తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Non Stick Pan Dangers: నాన్‌స్టిక్ పాన్ అధిక ఉష్ణోగ్రత వద్ద వేడైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు

Non Stick Pan Dangers: నాన్‌స్టిక్ పాన్ అధిక ఉష్ణోగ్రత వద్ద వేడైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు

HT Telugu Desk HT Telugu

28 October 2023, 7:40 IST

google News
    • ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం నాన్ స్టిక్ పాన్లు వాడడం అంత మంచిది కాదు. నాన్ స్టిక్ పాన్‌లు ఎందుకు వాడకూడదో వివరిస్తున్నారు నిపుణులు.
నాన్ స్టిక్ పాన్
నాన్ స్టిక్ పాన్ (pixabay)

నాన్ స్టిక్ పాన్

ఇప్పుడు ప్రతి ఇంట్లో నాన్ స్టిక్ వంట సామాను ఉండడం ఫ్యాషన్ అయిపోయింది. ఈ నాన్ స్టిక్ పాన్‌లు వచ్చాక వంట సులభతరం అవడంతో వీటికి ఆదరణ ఎక్కువైంది. కూరలు మాడకపోవడం, సౌకర్యవంతంగా ఉండడం, చూడడానికి అందంగా ఉండడం... వీటి ప్లస్ పాయింట్లు. అందుకే వంట గదిలో ఇవి అగ్రస్థానాన్ని ఆక్రమించేసాయి. అయితే ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం నాన్ స్టిక్ పాన్లు వాడడం అంత మంచిది కాదు. నాన్ స్టిక్ పాన్‌లు ఎందుకు వాడకూడదో వివరిస్తున్నారు నిపుణులు.

నాన్-స్టిక్ ప్యాన్‌లు పాలిటెట్రాఫ్లోరోఎథిలిన్ (PTFE) అనే పదార్థంతో పూత పూసి ఉంటాయి. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ PTFE పెర్ఫ్లోరోక్టానోయిక్ యాసిడ్ (PFOA)తో సహా విషపూరిత పొగలను విడుదల చేస్తుంది. ఈ పొగలు "పాలిమర్ ఫ్యూమ్ ఫీవర్" అని పిలిచే ఫ్లూ లాంటి లక్షణాలకు దారితీయవచ్చు. అంతేకాకుండా PTFE పూత కాలక్రమేణా రాలిపోతుంటుంది. ఈ కారణంగా దాని నుంచి వెలువడే హానికరమైన సమ్మేళనాలు మనల్ని అనారోగ్యం బారినపడేలా చేస్తాయి.

ఈ సమస్యలు రావచ్చు

నాన్ స్టిక్ పాత్రలు వాడేటప్పుడు గీతలు పడడం సహజం. సాధారణ స్టీలు, ఇనుము, అల్యూమినియం పాత్రలపై గీతలు పడినా ఎలాంటి సమస్యా ఉండదు. ఎందుకంటే దానిపై ఎలాంటి రసాయనాల పూత ఉండదు. కానీ నాన్ స్టిక్ పాత్రలపై గీత పడినప్పుడు ఆ గీత వెంబడి ఉన్నా రసాయనాలు చిన్న కణాల రూపంలో ఆహారంలోనే కలుస్తాయి. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరమైనది. సాంప్రదాయ వంట సామానుతో పోలిస్తే నాన్ స్టిక్ పాన్ల జీవితకాలం చాలా తక్కువ.

స్టీలు, ఇత్తడి, ఇనుము, అల్యూమినియం వంటి వాటితో చేసిన వంట సామాను ఎక్కువ కాలం మనుగడలో ఉంటుంది. కానీ నాన్ స్టిక్ పూత త్వరగా పోతుంది. నాన్ స్టిక్ వంట సామానులు తయారు చేసే పద్ధతిలో గ్రీన్ హౌస్ వాయువుల విడుదల అధికంగా ఉంటుంది. నాన్ స్టిక్ పై వేసే కోటింగ్ తయారీలో విపరీతమైన రసాయనాలను వాడతారు. ఇవన్నీ కూడా పర్యావరణానికి హాని కలిగించేవే. నాన్ స్టిక్ పాన్లను అధిక మంట వద్ద వండకూడదు. దానిపై వేసిన కోటింగ్ దెబ్బతింటుంది. హానికరమైన పదార్థాలను గాలిలోకి విడుదల అయ్యేలా చేస్తుంది.

దీనివల్ల ఇంట్లో మీరు పీల్చే గాలి కూడా విషపూరితంగా మారే అవకాశం ఉంది. ఇలాంటి రసాయనాల కోటింగ్ వేసిన నాన్ స్టిక్ పాన్లను ఉపయోగించడం వల్ల దీర్ఘకాలంలో థైరాయిడ్ రుగ్మతలు, సంతానోత్పత్తి సమస్యలు, క్యాన్సర్ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే పలు అధ్యయనాలు సూచిస్తున్నాయ కాబట్టి నాన్ స్టిక్ పాన్లు వాడే ముందు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోండి. పాత సాంప్రదాయ వంట సామాన్లను వాడడమే ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది.

తదుపరి వ్యాసం