Navaratri 2023 : ఈ 9 ప్రాంతాల్లో దసరా సెలబ్రేషన్స్ అదిరిపోతాయి.. వెళ్లి రండి..
11 October 2023, 15:30 IST
- Dussehra Celebrations : దసరా భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. వైభవంగా జరుపుకొంటారు. ఒక్క ప్రాంతంలో ఒక్కో విశిష్టత ఉంటుంది. కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. మీరు దసరా వేడుకలను ఎంజాయ్ చేయాలనుకుంటే.. తప్పక సందర్శించాల్సిన 9 ప్రదేశాలు ఉన్నాయి.
దసరా వేడుకలు
శరన్నవరాత్రి వేడుకలను ఎంజాయ్ చేయాలనుకునేవారు కొన్ని ప్రదేశాలను సందర్శించొచ్చు. దసరా అనేది కొన్ని నగరాల్లో వైభవంగా జరుపుకొనే పండుగ. ఇది 10 రోజుల పండుగ. దేశంలోని వివిధ ప్రాంతాలలో గొప్పగా చేస్తారు. అక్టోబర్ 24న దసరా వేడుకలు నిర్వహించనున్నారు. కొన్ని ప్రాంతాల్లో అత్యంత వైభవంగా జరుపుతారు. వాటి గురించి తెలుసుకుందాం..
దుర్గా పూజ, పశ్చిమ బెంగాల్
దుర్గాపూజ వేడుకలకు కోల్‌కతాలో ఘనంగా చేస్తారు. విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు నదికి తీసుకువెళతారు. దేశ వ్యాప్తంగా కోల్‍కతా దసరా వేడుకలు ఫేమస్. వివిధ ఆచారాలలో వివాహిత స్త్రీలు దుర్గాదేవికి స్వీట్లను సమర్పించడం చేస్తుంటారు. ఒకరికొకరు పంచుకుంటారు. పెద్ద ఊరేగింపుగా దేవత విగ్రహాలను హుగ్లీ నదికి తీసుకువెళ్తారు. చూసేందుకు చాలా బాగుంటుంది.
రాంలీలా మైదాన్, ఢిల్లీ
దసరా పండుగను ఎంజాయ్ చేసేందుకు అత్యుత్తమ ప్రదేశాలలో ఢిల్లీ ఒకటి. తొమ్మిది రోజుల వేడుకల్లో భాగంగా హస్తిన మెుత్తం మెలకువతోనే ఉంటుంది. రాత్రి అనేది లేదేమో అనిపించేలా వేడుకలు ఉంటాయి. ఈ కాలంలో చాలామంది శాఖాహారాన్ని మాత్రమే తీసుకుంటారు. రాంలీలా మైదానంలో దసరా నాడు రావణుడి బొమ్మను దహనం చేస్తారు.
మైసూర్ దసరా, కర్ణాటక
కర్ణాటకలోని మైసూర్‌లో దసరాను ఘనంగా జరుపుకొంటారు. ఇక్కడ దసరా అనేది ప్రసిద్ధ పండగ. మైసూర్ ప్యాలెస్ రాత్రిపూట అద్భుత దృశ్యంగా కనిపిస్తూ ఉంటుంది. రాజభవనంలో ఉన్న దేవతను మెుదట పూజిస్తారు. ఊరేగింపులో దేవతను అలంకరించి ఏనుగుపై ఉంచుతారు. దీనికి ముందర కళాకారులు ఆకట్టుకునే సంగీత, నృత్య ప్రదర్శనలు చేస్తారు. అలంకరించిన ఏనుగులు, గుర్రాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.
రాంనగర్ రాంలీలా, వారణాసి
దసరా ఆనందాన్ని అనుభవించడానికి వారణాసి మంచి గమ్యస్థానం. భారతదేశంలోని పురాతన నగరాలలో ఒకటి ఇది. ఇక్కడ రాంలీలా సంప్రదాయాన్ని పాటిస్తారు. 1800ల నాటి నుంచి కొనసాగుతోంది. పురాణ కథను కళాకారులు పలు వేషల్లో చూపిస్తారు. ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్తుంటే.. జనాలకు కూడా వారిని అనుసరిస్తారు.
కోట దసరా మేళా, రాజస్థాన్
రాజస్థాన్‌లోని కోట దసరా వేడుకలు ప్రసిద్ధి చెందింది. దసరా పండుగ రోజున, ఉదయం రాజభవనంలో మతపరమైన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. తదనంతరం రాజ కుటుంబ సభ్యులు జాతర మైదానానికి ఊరేగింపు నడుమ వస్తారు. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుల బొమ్మలు ఉంటాయి. ఈ బొమ్మలను దహనం చేసియ ఉత్సవాలను ప్రారంభిస్తారు. వాటిలో ఉన్న పటాకులు పేలి.. చూసేందుకు కన్నులవిందుగా ఉంటుంది. తర్వాత స్థానిక హస్తకళతో జాతర జరుగుతుంది.
బతుకమ్మ, తెలంగాణ
ఇక తెలంగాణలో జరిగే బతుకమ్మ వేడుకల ప్రత్యేకతే వేరు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలను పూజిస్తారు. రోజుకో రకమైన బతుకమ్మను పేరుస్తారు. ఆడపడుచులు ఆడిపాడతారు. చివరి రోజు సద్దుల బతుకమ్మ జరుగుతుంది. బతుకమ్మను తీసుకెళ్లి చెరువుల్లో నిమజ్జనం చేస్తారు.
బస్తర్ దసరా, ఛత్తీస్‌గఢ్
దీనిని బస్తర్ దసరా అని పిలుస్తారు. ఈ పండుగ రావణుడిని రాముడు ఓడించిన కథగా మాత్రమే నిర్వహించరు. ఈ 75 రోజుల పండుగను ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లోని గిరిజన ప్రాంత రక్షక దేవతగా పరిగణించే దంతేశ్వరి దేవి గౌరవార్థం చేస్తారు. ఇతర దైవుళ్లతో కలిపి నిర్వహిస్తారు. ఈ పండుగ 15వ శతాబ్దానికి చెందిన కాకతీయ రాజవంశానికి చెందిన రాజు పురుషోత్తం దేవు మెుదలుపెట్టినట్టుగా చెబుతారు. ఒడిశాలోని పూరీ తీర్థయాత్ర నుండి తిరిగి వచ్చినప్పుడు ప్రారంభించాడట. బస్తర్ దసరాలో రథ ఊరేగింపులు వివిధ దేవతల సందర్శన, గిరిజన పెద్దల సమావేశాలు, కృతజ్ఞతా వేడుకలు వంటి అనేక ఆచారాలు ఉంటాయి.
కులు దసరా, హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్‌లో దసరా సందర్భంగా మనాలికి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కులు పట్టణంలో అట్టహాసంగా జరుగుతుంది. ఈ ప్రాంతంలోని ప్రముఖ దేవతలందరూ రఘునాథుని దర్శనం చేసుకోవడానికి తరలివస్తారు. ఈ విశిష్టమైన పండుగ దసరా నాడు మొదలై ఏడు రోజుల పాటు సాగుతుంది. దేవతలను పల్లకిలలో కులుకు తీసుకొస్తారు.
బరారా, హర్యానా
బరారా హర్యానాలో అంతగా తెలియని పట్టణం. కానీ దసరా సమయంలో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఈ పట్టణంలో ఎత్తైన రావణుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో బరారా.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానాన్ని సంపాదించుకుంది. మీరు దసరా వేడుకల చూడాలనుకుంటే.. బరారా తప్పనిసరిగా సందర్శించాలి.