తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Daughters Day 2024: జాతీయ కుమార్తెల దినోత్సవం, మీ కూతుళ్లూ మీ రక్తమే, వారికి విలువివ్వండి గుండెల మీద బరువనుకోకండి

Daughters day 2024: జాతీయ కుమార్తెల దినోత్సవం, మీ కూతుళ్లూ మీ రక్తమే, వారికి విలువివ్వండి గుండెల మీద బరువనుకోకండి

Haritha Chappa HT Telugu

22 September 2024, 6:00 IST

google News
    • National Daughters day 2024: ఏటా మనదేశంలో సెప్టెంబర్ చివరి ఆదివారాన్ని జాతీయ కూతుళ్ల దినోత్సవంగా నిర్వహించుకుంటాం. ఇంట్లో పుట్టిన ఆడపిల్లలను కాపాడుకోమని చెప్పేందుకే ఈ ప్రత్యేక దినోత్సవం.
జాతీయ కుమార్తెల దినోత్సవం
జాతీయ కుమార్తెల దినోత్సవం (Unsplash)

జాతీయ కుమార్తెల దినోత్సవం

National Daughters day 2024: పురాతన కాలం నుంచి మన దేశంలో ఇంట్లో పుట్టిన అబ్బాయిలను ఎక్కువగా, అమ్మాయిలను తక్కువగా చూసే అలవాటు ఉంది. ఇప్పటికీ కొన్నిచోట్ల కొడుకులను అధికంగా చూసే సంప్రదాయం కొనసాగుతుంది. అనేక సంస్కృతులలో కొడుకులకు దక్కుతున్నంత గౌరవం, కూతుళ్లకు దక్కడం లేదు. కొడుకును పెద్ద చదువులు చదివించేందుకు, వారి కోసం ఏం చేసేందుకైనా తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు.

ఆడపిల్లలు ఎప్పటికైనా తమ ఇల్లు విడిచి, వేరే ఇంటికి వెళతారనే అభిప్రాయం ఇప్పటికీ ఎంతో మంది తల్లిదండ్రుల్లో ఉంది. అందుకే వారిని చదివించేందుకు, వారిపై ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టేందుకు, ఆస్తుల్లో భాగం ఇచ్చేందుకు ఇష్టపడరు. కానీ ఒక విషయాన్ని మాత్రం వారు మర్చిపోతున్నారు... తమ రక్తం కొడుకుల్లోనే కాదు, కూతురులో కూడా ప్రవహిస్తోందని.

ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉండాలని, వారిని కాపాడుకోవాలని చెప్పేందుకే ‘నేషనల్ డాటర్స్ డే’ నిర్వహించుకుంటున్నాం. ఆడపిల్లల విలువను తెలియజేప్పేందుకు ఏటా సెప్టెంబరులో వచ్చే నాలుగో ఆదివారం ఈ ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారింది.

కూతురు వస్తువు కాదు, మీ రక్తం...

ఇంట్లో పుట్టిన ఆడపిల్లలను మరింత గౌరవించాలని, ప్రేమ చూపించాలని ప్రతి తల్లీదండ్రీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కూతురు వస్తువు కాదు... పెళ్లయ్యాక వేరే ఇంటికి ఇచ్చి వదిలించుకోవడానికి. ఆమెలో ప్రవహిస్తున్నది మీ రక్తమే. కొడుక్కి తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, సంరక్షణ పొందే అర్హత ఎంత ఉందో... ఆ ఇంట్లో పుట్టిన కూతురికి కూడా అంతే అర్హత ఉందని ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే ఈ ప్రత్యేకమైన రోజు సారాంశం.

లింగ సమానత్వం

డాటర్స్ డే వెనుక అసలు ఉద్దేశం లింగ సమానత్వం కూడా. మనదేశంలో కొడుకులతో సమానంగా కూతుళ్లకు ప్రేమ, విద్యావకాశాలను అందించాలని సమాజానికి చెప్పేందుకే ఈ కూతుళ్ల దినోత్సవం. తల్లిదండ్రులే వివక్షాపూరిత వైఖరిని ప్రదర్శిస్తే, పిల్లల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తే ఇంకెవరూ వారికి న్యాయం చేయలేరు.

ఎప్పటి నుంచి మొదలు

భారతదేశంలో కూతుళ్లను చూసే చరిత్రను బట్టి ఈ ప్రత్యేక దినోత్సవం పుట్టుకొచ్చింది. జాతీయ కుమార్తెల దినోత్సవం 2007లో మొదటిసారిగా నిర్వహించుకున్నారు. ఒక ఇంట్లో కొడుకు, కూతురు... ఇద్దరిలో ఒకరిని ఎంచుకోమంటే కొడుకుని ఎంచుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. యూనిసెఫ్ చెబుతున్న ప్రకారం అబ్బాయిల కంటే బాలికల మరణాల రేటు ఎక్కువగా ఉన్న ప్రధాన దేశం మనదే. మనదేశంలో ప్రతి 1,000 మంది అబ్బాయిలకు 900 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అయిదేళ్లలోపులోనే మరణిస్తున్న బాలికల సంఖ్య మన దేశంలోనే ఎక్కువగా ఉంది. అన్ని రకాలుగా అమ్మాయిలే సొంత ఇంట్లో అధికంగా వివక్షకు గురవుతున్నారు. వివక్ష నుంచి వారిని కాపాడేందుకే ఈ ప్రత్యేక దినోత్సవం నిర్వహించుకుంటున్నాం.

జాతీయ కుమార్తెల దినోత్సవం సందర్భంగా కూతుళ్లు ఉన్న ప్రతి తల్లీదండ్రికి ‘హ్యాపీ డాటర్స్ డే’. వారికి ఇంట్లో కొడుకులతో సమానంగా అవకాశాలను కల్పించి వారికి ఉన్నతికి తోడ్పడండి.

టాపిక్

తదుపరి వ్యాసం