్నే అధ్వాన్నంగా అనిపించే తలనొప్పి లేదా ఒత్తిడి
2. వికారం లేదా వాంతులు
3. అస్పష్టమైన దృష్టి, రెండుగా కనిపించడం లేదా చూపు కోల్పోవడం వంటి కంటి సమస్యలు
4. ఒక చేయి లేదా కాలులో స్పర్శ లేదా కదలికను కోల్పోవడం
5. బ్యాలెన్స్‌లో ఇబ్బంది
6. మాట్లాడటం సమస్యలు
7. చాలా అలసిపోయినట్లు అనిపించడం
8. రోజువారీ విషయాలలో గందరగోళం
9. మెమరీ సమస్యలు
10. సాధారణ పనులు చేసుకోలేకపోవడం
11. వ్యక్తిత్వం లేదా ప్రవర్తన మార్పులు
12. మూర్ఛలు
13. వినికిడి సమస్యలు
14. మైకము
15. చాలా ఆకలిగా అనిపించడం, ఆకస్మికంగా బరువు పెరగడం
బ్రెయిన్ ట్యూమర్ల నిర్ధారణ, చికిత్స
CT స్కాన్ లేదా MRI స్కాన్‌ల సహాయంతో న్యూరాలజిస్ట్ లేదా న్యూరో సర్జన్ బ్రెయిన్ ట్యూమర్ ను నిర్ధారించగలడు. సకాలంలో రోగనిర్ధారణ ద్వారా చికిత్స వేగవంతం అవుతుంది. ఆలస్యం చేస్తే చికిత్స చేసినా మెరుగైన ఫలితాలు ఉండకపోవచ్చు. అన్ని మెదడు కణితులకు శస్త్రచికిత్స అవసరం లేదు. కానీ, లక్షణాలు తీవ్రంగా ఉంటే సర్జరీ చేసి కణతి పరిమాణాన్ని తగ్గించవచ్చు. నేడు బ్రెయిన్ ట్యూమర్ చికిత్సకు అధునాతన చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి.