Toothbrush | మళ్లీ అదే టూత్‌బ్రష్‌తో బ్రష్ చేస్తున్నారా?
22 May 2022, 6:37 IST
- టూత్‌బ్రష్‌తో దంతాలను శుభ్రపరుచుకోవడం ఎంత ముఖ్యమో ఉపయోగించిన ఆ టూత్ బ్రష్‌ను కూడా క్రమం తప్పకుండా శుభ్రపరుచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. టూత్ బ్రష్‌ను ఎలా శుభ్రపరుచుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
Regularly clean your toothbrush
మీరు ప్రతిరోజూ మీ దంతాలను, నోటిని శుభ్రం చేసేందుకు బ్రష్ చేస్తారు. మరి అలాగే మీ టూత్ బ్రష్‌ను కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేస్తున్నారా? నోరు అనేక రకాల క్రిములు, బ్యాక్టీరియాలకు నిలయంగా ఉంటుంది. మనం తినే ఆహారం దంతాల సందుల్లో ఇరుక్కొని క్రిముల వృద్ధికి మరింత కారణమవుతుంది.
అదేసమయంలో బ్రష్ ద్వారా దంతాలను, నోటిని శుభ్రపరిచినపుడు ఆ క్రిములు, బ్యాక్టీరియాలు, టూత్‌పేస్ట్, ఆహార వ్యర్థాలు కొన్ని సందర్భాల్లో రక్తం టూత్ బ్రష్‌కు అంటుకుంటాయి. బ్రష్ చేసిన అనంతరం టూత్ బ్రష్‌ను నీటితో కడిగినప్పటికీ మన కంటికి కనిపించని సూక్ష్మజీవులతో బ్రష్‌కు అంటుకున్న మురికి అలాగే ఉంటుందని పలు అధ్యయనాల్లో నిరూపితమైంది. అదే బ్రష్‌ను మళ్లీ ఉపయోగిస్తే రోగాల బారినపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ టూత్ బ్రష్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి.
టూత్ బ్రష్ హ్యాండిల్స్, బ్రిసిల్స్‌పై వేలాది రకాల సూక్ష్మజీవులు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. వీటితో మరీ అంత ప్రమాదం లేకపోయినా కొన్ని సూక్ష్మ క్రిములు ఫ్లూ, వాంతులు, విరేచనాలు ఇతర ఇన్‌ఫెక్షన్లను కలిగిస్తాయి.
అందువల్ల క్రిములను తొలగించే టూత్ బ్రష్‌ను కూడా క్రిమిసంహారకం చేయడం మంచిది అని చెబుతున్నారు. అదే విధంగా ఒకే బ్రష్‌ను మూడు- నాలుగు నెలలకు మించి వాడకూడదని సూచిస్తున్నారు. మీ అవసరాలకు తగినట్లుగా నాణ్యమైన బ్రష్‌ను ఉపయోగించాలని పేర్కొంటున్నారు.
టూత్ బ్రష్‌ను ఈ విధంగా శుభ్రం చేయండి
- బ్రష్ చేసే ముందు మీ టూత్ బ్రష్‌ను ఒక హైడ్రోజన్ పెరాక్సైడ్ తో శుభ్రంచేయండి. ఒక కప్పు నీటిలో కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సైడ్ పోసి ఒక 15 నిమిషాల పాటు బ్రష్‌కు ఉండే ముళ్ళను (బ్రెసిల్స్ ) నానబెట్టండి ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోని బ్రష్ ఉపయోగించవచ్చు.
- ఒక గిన్నెలో కొద్దిగా యాంటీ బాక్టీరియల్ మౌత్ వాష్‌ను తీసుకొని మీ టూత్ బ్రష్‌ను ఈ ద్రావణంలో ఒక 30 సెకన్ల పాటు గిరగిరా స్విష్ చేయండి.
- రెండు టీస్పూన్ల బేకింగ్ సోడాను కప్పు నీటిలో కలిపి ఈ ద్రావణంతో బ్రష్‌ను శుభ్రపరుచుకోవచ్చు.
- సిట్రిక్ ఆసిడ్, డిటర్జెంట్, సోడియంబైకార్బోనేట్ గుణాలున్న డెంచర్ క్లీనర్లతో కూడా టూత్ బ్రష్‌ను శుభ్రపరుచుకోవచ్చు.
- వైట్ వెనెగర్ ద్రావణంతో వారానికోసారైనా శుభ్రపరుచుకోవాలి.
- బ్రష్ చేసే ముందు వేడివేడి నీటిలో టూత్ బ్రష్‌ను ఉంచి, బాగా రుద్దుతూ శుభ్రం చేయవచ్చు. ఎయిర్ డ్రయ్యర్ కింద ఉంచి కూడా శుభ్రంచేసుకోవచ్చు.
ఇక, టూత్ బ్రష్‌ను వాష్ రూంలో కాకుండా బయట పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నచోట ఉంచుకోవాలి. అలాగే ఒకరి టూత్ బ్రష్‌ను మరొకరు ముమ్మాటికి వాడకూడదు. ఇక.. హ్యాప్పీగా, హెల్తీగా బ్రష్ చేయండి.
టాపిక్